ద‌మ్మున్న ప‌త్రిక‌లో `తిక్క‌` క‌థ‌నం

ద‌మ్మున్న ప‌త్రిక‌గా పాపులారిటీ సంపాయించాల‌ని చూసే ఆ మీడియా సంస్థ‌పై ఇప్పుడు పైవిధంగానే కామెంట్లు వినిపిస్తున్నాయి. స‌ద‌రు సంస్థ వెబ్‌సైట్‌లో పైత్య‌పు రాత‌ల‌కు త‌మ క‌ళ్లు తిరుగుతున్నాయ‌ని అంటున్నారు పాఠ‌కులు. త‌న రాత‌ల‌తో దుమ్ము రేపుతాన‌ని ప‌దే ప‌దే చెప్పే.. స‌ద‌రు ద‌మ్మున్న ప‌త్రిక ఎండీ ఇప్పుడు రోత పుట్టిస్తున్నాడ‌ని చెబుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ఇటీవ‌ల కాలంలో అత్యంత ప్ర‌చారంలో ఉన్న వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఈయ‌న త‌న పార్టీ జ‌న‌సేన ద్వారా చ‌ర్చ‌కు దారితీశాడు. దీనిని ప్ర‌స్తుతం విస్త‌రించే ప‌నిలో ఉన్నాడు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.

ఇక‌, నంద్యాల ఉప ఎన్నిక స‌హా కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌లోనూ ప‌వ‌న్ పార్టీ పోటీకి దూరంగా ఉంది. కాగా, మొత్తంగా 2019పై ఆశ‌లు పెట్టుకుంది. అప్ప‌టికి క‌లిసొచ్చే వారితో పొత్తు పెట్టుకుని బ‌రిలో నిల‌వాల‌ని ప‌వ‌న్ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు కూడా. అయితే, అప్ప‌టి ఎన్నిక‌ల్లో(ఇంకా దాదాపు రెండేళ్ల స‌మ‌యం ఉంది) ప‌వ‌న్ విజ‌యం సాధించి సీఎం సీటును కైవ‌సం చేసుకునే మెజారిటీ సాధిస్తే .. ఏం జ‌రుగుతుంది? ప‌వ‌న్ సీఎం అయిపోతాడా? లేక త‌న సినిమాలు తాను చేసుకుంటూ.. ఇంకెవ‌రినైనా సీఎం సీటులో కూర్చోబెడ‌తాడా? అంటూ ద‌మ్మున్న చానెల్‌కి సంబంధించిన సైట్‌లో ఓ భారీ క‌థ‌నం హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

అంతేకాదు, దీనికి కంక్లూజ‌న్ వీరే చెప్పేశారు. ఒక‌వేళ 2019 ఎన్నిక‌ల‌లో ప‌వ‌న్ పార్టీ విజ‌యం సాధిస్తే.. ఏపీలో త‌న అన్న చిరంజీవిని సీఎం సీటులో కూర్చోబెడ‌తాడ‌ని తాను మాత్రం పార్టీకి అధ్య‌క్షుడిగా ఉండి ఆ ద‌ర్శ‌వంత‌మైన రాజ‌కీయాలు చేస్తాడ‌ని ఓ పోసుగోలు క‌థ‌నం ప్ర‌చారంలోకి తెచ్చింది ఈ సైట్‌. దీంతో ఇది పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతోంది. నిజానికి ఈ క‌థ‌నం వెనుక రెండు ఉద్దేశాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఒక‌టి.. ప‌వ‌న్ పార్టీని ప్ర‌జ‌ల్లో చుల‌క‌న చేయ‌డం, రెండు వైసీపీ క‌న్నా బ‌లంగా ప‌వ‌న్ ఉన్నార‌ని చెప్ప‌డం.

నిజానికి ప‌వ‌న్ పార్టీకి ఫాలోయింగ్ ఉండే ఉంటుంది. అయితే, 2019లో అధికారంలోకి వ‌చ్చేంత బ‌లం ఉంద‌ని ఇప్ప‌టికిప్పుడు చెప్ప‌డం సాధ్యంకాదు. ఎందుకంటే.. పార్టీ వ్య‌వ‌స్థాగ‌తంగా ఇంకా బ‌లం పుంజుకోలేదు. కార్య‌క‌ర్త‌లు పూర్తిస్థాయిలో లేరు. అయినా కూడా ఇప్ప‌టినుంచే ఊహానాలు ఎందుకో అర్ధంకావ‌డంలేదు. ఇక‌, చిరుతో పార్టీ ప‌రంగా ప‌వ‌న్‌కి అంత సంబంధాలు కూడా లేవు. అదీకాక‌, ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయ‌డాన్ని ప‌వ‌న్ తీవ్రంగా వ్య‌తిరేకించాడు.

ఈ క్ర‌మంలో రాజ‌కీయంగా అన్న‌తో క‌లిసి పోతాడ‌ని ప్ర‌చారం చేయ‌డంలో విఫ‌ల‌మైన నేత చిరును మ‌ళ్లీ తెర‌మీద‌కి తెచ్చి.. ప‌వ‌న్ ఆశ‌ల‌కు గండికొట్ట‌డంగానే క‌నిపిస్తోంది. మ‌రోప‌క్క‌, సీఎం సీటును కైవ‌సం చేసుకునే రేంజ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉన్నాడ‌ని ప్ర‌చారం చేయ‌డం ద్వారా .. వైసీపీ నేత‌ల‌ను అటు దిశ‌గా ప్రోత్స‌హించి, జ‌గ‌న్ పార్టీని నానాటికీ కుంగ‌దీయాల‌ని సద‌రు మీడియా సంస్థ ప్లాన్‌గా టాక్‌. మొత్తానికి ఈ చెత్త క‌థ‌నంపై స‌ర్వ‌త్రా ఛీత్కార‌మే త‌ప్ప మ‌రొక‌టి క‌నిపించ‌డం లేదు. అంత పెద్ద పేరున్న మీడియా సంస్థ వెబ్‌సైట్‌లో ఇలాంటి చిల్ల‌ర క‌థ‌నాలు వారి క్రెడిబులిటీని ఎంత‌లా దిగ‌జారుస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.