బాబు బాణం బాబుకే త‌గిలింది

ఏపీలో పార్టీని సంస్థాగ‌తంగా క‌న్నా నాయ‌కుల‌తో బ‌లోపేతం చేసేయాల‌ని క‌ల‌లు క‌న్న చంద్ర‌బాబు క‌ల‌లు రివ‌ర్స్ అయ్యాయి. ఏపీని అభివృద్ధి చేయ‌డం ద్వారానో లేదా పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేయాల‌నో చూడ‌కుండా చంద్ర‌బాబు విప‌క్ష వైసీపీ వాళ్ల‌ను త‌మ పార్టీలో చేర్చేసుకుంటే ఇక్క‌డ ఎమ్మెల్యేల కౌంట్ పెరిగిపోతుంద‌ని లెక్క‌లు వేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే వైసీపీకి చెందిన ఒక‌రిద్ద‌రు ఎంపీల‌తో పాటు 21 మంది ఎమ్మెల్యేలు, కొంద‌రు ఎమ్మెల్సీలు అధికార పార్టీ చెంత చేరిపోయారు.

చంద్ర‌బాబు అనుకున్న‌ట్టు ఇక్క‌డ ఎమ్మెల్యేల కౌంట్ పెరిగిపోయింది. మ‌రి పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న ప‌దేళ్ల‌పాటు క‌ష్ట‌ప‌డి ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన నాయ‌కులు ఏం అవ్వాలి. వారు ఇప్పుడు చంద్ర‌బాబుకు ఎందుకూ ప‌నికిరాకుండా పోయారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి వ‌చ్చిన వాళ్ల‌కు టిక్కెట్లు ఇస్తే మ‌రి ఇప్పుడు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్న వాళ్లు, గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన వాళ్ల ప‌రిస్థితి ఏంటి ? అందుకే వీరి దారి వీరు వెతుక్కుంటున్నారు.

తాజాగా కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్‌ తగిలింది. మాజీ మంత్రి,టీడీపీ సీనియర్ నేత శిల్పా మోహన్‌ రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. తన అనుచ‌రుల స‌మ‌క్షంలో తాను ఈ నెల 14న వైసీపీలో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. టీడీపీలో త‌న‌ను అడుగ‌డుగునా అవ‌మానాల‌కు గురి చేస్తున్నార‌ని… నియోజ‌క‌వ‌ర్గంలో త‌న వ‌ర్గం సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లినా స్పందించలేదన్నారు. దీంతో తమ కార్యకర్తలతో చర్చించన తర్వాతే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు శిల్పా మోహన్‌ రెడ్డి తెలిపారు. శిల్పా ప్ర‌క‌ట‌న‌తో నంద్యాల‌లో టీడీపీకి పెద్ద షాకే త‌గిలింద‌ని చెప్పాలి.

నంద్యాల‌లో ఫ్యూచ‌ర్ లేద‌నేనా..!

ఇక ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ద్వారా పార్టీని బ‌లోపేతం చేయాల‌ని చంద్ర‌బాబు వేసిన బాణం రివ‌ర్స్‌లో ఇప్పుడు ఆయ‌న‌కే త‌గిలింది. ఇక శిల్పా టీడీపీకి గుడ్ బై చెప్ప‌డం వెన‌క ఆయ‌న‌కు నంద్యాల‌లో టీడీపీ ప‌రంగా పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ లేద‌ని డిసైడ్ అవ్వ‌డ‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది. ఇక్క‌డ టిక్కెట్టు విష‌య‌మై ఆయ‌న ఇటీవ‌ల చంద్ర‌బాబును క‌లిసినప్పుడు కూడా ఎలాంటి హామీ రాలేదు.

ఇక్క‌డ చంద్ర‌బాబు ఈ ఉప ఎన్నిక‌ల్లోను, వ‌చ్చే ఎన్నిక‌ల్లోను భూమా ఫ్యామిలీకే టిక్కెట్టు ఇవ్వ‌డం దాదాపు ఖాయ‌మైంది. టీడీపీ టిక్కెట్ ప్రస్తుతం భూమా సోదరుడి కుమారుడు బ్రహ్మానందరెడ్డికి ఇవ్వాలని చంద్రబాబు డెసిష‌న్ తీసుకున్నారు. నంద్యాల‌లో బ్ర‌హ్మానంద‌రెడ్డి నిల‌దొక్కుకుంటే త‌మ‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేద‌ని డిసైడ్ అయిన శిల్పా పార్టీని వీడేందుకే నిర్ణ‌యం తీసుకున్నారు. ఏదేమైనా చంద్ర‌బాబు విసిరిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ బాణం ఆయ‌న‌కే గుచ్చుకుంది.