టీడీపీ-బీజేపీ పొత్తు చిత్తు… ఆ టీడీపీ లీడ‌రే కార‌ణ‌మా..!

టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి వ్య‌వ‌హార శైలి అటు టీడీపీ పెద్ద‌ల‌తో పాటు.. బీజేపీ నేత‌ల‌కు త‌ల‌నొప్పులు తెచ్చిపెడు తోంది. ఆయ‌న దూకుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. మిత్ర బంధానికి బీటలు వారేలా చేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీచేస్తా రో లేదా సొంతంగానే బ‌రిలోకి దిగుతారో తెలియని సందిగ్ధంలో ఉంటే ఉరుములేని పిడుగులా ఆయ‌న చేసిన వ్యాఖ్యా లు.. ప‌రిస్థితుల‌ను మ‌రింత సంక్లిష్టం చేసేస్తున్నాయి! టీఆర్ఎస్‌తో పాటు బీజేపీని ఆయ‌న విమ‌ర్శిస్తున్న తీరు ఇప్పు డు టీడీపీ, బీజేపీల్లో క‌ల‌క‌లం రేపుతోంది! సాఫీగా జంట ప్ర‌యాణం చేయాల‌ని, ఉమ్మ‌డిగా టీఆర్ఎస్‌పై పోరాడాల‌ని పెద్ద‌లు చెబుతున్నా.. రేవంత్ మాత్రం త‌న దూకుడుకు త‌గ్గించ‌క‌.. అగ్నికి ఆజ్యం పోస్తున్నారు!!

న‌ల్గొండ ఉప ఎన్నిక జ‌ర‌గ‌బోతోంద‌నే సంకేతాలు టీఆర్ఎస్ వ‌ర్గాల నుంచి వ‌స్తున్నాయి! దీనిద్వారా విప‌క్షాల‌కు గట్టి స‌మాధానం ఇవ్వాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించుకున్నార‌ని చెబుతున్నారు. అయితే ఒక‌వేళ ఉప ఎన్నిక వ‌స్తే.. టీడీపీ-బీజేపీ వ్యూహం ఎలా ఉంటుంద‌నే చ‌ర్చ కూడా మొద‌లైంది. ఇక్క‌డే ఇరు పార్టీల‌కు చిక్కొచ్చి ప‌డింది. పొత్తు దృష్ట్యా ఉమ్మ‌డి అభ్య‌ర్థిని బ‌రిలోకి దించాల‌ని భావించినా.. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు మిత్రుల మ‌ధ్య దూరాన్ని పెంచేస్తున్నాయి. ఉన్న చిన్న‌పాటి ఆశ‌ల‌ను కూడా ఆర్పేసింది. టీఆర్ఎస్ పట్ల బీజేపీ రాష్ట్ర పార్టీ నేతలు ఒక వైఖరితో, కేంద్ర పార్టీ నేతలు మరో వైఖరితో ఉన్నారని ఓ జాతీయ పార్టీగా క్లారిటీ లేకపోతే ఎలాగంటూ ప్రశ్నించారు.

కేసీఆర్ పాలన పూర్తిగా పడకేసిందని రాష్ట్ర నేతలు విమర్శిస్తే ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులు మాత్రం కేసీఆర్ పాలన ను అదేపనిగా పొగుడుతున్నారని బీజేపీ నేతలు కేసీఆర్ తో ఉంటారా ప్రజలతో ఉంటారా అంటూ రేవంత్ సవాల్ విసిరారు. ఇవే ఇప్పుడు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. ఇక దీంతో పాటు.. ఇటీవల రేవంత్ ఎంఐఎం శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ తో గంటన్నరకు పైగా సమావేశం కావడం కూడా బీజేపీ నేత‌ల‌కు ఆగ్ర‌హం తెప్పించింది. ఒకవైపు కేసీఆర్ ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నాడని తాము విమర్శిస్తూ.. ఆయన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుంటే అదే ఎంఐఎంతో రేవంత్ భేటీ కావడం కూడా కొంత చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఎంఐఎంతో భేటీ తరువాతనే రేవంత్ ఇలాంటి కామెంట్లు చేశారన్న అభిప్రాయంలో బీజేపీ నేతలు ఉన్నట్టు ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఎంఐఎం నేతలు టీడీపీని పావుగా వాడుకుంటే అది మొదటికే మోసం వస్తుందన్న ఆందోళన కమలనాథుల్లో క‌లుగుతోంద‌ట‌! ఈ నేప‌థ్య‌లోనే బీజేపీ నేత ల‌క్ష్మ‌ణ్ కూడా తాము ఒంట‌రిగానే ప్ర‌క‌టించ‌డం వెనుక‌,, ఇక టీడీపీ-బీజేపీ దోస్తీకి కాలం చెల్లిన‌ట్టేన‌నే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో మొద‌లైంది. ఇన్నాళ్లూ పొత్తు ఉంటుంద‌ని భావించినా.. ఇక టీడీపీ ఫైర్ బ్రాండ్ పెట్టిన చిచ్చుతో అది ఆరిపోయే దీప‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నావేస్తున్నారు!!