పి ఎస్ వి గ‌రుడ‌వేగ‌ TJ రివ్యూ

టైటిల్‌: పి ఎస్ వి గ‌రుడ‌వేగ‌

జాన‌ర్‌: యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌

నటీనటులు: డాక్ట‌ర్‌ రాజశేఖర్, పూజ కుమార్, అరుణ్ అదిత్, కిషోర్, శ్రద్ధ దాస్, నాజర్, ఆలి, సన్నీ లియోన్ (స్పెషల్ సాంగ్), రవి వర్మ, పోసాని, షాయాజీ షిండే త‌దిత‌రులు

సినిమాటోగ్రఫి : అంజి, సురేష్, శ్యాం ప్రసాద్, Gika Chelidze, Bakur Chikobava

ఎడిటింగ్ : ధర్మేంద్ర కాకరాల

మ్యూజిక్‌ : శ్రీ చరణ్ పాకాల, భీమ్స్‌

నిర్మాత: ఎం. కోటేశ్వర రాజు

కథ : ప్రవీణ్ సత్తారు, నిరంజన్ రెడ్డి

కథ‌నం, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు

రిలీజ్ డేట్‌: 3 న‌వంబ‌ర్‌, 2017

యాంగ్రీ యంగ్‌మేన్ డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ అంటే ఒకానొక టైంలో యాక్ష‌న్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాల‌కు పెట్టింది పేరు. అలాంటి రాజ‌శేఖ‌ర్ 2007లో వ‌చ్చిన ఎవ‌డైతే నాకేంటి సినిమా త‌ర్వాత చేసిన సినిమాలు అన్ని ఘోరంగా ప్లాప్ అయ్యాయి. చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత రాజశేఖ‌ర్ న‌టించిన సినిమా పి ఎస్ వి గ‌రుడ‌వేగ‌. రాజ‌శేఖ‌ర్ కెరీర్‌లోనే రూ.30 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే పాజిటివ్ బ‌జ్ తెచ్చుకుంది. ప్ర‌వీణ్ సత్తార్ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌డం, స‌న్నీలియోన్ ఐటెం సాంగ్ చేయ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ :

గ‌రుడ‌వేగలో శేఖ‌ర్ (డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్‌) నేష‌న‌ల్ ఇంటిలిజెన్స్ ఆఫీస‌ర్‌గా ప‌ని చేస్తుంటాడు. శేఖ‌ర్ ఎప్పుడూ ఆఫీస్ పనులు, ఇన్వెస్ట్‌గేష‌న్ అంటూ బిజీబిజీగా ఉంటాడు. దీంతో త‌న‌ను అస్స‌లు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఫ్యామిలీ లైఫ్ లేద‌ని విసిగిపోయిన భార్య శేఖ‌ర్ నుంచి విడాకులు కోరుతుంది. భార్య డెసిష‌న్‌తో షాక్ అయిన శేఖ‌ర్ ఇక‌పై ఫ్యామిలీతో గ‌డుపుతాన‌ని ఆమెకు మాట ఇస్తాడు. ఈ స్టోరీ ఇలా ఉంటే ఓ కార్ యాక్సిడెంట్‌లో శేఖ‌ర్ ఓ ప్రొఫెష‌న‌ల్ స్నైప‌ర్‌తో గొడ‌వ ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఓ ముస‌లామె అనుమానాస్ప‌దంగా చ‌నిపోవ‌డంతో శేఖ‌ర్‌కు స్నైప‌ర్‌పై డౌట్ వ‌స్తుంది. స్నైప‌ర్‌ను ప‌ట్టుకోవాల‌ని అనుకునే టైంలో అత‌డు కూడా చ‌నిపోతాడు. ఈ హ‌త్య వెన‌క పెద్ద మిస్ట‌రీ ఉంద‌ని శేఖ‌ర్ తెలుసుకుంటాడు. తీగ లాగితే డొంక క‌దిలిన‌ట్టుగా ఈ కేసులో చాలా కొత్త విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి. అతి క్లిష్టమైన ఈ కేసుని శేఖర్ ఎలా సాల్వ్ చేశాడు అన్నదే గరుడ వేగ కథ‌.

న‌టీన‌టుల పెర్పామెన్స్ & TJ విశ్లేష‌ణ :

హీరో రాజశేఖర్ ఈ సినిమా కోసం ఎంత చేయాలో అంత చేశారు. రాజ‌శేఖ‌ర్ ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చేసిన సినిమాలు గుర్తుకు వ‌చ్చాయి. యాక్షన్ హీరోగా అప్పుడున్న ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా చేశారు. ఇంత యాక్షన్ ఉన్న సినిమాను ఓకే చేయ‌డ‌మే పెద్ద సాహ‌సం అనుకుంటే.. ఆ పాత్ర‌ను స‌క్సెస్‌గా చేయ‌డం మ‌రో ఛాలెంజ్‌. ఈ ఛాలెంజ్‌లో రాజశేఖ‌ర్ చాలా వ‌ర‌కు స‌క్సెస్ అయ్యాడు. ఇక హీరోయిన్ పూజా కుమార్ ఓ మిడిల్ ఏజ్డ్ హీరోయిన్‌గా క‌నిపించింది. ఆమె సినిమాకు కావాల్సిన గ్లామ‌ర్ తేలేక‌పోయింది. మెయిన్ విలన్ గా ఫీల్ కావాల్సిన కిషోర్ సెకండాఫ్‌లో ఎంటర్ అవుతాడు. కాని ఒక మెయిన్ విలన్‌ను ఎలివేట్ చేసే సీన్స్ ఒక్కటి కూడా లేక పోవడం వల్ల తన నటనకి స్కోప్ లేక పోయింది. పృథ్వి, ఆలీ కామెడీ పండించడానికి ట్రై చేసినా పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు.

