రంగస్థలం TJ రివ్యూ

March 30, 2018 at 9:23 am
Rangasthalam, Rangasthalam Movie Review, Ramcharan, samantha, Sukumar

టైటిల్‌: ర‌ంగ‌స్థ‌లం
బ్యాన‌ర్‌: మైత్రీ మూవీ మేక‌ర్స్‌
జాన‌ర్‌: ఫ్యామిలీ అండ్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ డ్రామా
న‌టీన‌టులు: రామ్‌చ‌ర‌ణ్‌, స‌మంత‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు, ప్ర‌కాష్‌రాజ్ త‌దిత‌రులు
సాహిత్యం: చ‌ంద్ర‌బోస్‌
యాక్ష‌న్‌: రామ్ – ల‌క్ష్మ‌ణ్‌
సినిమాటోగ్ర‌ఫీ: ర‌త్న‌వేలు
మ్యూజిక్‌: దేవిశ్రీ ప్ర‌సాద్‌
ఎడిటింగ్‌: న‌వీన్ నూలి
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని – య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ – సీవీఎం మోహ‌న్‌
ద‌ర్శ‌క‌త్వం: సుకుమార్‌
సెన్సార్ రిపోర్ట్‌: U / A
ర‌న్ టైం: 179 . 03 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 30 మార్చి, 2018

మెగా ఫ్యాన్స్‌ సుదీర్ఘ ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పడబోతుంది. మెగా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు, సినీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘రంగస్థలం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి దాదాపు యేడాదిన్న‌ర అవుతోంది. 2016 ఎండింగ్‌లో వ‌చ్చిన ధృవ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాక మ‌ళ్లీ ఏ సినిమాలోనూ న‌టించ‌లేదు. ఇక ఎన్టీఆర్‌తో నాన్న‌కు ప్రేమ‌తో లాంటి క్లాస్ హిట్ తెర‌కెక్కించాక సుకుమార్ కూడా చాలా గ్యాప్ తీసుకుని రంగ‌స్థ‌లం సినిమా చేశాడు. 1985 కాలం నాటి గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా టీజ‌ర్లు, ట్రైల‌ర్లు, ప్రోమోలు, వీడియోలు ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి క్రియేట్ చేశాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1750 థియేట‌ర్ల‌లో భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్ష‌కుల భారీ అంచ‌నాలు ఎంత వ‌ర‌కు అందుకుందో ? TJ స‌మీక్ష‌లో చూద్దాం.

 స్టోరీ:
రంగ‌స్థ‌లం అనే ఊళ్లో ఫ‌ణీంద్ర భూప‌తి (జ‌గ‌ప‌తిబాబు) ప్రెసిడెంట్‌గా 30 ఏళ్లుగా ఏలుతుంటాడు. ఆ ఊళ్లో ప్ర‌జ‌ల అమాయ‌త్వాన్ని ఆస‌ర‌గా చేసుకుని సొసైటీ ప్రెసిడెంట్‌ను కూడా గుప్పిట్లో పెట్టుకుని ఇచ్చిన అప్పుల కంటే ఎక్కువ మొత్తం వ‌సూలు చేస్తుంటాడు. ఫ‌ణీంద్ర భూప‌తికి ఎదురు చెప్పేవాడు ఉండ‌డు.. అత‌డికి పోటీగా నామినేష‌న్ వేయాలంటేనే భ‌యం. ఈ టైంలో చెల్లుబోయిన చిట్టిబాబు (రామ్‌చ‌ర‌ణ్‌) ఊళ్లో ఇంజ‌నీర్‌గా పాపుల‌ర్‌. త‌న‌కున్న ఇంజిన్‌తో అంద‌రి పొలాల‌కు నీళ్లు పెడుతుంటాడు. చిట్టిబాబు అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) దుబాయ్ నుంచి ఊరికి వ‌స్తాడు. అక్క‌డ ఫ‌ణీంద్ర భూప‌తి ఆగ‌డాల‌ను ప్ర‌శ్నిస్తాడు. చివ‌ర‌కు అత‌డి మీదే ప్రెసిడెంట్‌గా పోటీ చేసేందుకు నామినేష‌న్ వేస్తాడు.

