‘భ‌ర‌త్ అనే నేను’ TJ రివ్యూ

April 20, 2018 at 9:10 am

TJ రివ్యూ:  భ‌ర‌త్ అనే నేను

 

టైటిల్‌: భ‌ర‌త్ అనే నేను

జాన‌ర్‌:  పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌

బ్యాన‌ర్‌: డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

న‌టీన‌టులు:  మ‌హేష్‌బాబు, కైరా అద్వానీ, స‌త్య‌రాజ్‌, రావూ ర‌మేష్‌, ప్ర‌కాష్‌రాజ్, శ‌ర‌త్‌కుమార్‌, ర‌వి శంక‌ర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళీ త‌దిత‌రులు

ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: సురేష్ సెల్వ‌రాజ‌న్‌

ఎడిటింగ్‌: శ‌్రీక‌ర ప్ర‌సాద్‌

సినిమాటోగ్ర‌ఫీ:  ర‌వి.కె చంద్ర‌న్‌, ఎస్‌.తిరుణావ‌క్క‌ర‌సు

సాహిత్యం:  రామ‌జోగ‌య్య శాస్త్రి

మ్యూజిక్‌:  దేవిశ్రీ ప్ర‌సాద్‌

నిర్మాత‌:  డీవీవీ దాన‌య్య‌

ద‌ర్శ‌క‌త్వం:  కొర‌టాల శివ‌

సెన్సార్ రిపోర్ట్‌:  యూ / ఏ

ర‌న్ టైం: 173 నిమిషాలు

ప్రి రిలీజ్ బిజినెస్‌: రూ. 99 కోట్లు

రిలీజ్ డేట్‌:  20 ఏప్రిల్‌, 2018

 

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు సినిమా వ‌స్తుందంటే టాలీవుడ్‌కు పండ‌గే పండ‌గ‌. మ‌హేష్‌కు తెలుగు సినిమా అభిమానుల్లో ఉన్న క్రేజ్ అలాంటిది. మ‌హేష్ ఎంతో ఎఫ‌ర్ట్ పెట్టి చేసిన చివ‌రి రెండు సినిమాలు ఆయ‌న‌తో పాటు ఆయ‌న అభిమానుల‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచాయి. బ్ర‌హ్మోత్స‌వం, స్పైడ‌ర్ ప్లాప్ అవ్వ‌డంతో మ‌హేష్ రూటు మార్చుకుని ఈ సారి పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌కు ఓటేశాడు. కెరీర్‌లోనే త‌న తాజా చిత్రం భ‌ర‌త్ అనే నేను సినిమాలో ఫ‌స్ట్ టైం సీఎంగా న‌టించాడు. ఇక టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం కొర‌టాల శివ ముగ్గురు టాప్ హీరోల‌తో మూడు సూప‌ర్ హిట్లు కొట్టి టాప్ డైరెక్ట‌ర్ల లిస్టులో చేరిపోయాడు. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన శ్రీమంతుడు సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఆ సినిమా మ‌హేష్ కెరీర్‌లోనే అల్టిమేట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. మ‌రోసారి అదే కాంబోలో భ‌ర‌త్ అనే నేను సినిమా వ‌స్తుండ‌డం, అటు సాంగ్స్‌, టీజ‌ర్లు, ట్రైల‌ర్లు దుమ్ము రేప‌డంతో భ‌ర‌త్‌పై అంచ‌నాలు మామూలుగా లేవు. మ‌రోసారి మ‌హేష్ – కొర‌టాల శ్రీమంతుడు సినిమాను మించిన మ్యాజిక్ రిపీట్ చేస్తార‌ని అంద‌రూ ఆశ‌ల‌తో ఉన్నారు. మ‌రి ఈ రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయిన భ‌ర‌త్ స్కై రేంజ్ అంచ‌నాలు అందుకున్నాడా ?  లేదా ? అన్న‌ది TJ స‌మీక్ష‌లో చూద్దాం.

