మ‌హానాడులో ఆ ఇద్ద‌రూ త‌ప్పా….అంద‌రూ బోర్ 

విశాఖ వేదిక‌గా టీడీపీ నిర్వ‌హించిన అతి పెద్ద పార్టీ పండుగ మ‌హానాడుకు అనూహ్య స్పంద‌న ల‌భించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జ‌యంతి ఆదివారం రావ‌డంతో ఎక్క‌డెక్క‌డినుంచో అభిమానులు, కార్య‌క‌ర్త‌లు వ‌చ్చారు. అయితే, ఈ మ‌హానాడు సంద‌ర్భంగా అధినేత చంద్ర‌బాబు మొద‌లు కొని ఏపీ, తెలంగాణ అధ్య‌క్షులు, పొలిట్ బ్యూరో స‌భ్యులు ప్ర‌సంగించారు. అయితే, ఈ మూడు రోజుల పండుగ‌లో కేవ‌లం ఇద్ద‌రి ప్ర‌సంగాలు మాత్ర‌మే ఆక‌ట్టుకున్నాయ‌నే టాక్ వ‌చ్చింది.

ముఖ్యంగా టీడీపీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి ప్ర‌సంగానికి ఎక్క‌డ లేని క్రేజ్ వ‌చ్చింది. నిజానికి ఆయ‌న ఏపీ వ్య‌క్తి కాడు. ఆయ‌న ఏపీకి స‌పోర్ట్ కూడా కాదు. అయిన‌ప్ప‌టికీ.. రేవంత్ ప్ర‌సంగం కోసం త‌మ్ముళ్లు ఎదురు చూశారు. ఇక‌, ఆయ‌న ప్ర‌సంగం స్టార్ట్ చేసిన త‌ర్వాత పెద్ద ఎత్తున ఈల‌లు చ‌ప్ప‌ట్ల‌తో స‌భ త‌మ ఆనందం వ్య‌క్తం చేశారు. అయితే, స‌మ‌యా భావం వ‌ల్ల మ‌ధ్య‌లోనే మైక్ క‌ట్ అయింది. దీనికి అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేశారు. దీంతో చంద్ర‌బాబే స్వ‌యంగా మైక్ ఇప్పించి రేవంత్ ప్ర‌సంగం పూర్త‌య్యేలా వ‌ర‌కు విన్నారు.

ఇక‌, మ‌రో యువ నేత, ఎర్ర‌న్నాయుడి కుమారుడు రామ్మోహ‌న్‌నాయుడు చేసిన ప్రసంగం కూడా అంద‌రినీ ఆక‌ట్టుకుంది. మాట్లాడింది త‌క్కువ స‌మ‌య‌మే అయిన‌ప్ప‌టికీ.. ఆస‌క్తిగా క్లుప్తంగా తాను చెప్ప‌ద‌లుచుకున్న‌ది స్ప‌ష్టంగా చెప్ప‌డంతో రామ్మోహ‌న్‌కి మార్కులు ప‌డ్డాయ‌ని స‌మాచారం. అదేస‌మ‌యంలో అధినేత చంద్ర‌బాబు నాయుడు చేసిన ప్ర‌సంగం స‌భికుల్లో ఉత్సాహం ఇవ్వ‌క‌పోగా బోర్ కొట్టించింద‌నే కామెంట్లు వ‌చ్చాయి. అయినా కూడా.. అధినేత కాబ‌ట్టి అంద‌రూ స‌ర్దేసుకున్నార‌ట‌.

ఇక‌, మీడియా స‌ల‌హాదారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ ఏవో పిట్ట క‌థ‌లు, చ‌లోక్తుల‌తో ఆక‌ట్టు కోవాల‌ని చూసినా.. మాస్ ఎలిమెంట్ లేక‌పోవ‌డంతో ఆయ‌న కూడా ఫెయిల్ అయ్యార‌ట‌. అదేస‌మ‌యంలో సీఎంత‌న‌యుడు , మంత్రి లోకేశ్ త‌న ప్ర‌సంగంలో జ‌గ‌న్‌ని ఏకేసినా.. కూడా ఆశించిన మైలేజీ రాలేదు. ఏదో మమ అని అనిపించ‌డం ఒక్క‌టే క‌నిపించింది. ఇక‌, లోకేశ్ ప్ర‌సంగంలో ఎలాంటి త‌ప్పులు దొర్లుతాయో అని ఆస‌క్తిగా ఎదురు చూసిన వారికి మాత్రం కొంత నిరాశే ఎదురైంది. ఆయ‌న నిఖార్సుగా జాగ్ర‌త్త‌గా ప్ర‌సంగించారు. సో.. ఇంత మందిలో ఆ ఇద్ద‌రే స్టార్లుగా నిల‌బ‌డ‌డం గ్రేట్ అంటున్నారు విశ్లేష‌కులు.