ఎన్టీఆర్ పాలిటిక్స్‌పై జ‌క్క‌న్న షాకింగ్ కామెంట్స్‌

యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. ఈ పేరు విన‌గానే ముందుగా గుర్తొచ్చేది మంచి డాన్సర్, మంచి న‌టుడు.. ఎంత‌టి డైలాగులైనా అవ‌లీల‌గా.. అల‌వోక‌గా చెప్పేస్తాడు.. ఆక‌ట్టుకునేలా ప్ర‌సంగాలు చేయ‌డంలో దిట్ట‌! ఇవే అంద‌రిలోనూ ఉన్న అభిప్రాయాలు! కానీ ఎన్టీఆర్‌ను ద‌గ్గ‌ర‌గా చూసిన‌, ఎంతో స‌న్నిహితంగా మెలిగే వ్య‌క్తుల్లో జ‌క్క‌న్న రాజ‌మౌళి కూడా ఒక‌రు. అయితే అంద‌రూ ఎన్టీఆర్‌లో న‌టుడిని చూస్తే.. జ‌క్క‌న్న మాత్రం మ‌రో ఎన్టీఆర్‌ను చూశార‌ట‌. ఎన్టీఆర్‌కు సినిమాల త‌ర్వాత రాజ‌కీయాలే బాగా సెట్ అవుతాయంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు. ఇప్పుడు ఈ కామెంట్లు అటు సినీ వ‌ర్గాల్లోనేగాక‌… రాజ‌కీయ‌వర్గాల్లోనూ హాట్‌హాట్‌గా మారాయి.

సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్‌, రాజ‌మౌళి ప్ర‌యాణం ఒకేసారి ప్రారంభ‌మైంది. ఎన్టీఆర్ కొద్దిగా డౌన్ అయిన ప్ర‌తిసారీ రాజ‌మౌళి.. హిట్టిచ్చి తార‌క్‌ను అగ్ర‌స్థానంలో నిల‌బెట్టాడు. అందుకే రాజ‌మౌళి అంటే ఎన్టీఆర్‌కు ప్ర‌త్యేక అనుబంధం. ఇదే విష‌యం ఎన్నో సంద‌ర్భాల్లో తారక్ చెప్పాడు. జ‌క్క‌న్న కూడా ఏ హీరోతో లేనంత‌గా ఎన్టీఆర్‌తో మూడు సినిమాలు చేశాడు. అయితే తనతో కలిసి పని చేసిన హీరోల విషయంలో తన ఒపీనియన్స్ ను చెబుతూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నాయి.

సినీ రంగంలో కాకుండా.. వారికి మరో రంగం ఏదయితే బాగాసెట్ అవుతుంది? అనే ప్రశ్నకు రాజమౌళి చిత్రమైన సమాధానం చెప్పాడు. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఈ ముగ్గురు హీరోలతోనూ రాజమౌళి సినిమాలు తీశాడు కదా.. మరి వీరు వేరే ప్రొఫెషన్లను స్వీకరిస్తే, ఎవరికి ఏది బాగుంటుందని అనుకుంటున్నారు? అనే ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇస్తూ.. ప్రభాస్ చెఫ్ గా రాణిస్తాడని చెప్పాడు. అదే రామ్ చరణ్ కు బిజినెస్ మ్యాన్ క్వాలిటీస్ ఉన్నాయన్నాడు. ఇక ఎన్టీఆర్ మాత్రం పొలిటీషియన్.. అనేశాడు.

తారక్ లో ఒక రాజకీయ నేతను చూస్తున్నట్టుగా రాజమౌళి చెప్పడం ఆసక్తికరంగా ఉందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌! కుటుంబ నేపథ్యాన్ని బట్టి ఇలా మాట్లాడాడో లేక వారిలో వ్యక్తిగత ఓర్పునేర్పులను చూసి ఈ మాట చెప్పాడో తెలీదు కానీ.. ఎన్టీఆర్ రాజకీయాలకు పనికొస్తాడని రాజమౌళి చెప్పడం ఆసక్తికరంగా ఉంది. అయితే ఎన్టీఆర్ పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నాడు. మ‌రోవైపు భావి టీడీపీ అధినేత‌గా లోకేష్‌ను ప్ర‌మోట్ చేసే ప‌డ్డారు సీఎం చంద్ర‌బాబు! మ‌రి ఈ నేప‌థ్యంలో రాజ‌మౌళి కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశం కావొచ్చు!