 

స్టోరీ :

న‌వోద‌య పార్టీని రాఘ‌వ‌రాజు (శ‌ర‌త్‌కుమార్‌), వ‌ర‌ద‌రాజు (ప్ర‌కాష్‌రాజ్‌) స్థాపిస్తారు. వీరిలో రాఘ‌వ సీఎంగా ఉంటే, వ‌ర‌ద‌రాజు పార్టీ అధ్య‌క్షుడిగా ఉంటారు. రాఘ‌వ హ‌ఠాన్మ‌ర‌ణ‌తో లండ‌న్‌లో చ‌దువుతున్న రాఘ‌వ‌కుమారుడు భ‌ర‌త్ (మ‌హేష్‌) ఇండియాకు వ‌స్తాడు… సీఎం సీటు కోసం పార్టీలో చాలా మంది ఫైట్ చేస్తుంటారు. ఈ టైంలో రాఘ‌వ న‌మ్మిన‌బంటు వ‌ర‌ద‌రాజు త‌న స‌న్నిహితుడు కుమారుడు భ‌ర‌త్‌నే సీఎం చేస్తాడు. భ‌ర‌త్ సీఎం అయిన వెంట‌నే ఒక్కో వ్య‌వ‌స్థ‌ను ప్రక్షాళ‌న చేయ‌డం స్టార్ట్ చేస్తాడు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వాళ్ల‌కే ఏకంగా రూ.20 వేలు, 25 వేలు ఫైన్లు వేసి రాష్ట్రంలో సంచ‌ల‌నం రేపుతాడు. ఆ త‌ర్వాత విద్యావ్య‌వ‌స్థ‌లో పెను ప్ర‌క్షాళ‌న చేస్తాడు ?  చివ‌ర‌కు స్టేట్‌లో జ‌నాల గుండెళ్లో దేవుడిగా కొలువు అవుతాడు. ఈ క్ర‌మంలోనే వ‌సుమ‌తి (కైరా అద్వానీ)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. దోచుకుని దాచుకునే వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తోన్న సీఎంను టార్గెట్ చేసేందుకు అటు ప్ర‌తిప‌క్షంతో పాటు ఇటు స్వ‌ప‌క్షంలోనూ బ‌డా రాజ‌కీయ నాయ‌కులు టార్గెట్ చేస్తారు ?  ఈ క్ర‌మంలోనే మ‌హేష్‌కు కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి ?  చివ‌ర‌కు త‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా సైతం చేయాల్సి వ‌స్తుంది ?  ఈ క్ర‌మంలోనే అత‌డు తిరిగి జ‌నాల‌కు ఎలా ద‌గ్గ‌ర‌య్యాడు ?   సీఎం ప‌ద‌వి చేప‌ట్టాడా ?  లేదా ?  వ‌సుమ‌తితో అత‌డి ప్రేమాయ‌ణం ఏమైంది ? అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

 

క‌థ‌నం విశ్లేష‌ణ :

