రాజా ది గ్రేట్‌ TJ రివ్యూ

టైటిల్‌: రాజా ది గ్రేట్‌

జాన‌ర్‌: యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌

బ్యాన‌ర్‌: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌

నటీనటులు: రవితేజ, మెహ్రీన్ , రాధిక, సంపత్ రాజు, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్ త‌దిత‌రులు

సినిమాటోగ్రఫీ: మోహన్ కృష్ణ

ఎడిటింగ్‌: త‌మ్మిరాజు

నిర్మాత: దిల్ రాజు

దర్శకత్వం: అనిల్ రావిపూడి

మ్యూజిక్ : సాయి కార్తీక్

సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ

ర‌న్ టైం: 149 నిమిషాలు

రిలీజ్ డేట్‌: 18 అక్టోబ‌ర్‌, 2017

మాస్ మహారాజా రవితేజ తెలుగు ప్రేక్షకులకి కనిపించి రెండేళ్లు అయ్యింది. ర‌వితేజ సినిమా ఎప్పుడు వ‌స్తుందా ? అని జ‌నాలు కళ్లుకాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్ ర‌వితేజ‌ను మ‌ర్చిపోయింది అనుకుంటున్న టైంలో మ‌నోడు రాజా ది గ్రేట్ సినిమాతో ఒక్క‌సారిగా తెర‌మీద‌కు వ‌చ్చాడు. ప‌టాస్‌తో ట‌పాసులు పేల్చి, సుప్రీమ్‌తో మెప్పించిన అనిల్ రావిపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌డం, టాలీవుడ్ అగ్ర‌నిర్మాత దిల్ రాజు నిర్మించ‌డంతో రాజా ది గ్రేట్‌కు రిలీజ్‌కు ముందే మంచి ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ర‌వితేజ పూర్తి స్థాయి అంధుడిగా మెప్పించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. మ‌రి ర‌వితేజ రాజా ది గ్రేట్‌తో హిట్ కొట్టి తాను గ్రేట్ అనిపించుకున్నాడా ? లేదా ? అన్న‌ది స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:

ఈ సినిమా స్టోరీ చాలా సింపుల్‌గా ఉంటుంది. వివాన్ ప‌టేల్ (ప్ర‌ధాన విల‌న్‌)కు త‌మ్ముడంటే పంచ‌ప్రాణాలు. త‌న త‌మ్ముడిని ఓ పోలీస్ ఆఫీస‌ర్ (ప్ర‌కాష్‌రాజ్‌) కాల్చి చంప‌డంతో అత‌డి మీద ప‌గ తీర్చుకునేందుకు అత‌డి కూతురు (మెహ్రీన్‌)ను చంపాల‌నుకుంటాడు. ఆ ప్ర‌య‌త్నంలో పోలీస్ అధికారి మ‌ర‌ణిస్తాడు. ప్ర‌కాష్‌రాజ్ ఫ్రెండ్ అయిన మ‌రో పోలీస్ ఆఫీసర్ (సంప‌త్‌రాజ్‌) త‌న స్నేహితుడి కూతురిని కాపాడేందుకు ఓ ఆప‌రేష‌న్ ప్లాన్ చేస్తాడు. ఈ స్టోరీ ఇలా ఉంటే హీరో రాజా (ర‌వితేజ‌) పుట్టుక‌తోనే అంధుడు. రాజా త‌ల్లి రాధిక సంప‌త్ వ‌ద్ద కానిస్టేబుల్‌. ఈ క్ర‌మంలోనే మెహ్రీన్‌ను కాపాడేందుకు సంప‌త్ చేపట్టిన సీక్రెట్ ఆప‌రేష‌న్‌లో త‌ల్లి కోసం రాజా కూడా ఇన్వాల్ అవుతాడు. ఆమెను కాపాడే క్ర‌మంలో ఆ అమ్మాయితో ఎలా ప్రేమ‌లో ప‌డ్డాడు ? చివ‌ర‌కు ఈ సీక్రెట్ ఆప‌రేష‌న్ ఏమైంది ? ఆ విల‌న్లు ఏమ‌య్యారు ? ఈ క‌థ ఎలా మ‌లుపులు తిరిగి ఎలా ముగిసింది ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

