ఆ వైసీపీ నేత‌ల‌పై పీకే కంప్లైంట్‌

September 11, 2017 at 11:22 am
Prashanth Kishor, YSRCP, YS Jagan

రానున్న ఎన్నిక‌ల మేనిఫెస్టోలో భాగంగా.. న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టారు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి! ఇవి త‌నను అధికారంలోకి తీసుకొస్తాయ‌ని ఎన్నో ఆశ‌లుపెట్టుకున్నారు. వీటిపై ఊరూవాడా ప్ర‌చారం చేయాల‌ని దిశానిర్దేశం చేశారు. చేస్తున్నారు కూడా! కొన్ని చోట్ల స‌భ‌లు, స‌మావేశాలు పెట్టి ప్ర‌చారం చేస్తున్నారు. అయితే ఇవి ఎంత వ‌ర‌కూ ప్ర‌జ‌ల్లోకి వెళ్లాయి. నేత‌లు వీటిని స‌క్ర‌మంగా ప్ర‌చారం చేస్తున్నారా? లేదా అనే అంశాల‌పై వైసీపీ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వేలో షాకింగ్ ఫ‌లితాలు వ‌చ్చాయ‌ట‌. అంతేగాక కొంత‌మంది నేత‌ల ప‌నితీరు అస్స‌లు బాగాలేద‌ని ఫిర్యాదు చేశార‌ట‌. వీరి ప‌ద్ధ‌తి మ‌ర్చుకోక‌పోతే పార్టీకి న‌ష్ట‌మేన‌ని స్ప‌ష్టంచేశార‌ట‌.

ఎన్నో ఆశ‌లతో నియ‌మించుకున్న పీకే.. నంద్యాల‌, కాకినాడ‌ల్లో త‌న వ్యూహాల‌తో వైసీపీని గట్టెక్కించ‌లేక‌పోయాడు. ఆయ‌న ప్ర‌ణాళిక‌లు టీడీపీ విజ‌యాన్ని ఆప‌లేక‌పోయాయి. సెమీఫైనల్స్‌గా భావించిన ఈ ఎన్నిక‌ల్లో సైకిల్ జోరుముందు వైసీపీ ఫ్యాన్ తిర‌గ‌లేక‌పోయింది. నంద్యాల ఓటమిపై వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తొలిసారి విశ్లేషించారు. అనంత‌రం జగన్ ను తొలిసారి కలిశారు. నంద్యాల ఎన్నికలో పీకే వ్యూహం ఫలించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వీరి కలయిక పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దాదాపు నాలుగు గంటల పాటు చ‌ర్చించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఓటమికి గ‌ల కారణాలను జగన్ కు వివరించారు.

నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేంత వరకూ వైసీపీ అనుకూలంగానే ఉందని, పార్టీ ఇమేజ్ కూడా బాగానే ఉందని, అయితే నేతలు ఓట్లుగా మలచుకోక పోవడం వల్లనే విఫలం చెందామని చెప్పినట్లు సమాచారం. ఇక జగన్ పాదయాత్ర వచ్చే నెలలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ 60 రోజుల పాటు.. కార్యాచరణను వైసీపీ నేతల ముందుంచారు. నియోజకవర్గాల స్థాయిలో నవరత్నాల సభలను ఏర్పాటు చేయడం, వైసీపీ కుటుంబ సభలు, వైసీపీ కార్యకర్తల ఇళ్లకు స్టిక్కర్లు అతికించడం వంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా జరగడం లేదని ప్రశాంత్ కిషోర్ జగన్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

కొన్ని నియోజకవర్గాల్లో నేతలు అసలు నిర్దేశించిన లక్ష్యాన్ని కొందరు పూర్తి చేయడం లేదని ఆరోపించారు. ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పార్టీ బలపడటం కూడా కష్టమేనని వివ‌రించారు. పార్టీ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేతల పేర్లతో కూడిన జాబితాను కూడా పీకే జగన్ కు ఇచ్చారు. సంబంధిత నేతలతో తాను మాట్లాడతానని పీకే కు జగన్ చెప్పినట్లు సమాచారం. ఇప్పటికీ నవరత్నాల పేరుతో కొన్ని నియోజకవర్గాల్లో సభలను నిర్వహించకపోవడాన్ని జగన్ తీవ్రంగా తప్పుపట్టినట్లు సమాచారం. మొత్తం మీద నంద్యాల ఉప ఎన్నిక ఫలితం తర్వాత ప్రశాంత్ కిషోర్ తొలిసారి జగన్ తో సమావేశం కావడం పార్టీలో చర్చనీయాంశమైంది.

ఆ వైసీపీ నేత‌ల‌పై పీకే కంప్లైంట్‌
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts