రారండోయ్ వేడుక చూద్దాం TJ రివ్యూ

సినిమా : రారండోయ్ వేడుక చూద్దాం
రేటింగ్ : 2.75/5
పంచ్ లైన్ : చూసేసిన వేడుకే

నటీనటులు : నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, జగపతి బాబు, సంపత్ రాజ్, కౌసల్య, వెన్నల కిశోరె, చలపతి రావు, ప్రిథ్వి తదితరులు..
కథనం : స‌త్యానంద్‌
ఛాయాగ్రహణం : ఎస్‌.వి.విశ్వేశ్వ‌ర్‌
కూర్పు : గౌతంరాజు
పాట‌లు : రామ‌జోగ‌య్య‌శాస్త్రి, శ్రీమ‌ణి
ఆర్ట్ : సాహి సురేశ్‌
ఫైట్స్ : రామ్‌- ల‌క్ష్మ‌ణ్‌
సంగీతం : దేవిశ్రీప్ర‌సాద్‌
నిర్మాత‌ : నాగార్జున అక్కినేని
ద‌ర్శ‌క‌త్వం : క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల‌

మాస్ సినిమాలు చెయ్యాలి,మాస్ హీరోగా నిలబడితే చాలు అని మసాలా సినిమాల్ని ప్రేక్షకులమీద వేసి రుద్దకుండా తానేంటో,తన బలమెంతో తెలుసుకుని వాటికనుగుణంగా సినిమాలు చేసుకుంటూ తనకంటూ ఓ స్టైల్ ని క్రియేట్ చేసుకున్నాడు నాగ చైతన్య.నాగ చైతన్య సినిమా అంటే మినిమం గ్యారంటీ అన్న బ్రాండ్ ని క్రియేట్ చేసేసుకున్నాడు చైతు.ఆ మినిమం గ్యారంటీకి ఢోకా లేని సినిమానే ఈ రారండోయ్ వేడుక చూద్దాం కూడా.

సినీ పరిశ్రమలో నిలదొక్కు కోవడానికి కావాల్సింది క్లాస్,మాస్ కాదు..సొంత ఐడెంటిటీ.అది చైతూకి దక్కేసింది.ఇప్పటి వరకు లవర్ బాయ్ పాత్రలే ఎక్కువగా చేసిన చైతు..ఫామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ కెరీర్ లో సరైన టైం లో సరైన స్టెప్ తీసుకున్నాడు.నాగార్జున ప్రొడ్యూసర్ అనగానే ఉండాల్సిన జాగ్రత్తలు,కమర్షియల్ హంగులు అన్ని అద్ది..కాచి వడపోసిన ఫక్తు హిట్ ఫార్ములా సినిమా సింపుల్ గా ఈ రారండోయ్ వేడుక చూద్దాం.

స్క్రీన్ నిండా కలర్ ఫుల్ సన్నివేశాలు..భారీ కాస్టింగ్ తో సినిమా మొత్తం నిండిపోయింది కానీ,అంత కలర్ ఫుల్ ఫీల్ ని మాత్రం సినిమాలో నింపలేకపోయాడు దర్శకుడు.ఒక్క బీచ్ లో బ్రేకప్ సన్నివేశం తప్ప ప్రేక్షకుడు సినిమాకి ఎక్కడా కనెక్ట్ అవ్వలేదు.ఎదో ఆహ్లాదకరంగా..స్క్రీన్ అందంగా సినిమా నడిచిపోతుందే తప్ప ప్రేక్షకుడి పాటికి ప్రేక్షకుడు సినిమా పాటికి సినిమా రెండూ రెండు దారుల్లానే నిలిచిపోతాయి.

పెళ్లి అనగానే ఓ పది రకాల విచిత్రమైన పాత్రల్ని పరిచయం చేసి..వాటి తాలూకు హాస్యాన్ని పండిచేద్దామని విఫలయత్నం చేసినా పెద్దగా నవ్వు రాకపోగా..ఈ పాత్రలేవీ కథతో సంబంధం లేకపోవడంతో ఏవో కామెడీ స్క్రిప్ట్ ట్రై చేస్తున్నారన్న భావనే తప్ప అసలు సినిమా ఎక్కడనే అనుమానం కలుగుతుంది.హీరోయిన్ బిహేవియర్ తో విసిగిపోయిన ప్రేక్షకుడికి చైతు బీచ్ రివర్స్ కౌంటర్ రూపం లో పెద్ద రిలీఫ్ దొరుకుతుంది.ఇక అక్కడి నుండి అరిగిపోయిన తెలుగు సినిమా ఫార్ములా ఇంకాస్త అరగదీస్తూ కథను క్లైమాక్స్ కి చేర్చాడు పాపం దర్శకుడు.