ఈ స్టోరీ ఇలా ఉంటే చిట్టిబాబు అదే ఊరికి చెందిన రామ‌ల‌క్ష్మి (స‌మంత‌)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. చిట్టిబాబుకు చెవిటి వాడు కావ‌డంతో ఏ మాట అయినా గ‌ట్టిగా చెపితే కాని అర్థం కాదు. ఒక‌టికి రెండుసార్లు చెప్పాల్సిందే. ఫ‌ణీంద్ర భూప‌తి ఉషోద‌య పార్టీకి పోటీగా చిట్టిబాబు, కుమార్‌బాబు క‌లిసి న‌వ‌భారత్ పార్టీతో పోటీకి రెడీ అవుతారు. వీరికి ఎమ్మెల్యే ప్ర‌కాష్‌రాజ్ అండ‌గా ఉంటాడు. ప్ర‌కాష్‌రాజ్ కుతూరుతో కుమార్‌బాబు ప్రేమ‌లో ఉంటాడు. ఎన్నిక‌ల ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌గా కుమార్‌బాబు హ‌త్య‌కు గుర‌వుతాడు ? కుమార్‌బాబు చ‌నిపోతూ త‌మ్ముడు చిట్టిబాబుకు చెప్పిన భ‌యంక‌ర‌మైన నిజం ఏంటి ? చెవిటి వాడు అయిన చిట్టిబాబు ఆ నిజాన్ని ఎలా గ్ర‌హించాడు ? అన్న హ‌త్య వెన‌క ఎవ్వ‌రూ ఊహించ‌ని వ్య‌క్తి ఎవ‌రు ? చివ‌ర‌కు ఈ రంగ‌స్థ‌లం ప్రెసిడెంట్‌గా ఎవ‌రు గెలిచారు ? ఈ క‌థ ఎలా ఎండ్ అయ్యింది ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

 క‌థ‌నం – విశ్లేష‌ణ :
ఈ సినిమా క‌థ మ‌నం ఎప్ప‌టి నుంచో ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాల్లో 1960వ ద‌శ‌కం నుంచి చూస్తూనే ఉన్నాం. ఒక ఊళ్లో ప్రెసిడెంట్ అరాచ‌కాలు.. ఎవ్వ‌రూ పోటీ చేసేందుకే ముందుకు రారు. ఆ టైంలో వాళ్ల‌ను ఎదిరించి ఓ వ్య‌క్తి నామినేష‌న్ వేయ‌డం.. అత‌డికి హీరో స‌పోర్ట్ చేయ‌డం.. చివ‌ర‌కు ఆ ప్రెసిడెంట్ ఎదురు తిరిగిన వాళ్ల‌ను చంపించ‌డం… చివ‌ర‌కు హీరో అత‌డి అరాచ‌కాల‌కు చెక్ పెట్ట‌డం. ఇదే క‌థ రంగ‌స్థ‌లంలోనూ ఉంది. తెలుగు సినిమాకు ఈ క‌థ‌, క‌థ‌నాలు కొత్తేం కాదు. అయితే పాత క‌థ‌ను, అంద‌రికి తెలిసిన క‌థ‌ను చెప్పేట‌ప్పుడు కొత్త‌గా చెప్పాలి. రంగ‌స్థ‌లం విష‌యంలో సుకుమార్ క్యారెక్ట‌ర్ల ఎలివేష‌న్ మీద పెట్టిన దృష్టి క‌థ‌, క‌థ‌నాల మీద మాత్రం అంత‌గా పెట్టిన‌ట్టు అనిపించ‌లేదు.

సుకుమార్ సినిమాల క‌థ‌, క‌న్‌ఫ్యూజ‌న్‌, నెరేష‌న్ విష‌యంలో గ‌త సినిమాలు అయిన వ‌న్‌, నాన్న‌కుప్రేమ‌తో సినిమాల్లోనూ ఉన్నాయి. అయితే ఆ రెండు సినిమాల్లో ఓ ఫీల్ తీసుకురావ‌డంలో మాత్రం తిరుగులేని స‌క్సెస్ అయ్యాడు. దీంతో వ‌న్ సినిమా విష‌యంలో రిజల్ట్‌తో సంబంధం లేకుండా సుకుమార్‌కు మంచి మార్కులే ప‌డ్డాయి. నాన్న‌కుప్రేమ‌తో కూడా ఫీలింగ్ ప‌రంగా మంచి అనుభూతి ఇచ్చింది. అయితే రంగ‌స్థ‌లంలో మాత్రం అదే మిస్ అయ్యింది. కీల‌క స‌మ‌యాల్లో ఎమోష‌న‌ల్ సీన్లు ప్రేక్ష‌కుడిని ఆ అనుభూతికి గురి చేయ‌డంలో అంత‌గా స‌క్సెస్ కాలేదు.