కథ‌గా చూసినప్పుడు గరుడ వేగ వెరీ సింపుల్‌గానే ఉన్నా ద‌ర్శ‌కుడు క‌థ‌నంతో సినిమా స్థాయిని పెంచేశాడు. తాను చెప్పాల‌నుకున్న అంశాన్ని ఫస్ట్ షార్ట్ నుంచి చూపించాడు. డార్జీలింగ్‌లో తీసిన మొదటి యాక్షన్ ఎపిసోడ్ నుంచి ఫ‌స్టాఫ్ చివ‌ర్లో వ‌చ్చే చార్మినార్ ఎపిసోడ్ వ‌ర‌కు సినిమా రేసుగుర్రంలా ముందుకు వెళుతుంది. తెలుగు సినిమాల్లో యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఇలా కూడా తీస్తారా ? అన్నంత ఆశ్చ‌ర్యం క‌లిగేలా ద‌ర్శ‌కుడు క‌థ‌నాన్ని న‌డిపించాడు. ఇక సెకండాఫ్‌లో క‌థ సెంట్ర‌ల్ పాయింట్ ఎప్పుడైతే ప్రేక్ష‌కుల‌కు తెలిసిపోయిందో ? అప్ప‌టి నుంచి కథ‌నం స్లో అయిపోతుంది. అప్ప‌టిదాకా సినిమాను ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేసిన ప్రేక్ష‌కుడు మామూలు సినిమా చూస్తున్నామా అన్నంత నిరాశ‌కు గుర‌వుతాడు. అయితే మ‌ళ్లీ క్లైమాక్స్‌లో 20 నిమిషాలు మ‌ళ్లీ ప్రేక్ష‌కుడు థ్రిల్ అయ్యేలా చేశాడు ద‌ర్శ‌కుడు. యాక్షన్ ఎపిసోడ్స్ తీయడంలో ప్రవీణ్ టాలెంట్ సూపర్బ్.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే…

గ‌రుడ‌వేగ‌లో సినిమాటోగ్రఫీ సూప‌ర్బ్‌గా ఉంది. ఈ సినిమాకు ఐదుగురు సినిమాటోగ్రాఫర్లు ప‌నిచేశారు. దీంతో ఏ సీన్ ఎవ‌రు చేశారో మ‌న‌కైతే తెలియ‌దు. నిర్మాత ఎం.కోటేశ్వ‌ర‌రాజు రాజశేఖ‌ర్‌పై ఇంత భారీగా ఖ‌ర్చు చేయ‌డం నిజంగా ఆయ‌న డేరింగ్‌ను మెచ్చుకోవాల్సిందే. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను ఎలివేట్ చేసింది. సినిమాలో రెండు సాంగ్సే ఉన్నాయి. స‌న్నీలియోన్ సాంగ్ మాస్‌ను బాగా ఊపేస్తుంది. కాక‌రాల ధ‌ర్మేంద్ర చ‌క్క‌గా ఉంది. రాజ‌శేఖ‌ర్‌కు గ‌త 10-12 ఏళ్ల‌లో ఇది బెస్ట్ మూవీ.

ప్ర‌వీణ్ స‌త్తార్ డైరెక్ష‌న్ క‌ట్స్ :

ఈ సినిమా క‌థ‌, క‌థ‌నాల విష‌యానికి వ‌స్తే ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తార్‌పై హాలీవుడ్ సినిమాల ప్ర‌భావం ఎంత స్ట్రాంగ్‌గా ఉందో తెలుస్తుంది. తాను చెప్ప‌ద‌ల‌చుకున్న మెయిన్ పాయింట్‌ను ఎక్క‌డా డీవియేట్ కాకుండా, రొటీన్ ఫార్ములాలో లాగించ‌కుండా క‌థ‌నం న‌డిపించాడు. యాక్ష‌న్ సీక్వెల్స్‌ లాజిక్‌లు మిస్ కాకుండా ప‌ర్‌ఫెక్ట్‌గా రాసుకున్నాడు. స‌త్తార్ గ‌త సినిమాల‌కు ఈ సినిమాకు చాలా తేడా ఉంది. ఫ‌స్టాఫ్ క‌థ‌నం చాలా స్పీడ్ స్పీడ్‌గా ముందుకు వెళుతూ హై వోల్టేజ్‌తో ముగుస్తుంది. కానీ సెకండాఫ్‌ను అదే టెంపోతో కంటిన్యూ చేయ‌డంలో మాత్రం త‌డ‌బ‌డ్డాడు. ద‌ర్శ‌కుడు ప్ర‌తి సీన్ చాలా క్వాలిటీతో తీశాడు. ఈ సినిమాతో అత‌డికి మంచి ఆఫ‌ర్లు వ‌స్తాయ‌న‌డంలో డౌట్ లేదు.

ప్ల‌స్ పాయింట్స్ (+):

– స్పీడ్ ఫ‌స్టాఫ్‌

– దర్శకుడు

– క‌థ‌నం

– యాక్షన్ ఎపిసోడ్స్

– నిర్మాణ విలువలు

– స‌న్నీలియోన్ ఐటెం సాంగ్‌

– గ్రాండ్ విజువ‌ల్స్‌

మైన‌స్ పాయింట్స్ (-):

– సెకండాఫ్‌లో సాగ‌దీత స‌న్నివేశాలు

TJ ఫైన‌ల్ పంచ్ : థ్రిల్లింగ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌

TJ సూచ‌న: తెలుగు సినిమాల్లో ఓ మంచి ప్ర‌య‌త్నం… చూడాల్సిన సినిమా

TJ పి ఎస్ వి గ‌రుడ‌వేగ రేటింగ్‌: 3.25 / 5