పాలిటిక్స్‌లో ర‌జ‌నీకి మైన‌స్‌లు ఎక్కువే…!

కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ పొలిటిక‌ల్ ఎంట్రీ త‌మిళ‌నాడును హీటెక్కిస్తోంది. ర‌జ‌నీ పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇస్తే అక్క‌డ రాజ‌కీయంగా ఎవ‌రికి ఎంత ప్ల‌స్‌, ఎంత మైన‌స్ అన్న లెక్క‌లు ఇప్ప‌టికే స్టార్ట్ అయ్యాయి. ఇక జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్ సైతం ర‌జ‌నీతో పొత్తుకోసం వెంపర్లాడుతున్నాయి. బీజేపీతోనే క‌లిసేందుకు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌ని ర‌జ‌నీ ఇటీవ‌ల వ‌చ్చిన కాంగ్రెస్ ఆఫ‌ర్‌ను అస్స‌లు ప‌ట్టించుకోలేద‌ని తెలుస్తోంది.

ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీ ప్ర‌క‌ట‌న వ‌చ్చిందో లేదో ఇప్ప‌టికే ఆ పార్టీలో చేరేందుకు చాలామంది సెల‌బ్రిటీలు రెడీగా ఉన్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. కోలీవుడ్ హీరోయిన్లు మీనా, న‌మిత ఇప్ప‌టికే ర‌జ‌నీకి త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఇక సీనియ‌ర్ హీరోయిన్ ఖుష్బూ సైతం ర‌జ‌నీనీ కాలా షూటింగ్ జ‌రుగుతోన్న ముంబై వెళ్లి క‌ల‌వ‌డంతో ఆమె కూడా ర‌జ‌నీ చెంత‌కే చేర‌తార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక అన్నాడీఎంకేకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, అదే పార్టీకి చెందిన నలుగురైదుగురు సీనియ‌ర్ నాయ‌కులు సైతం ర‌జ‌నీ పార్టీలో చేర‌తార‌ని, అందుకోసం ఇప్ప‌టికే గ్రౌండ్ వ‌ర్క్‌కూడా స్టార్ట్ అయ్యింది. ఇక ర‌జ‌నీకి కావాల్సినంత డ‌బ్బు, ఇమేజ్‌, మంచి పేరు ఉంది. అవ‌న్నీ ఓకే రాజ‌కీయాల్లో ర‌జ‌నీకి ప్ర‌స్తుతం ప్ల‌స్‌ల క‌న్నా మైన‌స్‌లే ఎక్కువుగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

ర‌జ‌నీ మైన‌స్‌లు ఇవే…

ర‌జ‌నీ వ‌య‌స్సు చాలా ముదిరిపోయింది. రెండేళ్లు త‌క్కువుగా 70 ఏళ్ల‌కు చేరువ‌వుతోన్న ర‌జ‌నీకి ఇప్ప‌టికే చాలా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. ఈ వ‌య‌స్సులో ఆయ‌న వేళా పాళా లేకుండా రోడ్ షోలు చేయగలరా ? విభిన్న వాతావరణాల్లో ఎండనకా.. కొండనకా తిరగగలరా ? అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికై వైద్య చికిత్స కోసం అమెరికాకు ప‌లుసార్లు వెళుతోన్న ఆయ‌న ఆరోగ్యం అంత‌గా స‌హ‌క‌రించ‌డం లేద‌నే తెలుస్తోంది.

ఇక రాజ‌కీయంగా త‌మిళ‌నాడు ప్రాంతీయ పార్టీల హ‌వానే ఉండ‌డం ర‌జ‌నీకి క‌లిసొస్తుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే అక్క‌డ ఇప్ప‌టికే అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు రెండూ బ‌లంగానే ఉన్నాయి. అన్నాడీఎంకే వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌చ్చింది. అక్క‌డ జ‌య‌ల‌లిత లేక‌పోయినా సంస్థాగ‌తంగా బ‌ల‌మైన కార్య‌క‌ర్త‌ల‌తో తిరుగులేని పార్టీగా ఆ పార్టీ ఉంది.

ఇక డీఎంకే వ‌రుస‌గా రెండుసార్లు ఓడిపోవ‌డంతో అక్క‌డ ఆ పార్టీపై ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో సానుభూతి బాగా ఉంది. ఇక బీజేపీ అక్క‌డ పాగా వేసేందుకు ఎన్నో కుయుక్తులు ప‌న్నుతోంది. ఇవ‌న్నీ ర‌జ‌నీకి రాజ‌కీయంగా స‌వాల్‌తో కూడుకున్న‌వే. మ‌రి వీటి మ‌ధ్య ర‌జ‌నీ ఎలా నెగ్గుకువ‌స్తారో చూడాలి.