చంద్ర‌బాబు కంగారు వెన‌క అస‌లు రీజ‌న్ ఇదేనా..!

2019 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. రెండేళ్లు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌టంతో ఆయ‌న ఎన్నిక‌ల మూడ్‌లోకి వెళిపోయార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాలు 2019 ఎన్నిక‌ల‌కు సన్నాహ‌కాల‌నే చ‌ర్చ జోరుగా జ‌రుగుతోంది. పార్టీకి అన‌వ‌స‌ర‌మ‌ని భావించిన‌వారిపై వేటు వేయ‌డం.. పార్టీకి అవ‌స‌ర‌మైన వాళ్లు విపక్షం నుంచి వ‌చ్చినా వారిని అంద‌ల‌మెక్కించ‌డం వంటి ప‌క్కా వ్యూహంతో బాబు వ్యూహాలు ర‌చిస్తున్నారి విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పార్టీ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని గట్టిగా చెప్పే చంద్ర‌బాబు.. అందుకోసం నా అనుకున్న వాళ్ల‌ను కూడా వ‌దిలించుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌.

మూడేళ్ల‌ త‌ర‌వాత మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌, వివాదాల‌లో ఇరుక్కున్న వారికి ఉద్వాస‌న‌, త‌న‌కు ద‌గ్గర‌ని భావించిన వారిని మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించ‌డం, విజ‌య‌వాడ ఎంపీ కేశినాని నాని, ఎమ్మెల్యే బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావుతో క్ష‌మాప‌ణ‌లు చెప్పించ‌డం, తాజాగా త‌న‌ను క‌ల‌వ‌డానికి మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌కు అవ‌కాశమివ్వ‌డం, విభ‌జ‌న అంశాల‌ను ఒక కొలిక్కి తెచ్చేందుకు చంద్ర‌శేఖ‌ర‌రావుతో భేటీకి సిద్ధ‌మ‌వుతుండ‌డం ఇలా బాబు నిర్ణ‌యాలు 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న‌వ‌ని విశ్లేష‌కుల అభిప్రాయం.

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మంత్రివ‌ర్గంలో స్థానం క‌ల్పించ‌కూడ‌ద‌ని తొలుత భావించిన‌ప్ప‌టికీ, ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణంతో కుమార్తె అఖిల ప్రియ‌కు ప‌ద‌వి ఇవ్వ‌క త‌ప్ప‌లేదు. మ‌ర‌ణం ఎంత సెంటిమెంటును ర‌గులుస్తుందో ఆయ‌న‌కు తెలియ‌నిది కాదు. అఖిల‌కు ప‌ద‌వివ్వ‌క‌పోతే, మున్ముందు గ‌డ్డుస్థితి ఏర్ప‌డే అవ‌కాశ‌ముంద‌ని గ్ర‌హించిన బాబు ఆమెను క‌రుణించారు. ఇదే స‌మ‌యంలో పార్టీకి ల‌బ్ధి చేకూర‌ద‌ని భావించిన‌ రావెల కిశోర్ బాబు, పీత‌ల సుజాత‌, కిమిడి మృణాళిని, బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డిల‌కూ ఉద్వాస‌న ప‌లికారు. ఇక కేశినాని రూపంలో ర‌వాణా రంగంలోనే మ‌రో ఇబ్బంది ఎదురైంది. ఆరెంజ్ ట్రావెల్స్ వివాదంలో ప్ర‌భుత్వానికి మచ్చ వ‌చ్చేలా క‌నిపించింది.

ప్ర‌మాదాన్ని క‌నిపెట్టేసిన సీఎం అది ముద‌ర‌క‌ముందే కేశినేని నాని, బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావుల‌తో క్ష‌మాప‌ణ చెప్పించేసి, దానికి ముగింపు ప‌లికారు. కానీ కేశినేని ట్రావెల్స్‌ను మూసేస్తున్న‌ట్లు ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. ఇదే అద‌నుగా కేశినేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నార‌ని కొంద‌ర‌నే ప్ర‌చారం జరుగుతోంది. దీంతో వెంట‌నే ఆయ‌న ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌ను తెర‌పైకి తీసుకొచ్చారు. విజ‌య‌వాడ ఎంపీగా రెండు సార్లు గెలిచిన రికార్డున్న ల‌గ‌డ‌పాటి లాంటి వారి అవ‌స‌రం చంద్ర‌బాబుకు ఇప్పుడు ఎంతో ఉంది. మ‌రి 2019 ఎన్నిక‌ల్లో విజ‌యానికి ఇలాంటి వ్యూహాలు త‌ప్ప‌వుమ‌రి!