విశాఖ‌లో వైసీపీని రోడ్డున ప‌డేస్తున్న ఆ ముగ్గురు

January 23, 2018 at 5:58 pm
YSRCP, Visakhapatnam, Ushakiran, chandra mouli, sathi rama krishna reddy, politics

ఒక‌ప‌క్క వైసీపీ అధినేత జ‌గ‌న్ రాష్ట్ర‌మంతా సుదీర్ఘ పాద‌యాత్ర చేస్తూ.. అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటే.. నేత‌లు మాత్రం క‌త్తులు దూసుకుంటున్నారు. ఆధిప‌త్య పోరు, అంత‌ర్గత విభేదాలు, కుమ్ములాటల్లో మునిగిపోతున్నారు. స‌మ‌ష్టిగా నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన నేత‌లు చెరోదారిలో ప్ర‌యాణిస్తున్నారు. ముఖ్యంగా విజ‌య‌వాడ త‌ర్వాత కీల‌క‌మైన డెస్టినీ సిటీ విశాఖ‌లో పార్టీ ప‌రిస్థితి నానాటికీ దిగ‌జారుతోంది. కీల‌క నియోజ‌క‌వ‌ర్గానికి ఇన్‌చార్జులుగా ఉన్న ముగ్గురు నాయ‌కులు.. పైకి క‌లిసిక‌ట్టుగా తిరుగుతున్న‌ట్లు క‌నిపించినా.. ఒక‌రిపై ఒక‌రు ఆధిప‌త్యం సాధించేందుకు తెర‌వెనుక మంత‌నాలు కొన‌సాగిస్తున్నార‌ట‌. వీరి చ‌ర్య‌ల‌తో పార్టీకి ఉన్న అంతో ఇంతో ప‌రువు కూడా బ‌జారున ప‌డుతోంద‌ని మిగిలిన నేత‌లు వాపోతున్నారు. 

కీల‌క‌మైన ఎన్నిక‌ల ఏడాదిలో వైసీపీలో అంత‌ర్గ‌త విభేదాలు, కుమ్ములాట‌లు భ‌గ్గుమంటున్నాయి. సీఎం పీఠంపై కూర్చోవాలని క‌ల‌లు గంటున్న అధినేత ఆశ‌ల‌కు నాయ‌కులే గండికొడుతున్నారు. స్మార్ట్ సిటీ విశాఖలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు నానాటికీ పెరిగిపోతున్నాయి. జిల్లాలోని పలు నియోజకవర్గాలలో సమన్వయకర్తల మధ్య ఏమాత్రం సఖ్యత లేదు. ఒకరి మీద ఒకరు ఎత్తులు, పైఎత్తులు వేసుకుంటూ పార్టీ పరువు తీస్తున్నారని ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సమన్వయకర్తలైన ఉషాకిరణ్, చంద్రమౌళి, సత్తి రామకృష్ణారెడ్డి మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరుకుందట‌. 

ఈ ముగ్గురు సమన్వయకర్తలు పార్టీ సమావేశాల్లో, కార్యక్రమాల్లో కలిసి పనిచేస్తున్నట్లు క‌నిపిస్తున్నా.. ఒకరి మీద మరొకరు అధిపత్యం సాధించడానికి అంతర్గతంగా పావులు కదుపుతూనే ఉన్నారట. ఈ పరిణామమే పార్టీకి తలవంపులు తెస్తోందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో ఉషాకిరణ్‌ను సమన్యకర్త బాధ్యత నుంచి తప్పించాలంటూ పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌కి ఈ మధ్య కొంతమంది ఫిర్యాదు చేశారు! ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్తగా తనను తప్పించాలని మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ కోరగా.. ఆయ‌న స్థానంలో వార్డు అధ్యక్షుడు అయిన చంద్రమౌళిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. 

దీనిపై పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సీనియర్లను కాదని, ఒక వార్డు అధ్యక్షుడికి సమన్వయకర్త బాధ్యతలు అప్పగిస్తే పనిచేయలేమంటూ కొందరు రుసరుసలాడారు. దీంతో పార్టీ హైకమాండ్ స్పందించి చంద్రమౌళితో పాటు ఉషాకిరణ్, సత్తి రామకృష్ణారెడ్డిలను కూడా సమన్వయకర్తలుగా నియమించింది. ఇలాగైనా తమ సమస్యకు పరిష్కారం దొరికిందని వైసీపీ క్యాడర్‌ భావిస్తున్న తరుణంలో మరో సమస్య తెరపైకి వచ్చింది. నియోజకవర్గంలో తమకు అనుకూలంగా లేని వార్డుల్లో అధ్యక్షులను మార్చేసి, ఆయా చోట్ల తమకు సానుకూలంగా ఉన్నవారిని నియమించుకో వాలని  వీరు ఆలోచన చేస్తున్నారట. ఈ ధోరణే పార్టీ కొంప ముంచుతోందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

 

విశాఖ‌లో వైసీపీని రోడ్డున ప‌డేస్తున్న ఆ ముగ్గురు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share