తండ్రి సీఎంగా ఉంటాడు… ఆయ‌న చనిపోయాడ‌న్న వార్త‌తో లండ‌న్లో చ‌దువు పూర్తి చేసుకున్న ఓ యువ‌కుడు అనుకోని ప‌రిస్థితుల్లో సీఎం అవుతాడు. ఇక్క‌డ సమాజ ప‌రిస్థితులు, ప్ర‌జ‌లు ప‌డుతోన్న క‌ష్టాలు చూసి మార్పులు తేవాల‌నుకుంటాడు. అనుకున్న‌దే త‌డ‌వుగా చ‌క‌చ‌కా సొంతంగా నిర్ణ‌యాలు తీసేసుకుంటుంటాడు. ఒక్కో వ్య‌వ‌స్థ‌లో మార్పులు చేసేస్తుంటాడు. ఈ క్ర‌మంలోనే ఇటు పోజిష‌న్‌తో పాటు అపొజిష‌న్ నుంచి అత‌డిని టార్గెట్ చేస్తారు. జ‌నం వేరు మ‌నం వేరు అనే నాయ‌కుల‌కు మ‌న‌మే జ‌నం అని హిత‌బోధ చేస్తాడు. సినిమా తొలి గంట అస్స‌లు తెలియ‌కుండానే గ‌డిచిపోతుంది. హీరో సీఎం అవ్వ‌డం, వ్య‌వ‌స్థ మార్పు కోసం న‌డుంబిగించ‌డం, ఆ త‌ర్వాత హీరోయిన్‌ను తొలి చూపులోనే ప్రేమించేయ‌డం ఇలా చ‌క చ‌కా ముందుకు క‌దులుతుంది. ఓ ఉప ఎన్నిక‌లో త‌న పార్టీ వాడికి కాకుండా ఇండిపెండెంట్ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇచ్చే సీన్‌… అప్పుడు వ‌చ్చే యాక్ష‌న్ సీన్‌తో సినిమా గ్రాఫ్ ఒక్క‌సారిగా పెరుగుతుంది. 

 

సెకండాఫ్ మాత్రం ద‌ర్శ‌కుడు పూర్తిగా మాస్‌కు న‌చ్చేలా తీసేశాడు. యాక్ష‌న్ డోస్ బాగా ద‌ట్టించేశాడు. హీరోయిన్‌కు పెద్ద‌గా స్కోప్ ఉండ‌దు. ఆమె వ‌స్తే సాంగ్‌కు ముందు రావాల్సిందే. ఇక సెకండాఫ్ కంప్లీట్‌గా రాజ‌కీయాల‌తోనే క‌థ మూవ్ అవుతుంది. ప్ర‌స్తుతం స‌మ‌కాలీన స‌మాజం, రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లు తీరు తెన్ను ఎలా ఉందో ద‌ర్శ‌కుడు బ్యాలెన్స్ చేస్తూ క‌థ‌ను న‌డిపించిన తీరు అద్భుతం అనే చెప్పాలి. ప్రెస్‌మీట్లో మ‌హేష్ మీడియాను కార్న‌ర్ చేస్తూ చెప్పిన సెటైర్లు బాగా పేలాయి. అయితే కొర‌టాల ప్ర‌తి సినిమాల‌కు క్లైమాక్స్ విష‌యంలో కంప్లెంట్స్ ఉంటాయి. క్లైమాక్స్ తేలిపోయిన‌ట్లు ఉంటుంది. ఈ సినిమా కూడా క్లైమాక్స్ 15 నిమిషాల ముందు వ‌ర‌కు ఓ వేగంతో వెళ్లిన సినిమా ఆ త‌ర్వాత గ్రాఫ్ త‌గ్గుతుంది. అయితే ఇలాంటి పొలిటిక‌ల్ జాన‌ర్‌లో తెర‌కెక్కిన సినిమాల‌కు ఇంత‌కు మించి తీయ‌డం కూడా క‌ష్ట‌మే. 

 

