తమిళనాడులో పాగా వేసేందుకు మోడీ స్కెచ్ ఇదేనా!

త‌లైవా ర‌జ‌నీకాంత్ రేపో మాపో పాలిటిక్స్‌లోకి వ‌చ్చేస్తున్నాడు. అన్నీ రెడీ కూడా అయిపోయాయి. పార్టీకి సంబంధించిన ఏర్పాట్ల‌న్నీ తెర వెన‌క శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అంతేకాదు, నిన్న మొన్న ప‌రిణామాల‌ను బ‌ట్టి చూస్తే.. ర‌జ‌నీ ర‌మ్మంటే వ‌చ్చేసేందుకు కొంద‌రు అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమిళ‌నాడులో రెడీగా కూడా ఉన్నారు. దీంతో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ర‌జ‌నీ ఏ రేంజ్‌లో వ‌స్తున్నాడో అర్ధం చేసుకోవ‌చ్చు. ఇక‌, ర‌జ‌నీ ఏర్పాటు చేయ‌బోతున్న పార్టీ కోసం బెంగ‌ళూరుకు చెందిన ఒక సంస్థ చాలా కృషి చేస్తోంద‌ని కూడా అంటున్నారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఏపీ, తెలంగాణ‌లో బీజీపీ చ‌క్రం తిప్పుతున్న‌ట్టుగా త‌మిళ‌నాడులోనూ చ‌క్రం తిప్పాల‌ని భావిస్తోంది. దీనికి ర‌జ‌నీ పార్టీని వాడుకోవాల‌ని క‌మ‌ల నాధులు ప‌క్కా స్కెచ్ సిద్ధం చేశార‌ట‌. ఇప్పుడు ఈ టాపిక్ ఆస‌క్తిగా మారింది. నిజానికి త‌మిళ రాజ‌కీయాల‌ను త‌మ గుప్పిట్లోకి తెచ్చుకోవ‌డం కోసం క‌మ‌ల నాథులు శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. జ‌య‌ల‌లిత మ‌ర‌ణం అనంత‌రం త‌మిళ‌నాడులో త‌లెత్తిన పొలిటిక‌ల్ ప‌రిణామాలే దీనికి పెద్ద ఉదాహ‌ర‌ణ‌.

ఇదే క్ర‌మంలో ర‌జ‌నీకాంత్ ని అడ్డం పెట్టుకుని త‌మిళ‌నాడులో పాగా వేయాల‌ని బీజేపీ య‌త్నిస్తోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ర‌జ‌నీని బీజేపీలోకి ఆహ్వానించేందుకు గ‌తంలో కొన్ని ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. కొంత‌మంది పార్టీ ప్ర‌ముఖులు కూడా ఆయ‌న‌కి ఆహ్వానాలు పంపారు. అయితే, ఆ స‌మ‌యంలో ర‌జ‌నీ స్పందించ‌లేదు. ఇప్పుడు ఎలాగూ సొంత పార్టీ పెడ‌తారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ర‌జినీకి త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందంటున్నారు. ఇదే జ‌రిగితే.. ర‌జ‌నీ ఖ‌చ్చితంగా మోడీ రూట్‌లోకి వెళ్లిన‌ట్టేన‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఏం జ‌రుగుతుందో చూడాలి.