న‌టీన‌టుల పెర్పామెన్స్ & TJ విశ్లేష‌ణ‌

ఓ అంధుడి పాత్ర‌లో స్టార్ ఇమేజ్ ఉన్న హీరో న‌టించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. ఈ సినిమాలో ర‌వితేజ అంధుడిగా ఎలాంటి లోపం లేకుండా చ‌క్క‌గా న‌టించాడు. హీరో అంధుడు అయిన‌ప్ప‌ట‌కీ త‌న తెలివితేట‌ల‌తో హీరోయిన్‌ను ఇబ్బందుల నుంచి ఎలా గ‌ట్టెంక్కించాడ‌న్న క‌థను చాలా ఆస‌క్తిగా ప్ర‌జెంట్ చేశాడు. ర‌వితేజ బాడీ లాంగ్వేజ్ సినిమాకు క‌రెక్టుగా సూట్ అయ్యింది. ఇక కథంతా తన చుట్టూనే తిరిగే అమ్మాయి పాత్రలో మెహరీన్ కూడా ఇమిడిపోయింది. మెయిన్ విలన్ కు డబ్బింగ్ అక్కడక్కడా సింక్ అవ్వలేదు. అన్నపూర్ణ, పృథ్వి పాత్రలు బాగా నవ్విస్తే, రాధిక మాత్రం డ్యాన్సులతో పాటు విలన్ కు డైలాగుల ఛాలెంజ్ కూడా చేసింది. రాశిఖన్నా, సప్తగిరి, తాగుబోతు రమేష్, సంపూర్ణేష్ బాబు ఇలా వచ్చి అలా వెళ్లిపోతారు.

శారీరక వైకల్యం ఉన్నవారికి కొన్ని ప్ర‌త్యేక‌మైన తెలివితేట‌లు ఉంటాయి. గుడ్డివాళ్లు చేతి స్ప‌ర్శ‌తో టచ్ చేసి ఏ వ‌స్తువు ఏంటో చెపుతుంటారు. ఎక్క‌డ నుంచి ఎన్ని అడుగులు వేస్తే ఎక్క‌డికి వెళ‌తామో కూడా చెపుతారు. ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి కూడా కొన్ని పాత సినిమాల ప్రేర‌ణ‌తోనే ఈ సినిమా క‌థ‌ను రాసుకున్న‌ట్టు క‌న‌ప‌డుతోంది. ఎప్పుడో రెండున్న‌ర ద‌శాబ్దాల క్రితం మ‌ళ‌యాళంలో మోహ‌న్‌లాల్ హీరోగా వ‌చ్చిన యోధ‌, తెలుగులో ఆరేడేళ్ల క్రితం వ‌చ్చిన అన‌గ‌న‌గా ఓ ధీరుడు లాంటి సినిమాల ప్ర‌భావం కొంత ఉన్నా అయితే అనిల్ పూర్తిగా జాన‌ర్‌ను మార్చేసి కామెడీ డోస్ పెంచేసి సినిమాను క‌మ‌ర్షియ‌ల్‌గా తీర్చిదిద్దాడు. ఇక హీరో తెలివితేట‌ల‌కు సంబంధించి అల్లుకున్న సీన్లు, అత‌డి తెలివితేట‌ల‌ను ఎలివేట్ చేసే సీన్లను బాగా రాసుకున్నాడు. ఫైట్స్‌, యాక్ష‌న్ సినిమాకు రెండు మెయిన్ ఎస్సెట్స్‌.

ఇక ఫ‌స్టాఫ్‌లో ఉన్న గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, కామెడీతో పోల్చుకుంటే సెకండాఫ్‌లో కాస్త సాగ‌దీత ఎక్కువై టైట్‌నెస్ త‌గ్గిన‌ట్టు అనిపించినా సినిమాకు వ‌చ్చిన ఇబ్బందేమి లేదు.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్‌:

