ర‌క్ష‌ణ‌నిధి గ్రాఫ్ ఎలా ఉంది?ప‌్ల‌స్‌లు, మైన‌స్‌లు ఇవే

కృష్ణా జిల్లాలోని ప‌శ్చిమ‌ప్రాంతంలో వెన‌క‌ప‌డిన నియోజ‌క‌వ‌ర్గం తిరువూరు. ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం అయిన తిరువూరులో గ‌త మూడుసార్లు టీడీపీ గెల‌వ‌క‌పోవ‌డం ప్ర‌త్యేక‌త‌. గ‌త ఎన్నిక‌ల్లో పామ‌ర్రు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కొక్కిలిగ‌డ్డ ర‌క్ష‌ణ‌నిధి తిరువూరు నుంచి పోటీ చేసి 1676 ఓట్ల స్వ‌ల్ప మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. గ‌తంలో స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధిగా ప‌నిచేసిన ర‌క్ష‌ణ‌నిధి ఎమ్మెల్యేగా కొన్ని ప‌రిమితుల‌కు లోబ‌డ‌డం వ‌ల్ల అనుకున్న స్థాయిలో ప్రోగ్రెస్ చూపించ‌లేక‌పోతున్నారు.

విప‌క్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కావ‌డం, నియోజ‌క‌వ‌ర్గంలో మైలేజ్ వ‌చ్చే స‌మ‌స్య‌ల‌పై ఫైట్ చేయ‌లేకపోవ‌డం ఆయ‌న‌కు మైన‌స్‌గా మారాయి. నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఆయ‌న ఏ మాత్రం చొర‌వ చూప‌లేక‌పోతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 100 గ్రామాల‌కు ఫ్లోరైడ్ ర‌హిత మంచినీరు అందించేందుకు పెద్ద ప్రాజెక్టుగా ఉన్న విస్స‌న్న‌పేట మండ‌లం తెల్ల‌దేవ‌ర‌ప‌ల్లి ఫైలెట్ ప్రాజెక్టు నిరుప‌యోగంగా ఉంది. దాని గురించి ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు.

ఇక తిరువూరు వెన‌క‌ప‌డిన నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డ వ్య‌వ‌సాయం ద్వారానే ఎక్కువుగా ప్ర‌జ‌లు జీవిస్తారు. రాష్ట్ర విభ‌జ‌న‌తో నాగార్జునా సాగ‌ర్ మూడో జోన్‌లో ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గానికి అస్స‌లు నీరు రావ‌డం లేదు. ఈ కీల‌కాంశంపై ఎమ్మెల్యే ఫైట్ చేసిన దాఖ‌లాలు లేవు. ఇక ర‌క్ష‌ణ‌నిధి ఎమ్మెల్యేగా గెలిచాక తిరువూరులో రైతుబ‌జార్‌, మినీ ఇండోర్ స్టేడియం ప్రారంభించినా అవి గ‌త ప్ర‌భుత్వాల హ‌యాంలోనే మంజూర‌య్యాయి. ఇక తిరువూరు మునిసిపాలిటీలో వైసీపీ కౌన్సెల‌ర్లు గెలిచిన వార్డుల్లో అభివృద్ధి జ‌ర‌గ‌క‌పోయినా ఎమ్మెల్యే మాట పాల‌క‌ప‌క్ష‌మైన టీడీపీ వినే ప‌రిస్థితి లేదు.

రాజ‌కీయంగా చూస్తే నియోజ‌క‌వ‌ర్గానికి స్థానికేత‌రుడు కావ‌డంతో ఆయ‌న అప్పుడ‌ప్పుడు వ‌చ్చి పోతుండ‌డం ఓ మైన‌స్‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరువూరులో పోటీ చేస్తే గెలుపుపై ఎక్క‌డో సందేహంతో ఉన్న ఆయ‌న త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన పామ‌ర్రు నుంచి పోటీ చేసే ఏర్పాట్ల‌లో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. పామ‌ర్రు ర‌క్ష‌ణ‌నిధి సొంత నియోజ‌క‌వ‌ర్గం. దీంతో ర‌క్ష‌ణ‌నిధి మ‌నిషి తిరువూరు..మ‌న‌స్సు పామ‌ర్రు అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న టాక్ తిరువూరులో న‌డుస్తోంది.

ప్ల‌స్ పాయింట్స్ (+):

– సౌమ్యుడు, వివాద‌ర‌హితుడు

– పార్టీ ప‌రంగా అధిష్టాంన ద‌గ్గ‌ర మంచి మార్కులు

– స‌మ‌స్య‌ల‌పై స‌బ్జెక్ట్ ప‌రంగా మాట్లాడ‌డం

మైన‌స్ పాయింట్స్ (-):

– చురుగ్గా జ‌నాల్లోకి చొచ్చుకోలేక‌పోవ‌డం

– తిరువూరుకు స్థానికేత‌రుడు కావ‌డంతో విజిటింగ్ ఎమ్మెల్యే అన్న ముద్ర‌

– లిమిటెడ్ క్యాడ‌ర్‌తోనే ముందుకు వెళ్ల‌డం

– అపొజిష‌న్ ఎమ్మెల్యే కావ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో కాన‌రాని అభివృద్ధి

– నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌ల‌పై ఫైట్ చేయ‌లేక‌పోవ‌డం

– వైసీపీకి అనుకూలంగా ఉండే ఓ బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం చేతిల్లో కీలుబొమ్మ అన్న ముద్ర‌

ఫైన‌ల్‌గా…

విప‌క్ష ఎమ్మెల్యేగా ఉన్న ర‌క్ష‌ణ‌నిధి సౌమ్యుడ‌న్న పేరు ఉన్నా స్థానికేత‌రుడు కావ‌డం, స‌మ‌స్య‌ల‌పై స‌రిగా ఫైట్ చేయ‌లేక‌పోవ‌డం లాంటి అంశాలు ఆయ‌న‌కు మైన‌స్‌గా ఉన్నాయి. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ నేప‌థ్య‌లో ఆయ‌న పార్టీ మారుతున్నార‌ని ప‌లుసార్లు వార్త‌లు వ‌చ్చినా దానిని స్ట్రాంగ్‌గా ఖండించుకునే విష‌యంలో కూడా ఆయ‌న ఫెయిల్ అయ్యారు. దీంతో ఆయ‌న పార్టీ మార‌తారా ? అన్న సందేహాలు ఇప్ప‌ట‌కీ అలాగే ఉన్నాయి. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న క‌న్ను పామ‌ర్రు మీదే ఉండ‌డంతో తిరువూరుపై ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టిన‌ట్టు కూడా లేదు. ఇక జ‌న‌సేన లాంటి పార్టీల ప్ర‌భావం కూడా ఉండ‌ని నియోజ‌క‌వ‌ర్గం తిరువూరు.