నాయ‌న‌మ్మ బాటలోనే ప్రియాంక!

ప్ర‌స్తుతం దేశ కాంగ్రెస్ రాజ‌కీయాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా శాసించే నాయ‌కులు ఎవ‌రా ? అన్న ప్ర‌శ్న‌కు వినిపిస్తోన్న ఒకే ఒక ఆన్స‌ర్ ప్రియాంక‌గాంధీ. సోనియా ఆరోగ్య ప‌రిస్థితి రోజు రోజుకు క్షీణిస్తుండ‌డంతో ఆమె త‌న కుమారుడు రాహుల్‌గాంధీకి ప‌గ్గాలు అప్ప‌గిస్తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే రాహుల్ గాంధీ అంత స‌మ‌ర్థుడు కాద‌న్న అభిప్రాయం దేశ ప్ర‌జ‌ల‌కే కాదు, టోట‌ల్ కాంగ్రెస్ శ్రేణుల‌కు కూడా ఉంది.

చాలా మంది భ‌విష్య‌త్ కాంగ్రెస్ ప‌గ్గాలు ప్రియాంక గాంధీకి అప్ప‌గిస్తేనే బాగుంటుంద‌ని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆమె పొలిటిక‌ల్ ఆరంగ్రేటం వ‌చ్చే ఎన్నిక‌ల్లోనే ఉంటుంద‌ని తెలుస్తోంది. ప్రియాంకగాంధీ 2019లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో గ‌తంలో త‌న నాయ‌న‌మ్మ ఇందిరాగాంధీ ప్రాథినిత్యం వ‌హించిన నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేస్తార‌ని తెలుస్తోంది.

ప్రియాంక వ‌చ్చే ఎన్నిక‌ల్లో కర్ణాటక నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ అధిష్ఠానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రం కర్ణాటక ఒక్కటే. అందుకే ఇక్కడ నుంచే ప్రియాంకను బరిలోకి దించాలని ఆ పార్టీ అధిష్ఠానం యోచిస్తోంది.

ప్రియాంక నాయ‌న‌మ్మ, డైనమిక్ లేడీ అయిన ఇందిరాగాంధీ రెండోసారి రాజ‌కీయాల్లో రాణించేందుకు క‌ర్ణాట‌క‌లోని అప్పటి చిక్కమగళూరు, ప్రస్తుత ఉడిపి-చిక్కమగళూరు నియోజకవర్గం నుంచి ఇందిరాగాంధీ పోటీ చేశారు. ప్రస్తుతం అదే నియోజకవర్గం నుంచి ప్రియాంకగాంధీ పోటీ చేయనున్నట్లు సమాచారం.

ఈ నియోజ‌క‌వ‌ర్గం లేదా అదే స్టేట్‌లోని మైసూరు నుంచి బరిలోకి దింపాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. ప్రియాంకగాంధీ 2019 ఎన్నికలలో పోటీ చేయడం అనివార్యమైతే 2018లో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి.