ప‌శ్చిమ‌లో జగన్ టార్గెట్ ఇదే..

June 2, 2018 at 7:41 pm
jagan

ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర పేరుతో ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేస్తున్న పాద‌యాత్ర ఆయా జిల్లాల్లోకి ప్ర‌వేశించ గానే.. అక్క‌డి రాజ‌కీయ పరిస్థితులు మారిపోతున్నాయి. ఇప్ప‌టికే ఎనిమిది జిల్లాల్లో పూర్తయిన యాత్ర‌కు ఆయా వ‌ర్గాల నుంచి మంచి స్పంద‌నే ల‌భిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఒక్క‌సీటు కూడా సాధించ‌లేక‌పోయిన ప‌శ్చిమ గోదావ‌రిలో పాద యాత్ర ఎలా జ‌రుగుతుందా? ప‌్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఎలా ఉంటుందా? అనే ప్రశ్న‌ల‌కు స‌మాధానం ఇప్పుడిప్పుడే దొరుకు తోంది. ప్ర‌జ‌ల్లోనే గాక రాజకీయ స‌మీక‌ర‌ణాల్లోనూ ఇప్పుడు మార్పులు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయంటున్నారు రాజ‌కీయ‌ విశ్లేషకులు. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా వ్యూహాలు కూడా ర‌చిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జిల్లాలోని ఇతర పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానిస్తున్నారు. ఇప్ప‌టికే కొంద‌రు జ‌గ‌న్ చెంత‌కు చేర‌గా.. మ‌రి కొందరు ప్రముఖులు వైసీపీలోకి వెళ్లిపోతున్నారనే ప్రచారం జోరందుకుంది.

జగన్ ప‌శ్చిమ‌ జిల్లాలో ప్రవేశించడానికి ముందే మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామజోగయ్యను వైసీపీలోకి ఆహ్వానించారు నాయ‌కులు. ఆయన సున్నితంగా తిరస్కరించి, తాను తటస్థంగానే ఉంటానని చెప్పారు. `మీరు తటస్థంగానే ఉండండి. మీ కుమారుడు సూర్యప్రకాష్‌కు డెల్టాలో ఆచంట లేదా నరసాపురంలలో టిక్కెట్టు ఇప్పిస్తాం. పార్టీ విజయానికి సహకరించాల‌`ని కోరార‌ట‌. ఆయ‌న‌తో పాటు మెట్టలో పట్టున్న కరాటం రాంబాబును వైసీపీ శ్రేణులు ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే సముచితమైన స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన.. ఆలోచిద్దాం.. సమయం ఉందిగా అంటూ బదులిచ్చినట్లు సమాచారం.

పాలకొల్లు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్‌ సీహెచ్‌ సత్యనారాయణమూర్తి వైసీపీలోకి వస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. 2004లో తటస్థంగా ఉన్న డాక్టర్‌ బాబ్జీని టీడీపీ అధినేత చంద్రబాబు పిలిచి టికెట్‌ ఇచ్చి పాలకొల్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. 2009లో జరిగిన త్రిముఖ పోటీలో ఓటమి పాలయ్యారు. 2014లోఆయ‌న‌కు టికెట్‌ లభించక‌పోవ‌డంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. టికెట్‌ ఇవ్వనప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం సముచిత స్థానం ఇస్తామ‌ని చెప్పారు. మనస్థాపం చెందిన ఆయ‌న‌ బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు చెడటంతో నేరుగా బీజేపీ బరిలోకి దిగితే పాలకొల్లు నియోజకవర్గం నుంచి బాబ్జీ గెలుపు ఖాయ‌మ‌ని క‌మ‌ల‌నాథులు చెబుతున్నారు. మరోవైపు ఆయ‌న‌ వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల సమయానికి బీజేపీ, వైసీపీ పొత్తు పెట్టుకుంటే గెలుపు మరింత సునాయాసమనికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

పాలకొల్లు నుంచి వైసీపీలో గుణ్ణం నాగబాబు, మేకా శేషుబాబు టికెట్టు ఆశిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తృతీయ ప్రత్యా మ్నాయంగా సత్యనారాయణమూర్తికి అవకాశం కల్పిస్తారనే ప్రచారంతో పాలకొల్లులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. డెల్టాలో బీసీ వర్గానికి చెందిన ఒక ప్రజా ప్రతినిధికి వైసీపీ గేలం వేస్తున్నట్లు స‌మాచారం. వెనుకబడిన వర్గాల్లో పట్టున్న ఆ ప్రజా ప్రతినిధిని పార్టీలోకి తెచ్చుకుని నరసాపురం పార్లమెంటరీ స్థానంలో తమ అభ్యర్థిగా నిలిపితే మంచి మెజారిటీతో గెలుస్తారని వైసీపీ శ్రేణులు అంచనా వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వైసీపీకి ఉన్న ఫిక్స్‌డ్‌ ఓట్లు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో పాటు సంఖ్యాపరంగా అధికంగా ఉన్న బీసీ వర్గాలలోని ఓట్లు సొంతం చేసుకుంటే గెలుపొందవచ్చనేది వ్యూహం.

ప‌శ్చిమ‌లో జగన్ టార్గెట్ ఇదే..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share