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

సీఎంగా మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే వ‌న్ ఆఫ్ ద బెస్ట్ పెర్పామెన్స్ ఇచ్చాడు. స‌మాజానికి మంచి చేయాల‌న్న ఓ యంగ్ డైన‌మిక్ లీడ‌ర్ సీఎం అయితే ఎలా ఉంటుందో ?  మ‌హేష్ సినిమాలో అదు చేసి చూపించాడు. లుక్స్‌, మేన‌రిజ‌మ్స్‌, యాక్ష‌న్‌, స్టైలీష్‌గా సూప‌ర్బ్ పెర్పామెన్స్ ఇచ్చాడు. ఇక హీరోయిన్ కైరా అద్వానీ పాత్ర‌కు స్కోప్ లేదు. పాట‌లకే ఆమె ప‌రిమితం. ఆమె గ‌ట్టిగా చెప్పాలంటే 7-8 సీన్ల‌కే ప‌రిమితం. ఆమె అందంతో ఆక‌ట్టుకుంది. ఆమెను ద‌ర్శ‌కుడు మ‌రింత‌గా వాడుకుని ఉండాల్సింది. ఇక మ‌హేష్ త‌ల్లిదండ్రులుగా శ‌ర‌త్‌కుమార్‌, సితార‌, పార్టీ అధ్య‌క్షుడిగా అంచ‌నాల‌కు అంద‌ని కేరెక్ట‌ర్‌లో ప్ర‌కాష్‌రాజ్‌, మంత్రులుగా ర‌విశంక‌ర్‌, పోసాని, జీవా పాత్ర‌ల‌తో మెప్పించారు. అపొజిష‌న్ లీడ‌ర్‌గా స‌త్య‌రాజ్‌, సీఎం ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీగా బ్ర‌హ్మాజీ, సీఐడీ అడిష‌న‌ల్ డీఐజీగా అజ‌య్ క‌రెక్టుగా సెట్ అయ్యారు. హీరోయిన్ తండ్రి కానిస్టేబుల్ రోల్‌లో రావూ ర‌మేష్ పాత్ర మూడు నాలుగు సీన్ల‌కే ప‌రిమితం అయ్యింది. ఓవ‌రాల్‌గా ప్ర‌తి ఒక్క‌రికి ఉన్నంత‌లో మంచి స్క్రీన్ ప్రెజెన్సీ ఇచ్చిన ద‌ర్శ‌కుడు హీరోయిన్ రోల్‌కు మాత్రం అన్యాయం చేశాడు.

 

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్‌:

సినిమాకు అన్ని సాంకేతిక విభాగాలు నూటికి రెండొంద‌ల శాతం ఎఫ‌ర్ట్ పెట్టి ప‌నిచేశాయి. ముందుగా దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడు. పాట‌లు విన‌డానిక‌న్నా తెర‌మీద ఇంకా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. ఆర్ఆర్‌లో సినిమా చూస్తోన్న ప్రేక్ష‌కుడి మూడ్‌ను బాగా కనెక్ట్ చేయ‌డంలో ఆర్ ఆర్ బాగా హెల్ఫ్ అయ్యింది. దేవిశ్రీ ఎఫ‌ర్ట్ స్ప‌ష్టంగా తెలిసింది. ఆర్ట్ వ‌ర్క్ అసెంబ్లీ సెట్ జ‌స్ట్ ఓకే. సినిమాలో అంద‌రి కాస్ట్యుమ్స్ బాగున్నాయి… ఈ విష‌యంలో చాలా కేర్ క‌న‌ప‌డింది. ర‌వికెచంద్ర‌న్‌, తిరుణావ‌క్క‌ర‌సు సినిమాటోగ్ర‌ఫీ క‌ల‌ర్‌ఫుల్‌గా, రిచ్‌గా ఉంది. రామ్ – ల‌క్ష్మ‌ణ్ యాక్ష‌న్ విష‌యానికి వ‌స్తే థియేట‌ర్ల‌లో సీఎంగా మ‌హేష్ చేసే ఫైట్‌కు థియేట‌ర్లో కంటిన్యూగా విజిల్సే. ఎడిటింగ్ సినిమా క‌థ‌, సీన్ల ప‌రంగా చూస్తే బాగున్నా సెకండాఫ్‌లో మాత్రం బాగా లాగ్ అయ్యింది. సెకండాఫ్‌లో క‌థ‌తో సంబంధం లేని ఒక‌టి రెండుసీన్లు ట్రిమ్ చేయాల్సింద‌నిపించింది. అయినా శ్రీక‌ర‌ప్ర‌సాద్ చేసిన కూర్పుకు హ్యాట్సాఫ్‌. దాన‌య్య నిర్మాణ విలువ‌లు మామూలుగా లేవు. ఈ సినిమాతో దాన‌య్య బేన‌ర్ ప్ర‌తిష్ట డుబుల్ అయ్యింది. టాలీవుడ్‌లో ఒక‌ప్ప‌టి టాప్ బ్యానర్ల లిస్టులోకి దాన‌య్య బ్యాన‌ర్‌కు చోటు ఉంటుంది. 