ఓ అందమైన పల్లెటూరు..ఆ ఊళ్ళో పెళ్లి..సందడి..ఆ పెళ్ళిలో శివ భ్రమరాంబని చూట్టం..ప్రేమలో పడటం..కూతురు(భ్రమరాంబ) అంటే విపరీత ప్రేమ వాళ్ళ నాన్నకి..మరో వైపు కొడుకంటే ప్రాణం శివ(చైతు) నాన్నకి..ఈ నాన్నకి ఆ నాన్నకి..పాత పగ.అసలు మంచితనం,పెంకితనం.కొంటెతనం..పిచ్చితనం..తింగరితనం ఉన్న భ్రమరాంబ తో శివ ప్రేమ..బాబుల పగ ఎలా ఓ దారికొచ్చిందన్నదే కధాంశం.

తెలిసిన కథే అయినా కెమెరామెన్ పనితనం తో స్క్రీన్ కి ఫ్రెషన్స్ తీసుకొచ్చాడు కానీ దాన్ని దర్శకుడు కథలోకి ఇంజక్ట్ చెయ్యలేకపోయాడు.ఇలాంటి రొటీన్ స్క్రీన్ ప్లే కి ఎమోషన్స్ కీలకం.అవి గాలికొదిలేశారు.ఇంకేముంది మనముందే ఓ అరడజను సినిమాలు తాండవం చేస్తున్నట్టుంటుంది తప్ప ఎక్కడా ఈ వేడుక చూస్తున్న ఫీలింగ్ కలగదు.

చైతు కెరీర్ పర్ఫెక్ట్ షేప్ లో వెళ్తున్నట్టనిపిస్తుంది.చైతుకి లవ్ సీన్స్ లో వుండే నేచురాలిటీ ,హానెస్టీ పీక్స్..అది ఇదివరకే చూసాం.కాకపోతే ఇందులో ఫామిలీ ఎమోషన్స్ కూడా చైతు బానే పలికించాడు కానీ లవ్ సీన్స్ లోని ఈజ్ మాత్రం లేదనిపించింది.రకుల్ ప్రీత్ స్క్రీన్ ప్రెజన్స్ సూపర్బ్.భ్రమరాంబగా బాగా మెప్పించింది.జగపతిబాబు,సంపత్ రాజ్ కాస్టింగ్ సూపర్బ్.చాల కాలం తర్వాత కౌసల్య ఓ చిన్న పాత్ర పోషించింది.కమెడియన్స్ అందరికంటే వెన్నెల కిశోరె కె కాస్త రన్ టైం ఎక్కువున్న పాత్ర దొరికింది.కామెడీ పేలకపోయినా పర్లేదనిపిస్తుంది.

కొత్తదనం లేని కథ,దానికి తోడు ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లై..ఈ రెంటిని పట్టుకుని ఈదాలంటే దర్శకుడి దగ్గర చాలా కంటెంట్ ఉండాలి. విచిత్రం ఏంటంటే దర్శకుడి కంటెంట్ ని టెక్నికల్ డిపార్ట్మెంట్ బ్యాలన్స్ చెయ్యడంతో సినిమా సేఫ్ జోన్ లో పడిపోయింది. సినిమాటోగ్రఫీ అదుర్స్.పాటలు బాగున్నాయి.బాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది .కాస్టింగ్ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది .డైలాగ్స్ కథకు కావాల్సిన మోతాదులో లేవు .

ఎంత కలర్ ఫుల్ సినిమా అయినా ఎదో ఒక ఎమోషన్ తో ప్రేక్షకుడిని సినిమాలో లీనం చెయ్యాలి.లేకపోతే ఈ వేడుకలాగే పర్లేదుకి బానే వుంది కి మధ్యలో మిగిలిపోతుంది .