రామోజీకి – చంద్ర‌బాబుకు దూరం ఎందుకు

తెలుగుదేశం-ఈనాడు బంధం బీట‌లు వారుతోందా? టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఈనాడు సంస్థ‌ల అధిప‌తి రామోజీరావుకు మ‌ధ్య దూరం పెరుగుతోందా? అంటే అవున‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈనాడు, టీడీపీది ద‌శాబ్దాల అనుబంధం! ప్ర‌స్తుతం ఇది క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతోంద‌నే ప్ర‌చారం జోరందుకుంది. ముఖ్యంగా ప్రింట్ మీడియాలో ఈనాడు త‌ర్వాత టీడీపీని ఎక్కువ మోస్తున్న సంస్థ ఆంధ్ర‌జ్యోతికి సీఎం చంద్ర‌బాబు అధిక ప్రాధాన్యం ఇస్తుండ‌టం కూడా ఇందుకు బ‌లం చేకూరుస్తోంది. త‌న రాజ‌కీయ గురువు రామోజీరావును చంద్ర‌బాబు ప‌క్క‌న‌పెట్ట‌డం వెనుక కార‌ణాలేంట‌నే చ‌ర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ప్ర‌స్తుతం రాజ‌కీయాలకు మీడియా ఎంత‌ అవ‌స‌రమో .. మీడియాకు కూడా రాజకీయాలు అంతే అవ‌స‌రమ‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే! అధికారంలో ఉన్న పార్టీకే మీడియా సంస్థ‌లు జై కొడుతున్నాయి. ఈ అవ‌స‌రాల‌న్నీ కాల‌క్ర‌మేణా మారిపోతుంటాయి. ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో ఇదే జ‌రుగుతోంది. టీడీపీని బ‌తికించి.. ఎన్టీఆర్‌ను రాజ‌కీయాల్లో నిల‌బెట్టి.. త‌ర్వాత చంద్ర‌బాబుకు రాజ‌కీయ జీవిత‌మిచ్చిన ఈనాడు.. ఇప్పుడు అదే పార్టీకి దూర‌మ‌వుతోంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఏపీలో ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌కు ఈనాడులో అధిక ప్రాధాన్య‌మివ్వ‌డం ఇప్పుడు సీఎం చంద్ర‌బాబుకు ఆగ్ర‌హం తెప్పించ‌దనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అంతేగాక ఇటీవ‌ల టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఇసుక దందాల‌పై ఈనాడులో క‌థ‌నాలు రావ‌డం కూడా చంద్ర‌బాబు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ట‌. ఇక తెలంగాణ‌లోనూ టీఆర్ఎస్‌కు పూర్తి మ‌ద్ద‌తు ఇవ్వడం కూడా చంద్ర‌బాబు-రామోజీరావుకు మ‌ధ్య దూరం పెరగ‌డానికి కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో ఆంధ్ర‌జ్యోతి.. ఈనాడు బాధ్య‌త‌ను భుజాన వేసుకోవ‌డం బాబుకు కలిసివ‌చ్చింద‌ట‌. దీంతో పాటు టీడీపీ ప్ర‌భుత్వాన్ని నిరంత‌రం కాపాడుకుంటూ.. దూసుకుపోతోంది ఆంధ్ర‌జ్యోతి!! ప్ర‌భుత్వానికి ఇంత ల‌బ్ధి చేకూరుస్తున్న ఆ సంస్థ‌కు ప్ర‌తిగా.. కోట్లు విలువచేసే భూముల‌ను అప్ప‌నంగా క‌ట్ట‌బెట్ట‌డం ఆంధ్ర‌జ్యోతి-టీడీపీ అనుబంధానికి నిద‌ర్శ‌మ‌ని చెబుతున్నారు.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి ఈనాడును న‌మ్ముకోలేమ‌ని భావించిన చంద్ర‌బాబు అండ్ కో.. ఇప్పుడు ఆంధ్ర‌జ్యోతికి ప్రాధాన్య‌మిచ్చార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామోజీ దత్తత గ్రామంలో పర్యటిస్తూ రామోజీకి పద్మవిభూషణ్ అవార్డును ఇప్పించింది తానే అని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. వ్యక్తులు సమాజానికి చేసిన సేవకు గుర్తింపుగా కేంద్రం వాటిని ఇస్తుంది. అయితే రామోజీరావుకు ఆ అవార్డును తనే ఇప్పించాను అని చెప్పుకుని రామోజీ కీర్తికి ఆయ‌న‌ భంగం కలిగిస్తున్నార‌ని చెబుతున్నారు. మ‌రి వీరి మ‌ధ్య విభేదాలు ఎప్ప‌టికి స‌ర్దుకుంటాయో!!