ఏపీని అందుకే.. కేంద్రం ప‌ట్టించుకోవ‌డంలేదా..!

అవునా? నిజ‌మేనా? ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న వైఖ‌రితో రాష్ట్రం మునిగిపోవ‌డం ఖాయ‌మేనా? రాష్ట్రం అప్పుల పాల‌వ‌డం నిజ‌మేనా? అంటే ఔన‌నే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. ఏపీ సీఎంగా బాబు అనుసరిస్తున్న వైఖ‌రిపై మిత్ర ప‌క్షం బీజేపీ తీవ్ర ఆగ్ర‌హంతో ఉంద‌ని ఈ ప‌రిణామం కారణంగా ఏపీకి రాబోయే ఏడాదిన్న‌ర‌లో క‌ష్టాలు మ‌రిన్ని పెరుగుతాయ‌ని అంటున్నారు. విష‌యం ఏంటో చూద్దాం. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో మిత్ర‌ప‌క్షంగా టీడీపీ-బీజేపీ కూట‌మి రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు వెళ్లింది. ప్ర‌జ‌ల ఓట్ల‌ను ఈ కూట‌మి కొల్ల‌గొట్టింది. ఫ‌లితంగా రాష్ట్రంలో బాబు ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది.

బాబు బీజేపీకి చెందిన ఇద్ద‌రికి మంత్రి వ‌ర్గంలో స్థానం క‌ల్పించారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, ఆ త‌ర్వాత ఏం చేశారు? బీజేపీని ప‌ట్టించుకున్నారా? ఆ మంత్రుల‌కు సరైన ప్రాధాన్యం ఇచ్చారా? రాష్ట్రంలో ఉన్నది బీజేపీ-టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం అని ఎన్న‌డైనా మాట వ‌ర‌స‌కైనా ఎక్క‌డైనా చెప్పారా? పోనీ.. బీజేపీ బ‌ల‌ప‌డేలా.. ఆ నాయ‌కులు చేసుకుంటున్న ప్ర‌య‌త్నాల‌కు తెర‌చాటుగానైనా స‌హ‌క‌రించారా? బీజేపీ నేత‌లు ఆశ‌లు పెట్టుకున్న‌ట్టు.. నామినేటెడ్ పోస్టుల‌నైనా వారికి క‌ట్ట‌బెట్టారా? అంటే ఏమీలేదు. ఎక్క‌డా బీజేపీ ప్ర‌స్థావ‌నే లేదు. అస‌లు 2014లో బీజేపీ-టీడీపీ క‌లిసి పోటీ చేసింద‌ని, ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఉన్న న‌రేంద్ర మోడీ అప్ప‌ట్లో ప్ర‌చారానికి వ‌చ్చార‌ని కూడా బాబు మ‌రిచిపోయారు.

అంతేకాదు, కేంద్రం వివిధ ప‌థ‌కాల కింద ఇస్తున్న నిధుల‌ను త‌న సొంత డ‌బ్బులా ప్ర‌చారం చేసుకుంటున్నారు బాబు. ముఖ్యంగా ఎల్ ఈడీ బ‌ల్బులు పూర్తిగా కేంద్ర ప‌థ‌కం. దీనిలో రాష్ట్ర ప్ర‌భుత్వానిది ఏమీ లేదు. కేవ‌లం అమ‌లు చేయ‌డ‌మే. అదేవిధంగా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు. ఇది కూడా పూర్తిగా కేంద్రం ప‌థ‌కం. దీనికి 90% నిధులు కేంద్రం ఇస్తోంది. అదేవిధంగా సోలార్ విద్యుత్ అభివృద్ధి, ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న వంటివికూడా కేంద్రానివే. వీటికి వెచ్చిచే నిధులు 90% కేంద్ర‌మే ఇస్తుంది. అయినా కూడా ఎక్క‌డా బాబు బీజేపీ పేరుగానీ, కేంద్ర ప‌థ‌కాలు అనికానీ చెప్ప‌డం లేదు. అంతా త‌న క్రెడిట్‌లోకే వేసేసుకుంటున్నారు. అంతేకాదు, కుదిరితే.. బీజేపీ నేత‌ల‌ను సైతం త‌న పార్టీలో క‌లిపేసుకునేందుకు బాబు మంత‌నాలు చేస్తున్నార‌ని తెలుస్తోంది.

దీంతో ఆయా విష‌యాలు ఆనోటా.. ఈ నోటా.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, బీజేపీ సార‌ధి అమిత్ షాల‌ దృష్టికి వెళ్లాయి. దీంతో వారు నొప్పి తెలియ‌కుండా బాబుకు బుద్ధి చెప్పాల‌ని డిసైడ్ అయ్యార‌ని అంటున్నాయి ఢిల్లీ వ‌ర్గాలు. బాబు వెన‌కాల కేంద్రం అండ‌గా లేక‌పోతే.. ఏం జ‌రుగుతుందో చూపించాల‌ని వారు నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే కేంద్ర ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబుకు ఎవ‌రెవ‌రు అనుకూలంగా ఉన్నారో.. గుర్తించి వారి సీట్లు మార్చేసేయడం ప్ర‌థ‌మ క‌ర్త‌వ్యంగా పెట్టుకున్నారు.

ముందుగా ప‌ట్ట‌ణాభివృద్ది మంత్రి వెంక‌య్య సీటు చించేశారు. త‌ర్వాత జ‌ల‌వ‌న‌రుల మంత్రి ఉమాభార‌తిని త‌ప్పించేశారు. రైల్వే మంత్రి సురేష్ ప్ర‌భు స్థానం మార్చేశారు. విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయ‌ల్‌కు దానిని తీసేశారు. ఇలా బాబుకు తొలుత ఝ‌లక్ ఇచ్చారు. ఇక‌, రాబోయే రోజుల్లో మ‌రింత‌గా బాబు బిగించాల‌ని, మిత్ర ధ‌ర్మాన్ని పాటించ‌క‌పోతే.. ఏం జ‌రుగుతుందో రుచి చూపించాల‌ని కూడా మోడీ, షాలు డిసైడ్ అయ్యార‌ని తెలుస్తోంది. మ‌రి బాబు ఇప్ప‌టికైనా మార‌తాడా? లేడా? చూడాలి.