 

కొర‌టాల డైరెక్ష‌న్ క‌ట్స్ :

ప్ర‌స్తుతం రాజ‌కీయాలు, ప్ర‌జ‌లు, నాయ‌కుల ఆలోచ‌నా విధానాలు, మీడియా ఎలా బ్ర‌ష్టుప‌ట్టిపోయాయి ?  వీటిని ఎలా మార్చాలి అనే పొలిటిక‌ల్ లైన్ తీసుకున్న కొరటాల స‌బ్జెక్ట్ ఏ మాత్రం ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా తాను చెప్పాల‌నుకున్న దానిని సూటిగా తెర‌మీద ప్ర‌జెంట్ చేశాడు. ఓ అంద‌మైన గ్రిప్పింగ్ పొలిటిక‌ల్ స్టోరీగా ఈ సినిమాను మ‌లిచాడు. అయితే కొన్ని చోట్ల లీడ‌ర్ లాంటి సినిమాల చాయ‌లు కూడా క‌న‌ప‌డతాయి. ఫ‌స్టాఫ్‌లో కామోడీ, యాక్ష‌న్, మూడు నాలుగు ప్రేమ స‌న్నివేశాల‌తో చ‌క్క‌గా క‌థ‌నం సెట్ చేశాడు. అయితే ఇంట‌ర్వెల్ త‌ర్వాత క‌థ‌నం సాగ‌దీసి… న‌ట్టు ఉన్నా బోర్ లేకుండా ఆలోజింప‌చేసేలా ఉంది. అయితే క్లైమాక్స్‌కు ముందు క‌థ‌నం వేగం క్ర‌మ‌క్ర‌మంగా డౌన్ అవుతుంది. ఓవ‌రాల్‌గా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కిన సినిమాగా భ‌ర‌త్ నిలుస్తుంది. ఈ సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌గా కొర‌టాల మ‌రో మెట్టు పైకి ఎక్కాడు. ఇక త‌న ప్ర‌తి సినిమాలోలాగానే మంచి సందేశం కూడా ఇచ్చాడు.

 

ప్ల‌స్ పాయింట్స్ (+):

– గ్రిప్పింగ్ పొలిటిక‌ల్ స్టోరీ లైన్‌

– డైరెక్ష‌న్‌

– సీఎంగా మ‌హేష్ రోల్‌

– క‌ల‌ర్‌ఫుల్ సినిమాటోగ్ర‌ఫీ

– దేవిశ్రీ సూప‌ర్ సూప‌ర్ మ్యూజిక్‌

– దాన‌య్య నిర్మాణ విలువ‌లు

– స‌మ‌కాలీన రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో లోపాలు – ప‌రిష్కారాలు చ‌క్క‌గా ఎత్తిచూప‌డం

 

మైన‌స్ పాయింట్స్ (-) :

– హీరోయిన్‌గా స్కోప్ లేక‌పోవ‌డం

– ప్లాట్ న‌రేష‌న్‌

– లాగ్ అయిన సెకండాఫ్‌

– ర‌న్ టైం మ‌రీ ఎక్కువ కావ‌డం

 

ఫైన‌ల్‌గా…

శ్రీమంతుడిని మించిన భ‌ర‌త్‌

 

TJ సూచ‌న‌:  సీఎం భ‌ర‌త్ ర‌చ్చ థియేట‌ర్ల‌లోనే చూడాలి

 

TJ రేటింగ్‌: 3.5 / 5

‘భ‌ర‌త్ అనే నేను’ TJ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share