బాబుకు యాంటీగా మాజీ మంత్రి హెల్ఫ్‌…వేటు త‌ప్ప‌దా

రాష్ట్రంలో టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా.. ఎవ‌రైనా మాట్లాడినా ప‌రిస్థితులు తీవ్రంగా ఉంటున్నాయి. అంతేకాదు, పార్టీకి, త‌న‌కు మ‌చ్చ తెచ్చేవారిని బాబు అస్స‌లు క్ష‌మించ‌డం లేదు. ఎంత‌టి వారైనా వేటుకు సిద్ధం అంటూ చ‌ర్య‌లు కూడా ప్రారంభించేస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఘ‌ట‌న‌లు ఆ కోవ‌లోవే. నెల్లూరు జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ టికెట్‌ను ఎంతో మంది కోరుకుంటున్నా.. ఏరికోరి వాకాటి నారాయ‌ణ‌రెడ్డికి కేటాయించారు బాబు. అయితే, ఇంత‌లోనే ఆయ‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. 

ఎమ్మెల్సీగా గెలిచిన కొద్ది రోజుల‌కే బాబు ఆయ‌న‌పై వేటు వేశారు. పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. మ‌రో ఎమ్మెల్సీ దీప‌క్ రెడ్డి కూడా తెలంగాణ‌లో జ‌రిగిన భూ కుంభ‌కోణంలో చిక్కుకుని క‌ట‌క‌టాల వెన‌క్కి వెళ్లారు. ఆయ‌న‌పైనా బాబు స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ్‌న్‌గా ఉన్న మాజీ సీఎస్ ఐవైఆర్.. బాబుకు వ్య‌తిరేకంగా పోస్టింగులు పెట్టినందుకు ఉద్యోగం ఊడ‌బీకారు. ఇలా రాష్ట్రంలో బాబు త‌న‌కు వ్య‌తిరేకంగా ఉన్న వాళ్ల‌పై చ‌ర్య‌లకు ఏమాత్ర‌మూ వెనుకాడ‌డం లేదు. 

ఇక‌, ఇప్పుడు రాష్ట్రంలో బాబు కు వ్య‌తిరేకంగా మాట్లాడ‌ల‌న్నా.. ఏదైనా పోస్టింగ్ పెట్టాల‌న్నా.. ఆయ‌న‌ను విభేదించే వారిని క‌ల‌వాల‌న్నా.. త‌మ్ముళ్లు వ‌ణికిపోతున్నారు. అలాంటి నేప‌థ్యంలో మాజీ మంత్రి, టీడీపీ నేత రావెల కిశోర్ బాబు మాత్రం బాబు కు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న వారికి ఆర్థికంగా అండ‌గా ఉంటున్న‌ట్టు స‌మాచారం. అంతేకాకుండా నేరుగా వాళ్ల కార్య‌క్ర‌మాల్లో పాల్గొనక పోయినా.. బాబుకు వ్య‌తిరేకంగా చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలకు అన్ని విధాలా సాయం చేస్తున్నాడ‌ట‌. దీంతో ఇప్పుడు ఈ విష‌యం బాబు చెవికి చేరింది. 

రాష్ట్రంలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ కోసం ఎప్ప‌టి నుంచో పోరాటం చేస్తున్నాడు మంద కృష్ణ‌. ప్ర‌స్తుతం ఏపీ సీఎం త‌మ‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని కారాలు మిరియాలు నూరుతున్నాడు. ఈ క్ర‌మంలో రాష్ట్రం అంతా తిరిగి బాబుకు వ్య‌తిరేకంగా మాదిగ‌ల‌ను కూడ‌క‌డుతున్నాడు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే నెల‌లో గుంటూరులో భారీ బ‌హిరంగ స‌భ‌కు స‌న్నాహాలు చేస్తున్నాడు. దీనికి మాజీ మంత్రి రావెల అన్ని విధాలా సాయం చేస్తున్నాడ‌ని స‌మాచారం.

నిజానికి బాబుకు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న కార్య‌క్ర‌మం కాబ‌ట్టి రావెల దూరంగా ఉండాల్సిందిపోయి.. అంతా తానే అయి న‌డిపిస్తున్నాడ‌ని బాబుకు నివేదిక‌లు సైతం అందాయి. దీంతో రావెల‌పై త్వ‌ర‌లోనే వేటు ప‌డ‌నుంద‌నే స‌మాచారం హ‌ల్ చ‌ల్ చేస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. రావెల ఎస్సీ కావ‌డంతో బాబు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నారు.