బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..!

తెలంగాణ‌లో టీడీపీకి మ‌రో షాక్ త‌గ‌ల‌నుంది. ఇప్ప‌టికే ఒక్క‌రొక్క‌రుగా టీడీపీ నుంచి టీఆర్ ఎస్‌లోకి జంప్ చేసిన నేత‌లు బాబు వ్యూహానికి తూట్లు పొడిచారు. ఇక‌, ఇప్పుడు తాజాగా ఏరికోరి 2014లో ఎల్‌బీ న‌గ‌ర్ టికెట్ ఇచ్చి గెలిపించుకున్న బీసీ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్య కూడా చంద్ర‌బాబుకి బై చెప్పేస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే బాబు, కృష్ణ‌య్య‌ల మ‌ధ్య దూరం నానాటికీ పెరిగింది.

మొన్నామ‌ధ్య ఓ ప్ర‌భుత్వ ప‌రీక్ష విష‌యం విద్యార్థుల ప‌క్షాన నిల‌బ‌డిన కృష్ణ‌య్య‌.. ఏపీ సీఎం చంద్ర‌బాబుపై నిప్పులు చెరిగారు. ప్ర‌భుత్వానికి క‌ళ్లు తెరిపించేందుకు విద్యార్థులు ధ‌ర్నాకు సిద్ధం కావాల‌ని కూడా పిలుపు నిచ్చారు. సో.. బాబు, కృష్ణ‌య్య‌ల మ‌ధ్య సంబంధాలు ఇలా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే కృష్ణ‌య్య ఇక పార్టీని మారాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలిసింది. అయితే, ఆయ‌న తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్ కారెక్కుతార‌ని అంద‌రూ భావించారు.

అయితే, ఎవ‌రి ఊహ‌ల‌కూ అంద‌కుండా.. కృష్ణ‌య్య‌.. బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నార‌ని స‌మాచారం. ఇటీవ‌ల కేంద్ర మాజీ మంత్రి, ఏపీ నేత పురందేశ్వ‌రి కృష్ణ‌య్య‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగానే ఆమె బీజేపీ అధినాయ‌క‌త్వం మాట‌ను కృష్ణ‌య్య చెవిలో వేశార‌ట‌. ఫ్యూచ‌ర్ బాగుంటుంద‌ని ఆమె కృష్ణ‌య్య‌కు హామీ కూడా ఇచ్చింద‌ట‌. తెలంగాణ‌లో రాబోయే 2019 ఎన్నిక‌ల్లో కాషాయ జెండా రెప‌రెప‌లాడాల‌ని నిర్ణ‌యించామ‌ని, ఈ క్ర‌మంలోనే ఆహ్వానిస్తున్నామ‌ని ఆమె అస‌లు విష‌యాన్ని వెల్ల‌డించార‌ట‌.

ఒక ప‌క్క‌, టీడీపీలో ఉన్నా.. ప్ర‌యోజ‌నం లేక‌పోవ‌డం, అటు టీఆర్ ఎస్‌లోకి వెళ్ల‌లేక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో కృష్ణ‌య్య పార్టీని మారాల‌ని డిసైడ‌య్యార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త్వ‌ర‌లోనే బీజేపీ తీర్థం పుచ్చుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. నిజంగా ఈ ప‌రిణామం టీడీపీకి పెద్ద‌షాకే అంటున్నారు విశ్లేష‌కులు.