సాంకేతికంగా చూస్తే సాయి కార్తీక్ మ్యూజిక్ బాగుంది. తొలిసారి ఓ పెద్ద హీరో సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేసిన అత‌డు ఆ ఛాన్స్‌ను చ‌క్క‌గా వాడుకున్నాడు. పాట‌ల‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చ‌క్క‌గా సెట‌ప్ అయ్యింది. మోహ‌న్‌కృష్ణ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ఫ‌స్టాఫ్‌లో డార్జిలింగ్‌లో అంద‌మైన లొకేష‌న్ల‌లో చిత్రీక‌రించిన సీన్లు బాగున్నాయి. తమ్మిరాజు ఎడిటింగ్‌లో ఫ‌స్టాఫ్ క్రిస్పీగా ఉన్నా సెకండాఫ్‌లో క‌త్తెర‌కు ప‌నిచెప్పాల్సింది. సీన్లు సెకండాఫ్‌లో సాగ‌దీసిన‌ట్టు ఉన్నాయి. 149 నిమిషాల ర‌న్ టైంలో క‌నీసం 10 నిమిషాల సీన్లు క‌ట్ చేసేయొచ్చు. రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌ల అన్న కుమారుడు కంపోజ్ చేసిన యాక్ష‌న్ సీక్వెల్స్, క్లైమాక్స్ యాక్ష‌న్ సీన్ బాగుంది. దిల్ రాజు నిర్మాణ విలువ‌లు సినిమాకు త‌గిన‌ట్టుగా గ్రాండ్‌గా ఉన్నాయి.

అనిల్ రావిపూడి డైరెక్ష‌న్ క‌ట్స్ :

ప‌టాస్, సుప్రీమ్ లాంటి సినిమాల్లో మాస్ ట‌చ్‌తో పాటు కామెడీ డోస్‌ను బేస్ చేసుకుని సినిమాల‌ను హిట్ చేసిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకు అదే పంథా ఫాలో అయ్యాడు. సుప్రీమ్ సినిమాలో దివ్యాంగుల ఫైట్ సీన్‌తో వారిపై త‌న‌కు ఉన్న అభిమానం చాటుకున్న అనిల్ ఈ సినిమాకు ఏకంగా ఓ అంధుడి క్యారెక్ట‌ర్‌తో స్టోరీ తీసుకోవ‌డం…దానిని క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్‌లో చెప్పాల‌నుకోవ‌డం నిజంగా అభినందించ‌ద‌గ్గ‌దే. టాలీవుడ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇది ఎవ్వ‌రూ చేయ‌ని రిస్క్‌గానే చెప్పాలి. ఓ అంధుడి క్యారెక్ట‌ర్ అల్లుకోవ‌డం, దాని చుట్టూ రాసుకున్న డైలాగులు, పేర్చుకున్న స‌న్నివేశాలు బాగా పండాయి. సినిమా క‌థేంట‌న్న‌ది ముందుగానే తెలిసిపోయినా అంధుడిగా ఉన్న హీరో ఎలా నెగ్గుకు వ‌స్తాడ‌న్న‌దానికోస‌మే అంద‌రూ వెయిట్ చేస్తుంటారు. అయితే సినిమాలో ప‌దే ప‌దే కామెడీ కోసం ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నించ‌డంతో చాలా చోట్ల టైట్‌నెస్ త‌గ్గినా బోర్ అయితే లేదు. ఓవ‌రాల్‌గా ఈ సినిమా త‌ర్వాత చాలా మంది పెద్ద  హీరోలు  అనిల్ రావిపూడితో సినిమాలు చేసేందుకు సైన్ చేస్తార‌న‌డంలో సందేహం లేదు.

ప్ల‌స్ పాయింట్స్ (+):

– అంధుడిగాను ర‌వితేజ ఎనర్జిటిక్ పెర్పామెన్స్‌

– మెహ్రిన్ అందాలు

– డైరెక్ష‌న్‌

– నిర్మాణ విలువ‌లు

– సినిమాటోగ్ర‌ఫీ

– ఫ‌స్టాఫ్‌

మైన‌స్ పాయింట్స్ (-):

– సాగ‌దీసిన సెకండాఫ్‌

– ముందే తెలిసిపోయే క‌థ‌

– హీరో అంధుడు అన్న పాయింట్ ప‌ట్టించుకోని యాక్ష‌న్ సీన్లు

TJ రాజా ది గ్రేట్ ఫైన‌ల్ పంచ్ : ఈ రాజా రొటీన్‌గానే గ్రేట్‌

TJ స‌ల‌హా: రొటీన్‌గానే ఈ రాజాను ఎంజాయ్ చేయొచ్చు

TJ రాజా ది గ్రేట్ మూవీ రేటింగ్‌: 3 / 5