సినిమా ఫ‌స్టాఫ్‌లో అన్ని క్యారెక్ట‌ర్ల‌ను రివీల్ చేసేందుకు బ‌ల‌మైన సీన్లు రాసుకున్న సుక్కు వాటిని తెర‌పై బాగా చూపించారు. వినికిడి లోపం ఉన్న వ్య‌క్తిగా చెర్రీ యాక్టింగ్ ఎక్స్‌లెంట్‌. చెర్రీ – స‌మంత మ‌ధ్య ఫ‌స్టాఫ్‌లో వ‌చ్చే ప్రేమ సీన్లు, రంగ‌మ్మ‌త్త‌గా అన‌సూయ‌తో చెర్రీ చిలిపిచేష్ట‌లు హైలెట్‌. ఫ‌స్టాఫ్లో చాలా సీన్లు ట్రిమ్ చేయాల్సి ఉంది. బోరింగ్‌కు స్కోప్ ఉన్నా ప్రేక్ష‌కుల చేత విజిల్స్ వేయించే సీన్లు ఉండ‌డంతో ప్రేక్ష‌కుడికి ఆస‌క్తి బాగానే ఉంటుంది.

కీల‌క‌మైన సెకండాఫ్‌లో చాలా ల్యాగ్ అయ్యింది. క‌థ‌లో కీల‌క‌మైన స‌న్నివేశాల వ‌ద్ద ప‌ట్టు త‌ప్పాడు. ఇంట‌ర్వెల్‌తో కాస్త ట్రాక్‌లోకి వ‌చ్చిన సినిమా సెకండాఫ్‌లో కొన్ని చోట్ల ఎటు పోతుందో కూడా అర్థంకాని ప‌రిస్థితి. ప్రెసిడెంట్‌గా జ‌గ‌ప‌తిబాబు అరాచ‌కాలు ఫ‌స్టాఫ్లో స్ట్రాంగ్‌గా చూపించారు. సెకండాఫ్‌లో అదే జ‌గ‌ప‌తిబాబు క్యారెక్ట‌ర్‌కు హీరోకు మ‌ధ్య బ‌ల‌మైన వార్ స‌న్నివేశాలు లేవు. ఎన్నిక‌ల సీన్లంటూ ప‌దే ప‌దే అక్క‌డే క‌థ‌ను తిప్పేశారు. ఇక్క‌డ వీళ్లు జ‌గ‌ప‌తిబాబును ఢీ కొట్టే స‌న్నివేశాలే క‌న‌ప‌డ‌వు. చివ‌ర్లో మెయిన్ విల‌న్ విష‌యంలో ట్విస్ట్ ఇచ్చినా అప్ప‌టికే క‌థ, క‌థ‌నాలు ఎటోపోయి… ఎటెటో తిరిగి చివ‌ర‌కు క్లైమాక్స్‌కు వ‌చ్చిన‌ట్లు ఉంటుంది. అయితే సుకుమార్ నాటి వాతావ‌ర‌ణం తెర‌పై చూపించ‌డంలోనూ, క్యారెక్ట‌ర్ల‌ను తిరుగులేని విధంగా ప్ర‌జెంట్ చేయ‌డంలో మాత్రం స‌క్సెస్ అయ్యాడు.

 టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్ :
టెక్నిక‌ల్‌గా పాట‌లు ముందే హిట్ అయ్యాయి. ఆర్ ఆర్ కొన్ని చోట్ల ముఖ్యంగా గ్రామీణ నేప‌థ్యంలో సీన్ల విష‌యంలో అక్క‌డ‌క్క‌డా మెరిసినా ఓవ‌రాల్‌గా మాత్రం మ‌న‌స్సును ట‌చ్ చేయ‌లేదు. దేవిశ్రీ మెరుపులు త‌గ్గాయ్‌. సినిమాలో ఆర్ట్ వ‌ర్క్‌కు మాత్రం 100కు 200 మార్కులు వేయాలి. నాటి గ్రామీణ వాతావ‌ర‌ణాన్ని అచ్చుగుద్దిన‌ట్టు ప్ర‌తిబింబించేందుకు ఆర్ట్ టీం చాలా క‌ష్ట‌ప‌డింది. ఒక‌టి రెండు చోట్ల ఈనాటి పోస్ట‌ర్లు క‌న‌ప‌డినా ఓవ‌ర్‌లుక్‌లో మిస్ అయ్యాయ‌నుకోవాల్సిందే. సినిమా మేజ‌ర్ హైలెట్ల‌లో ఇదే ఫ‌స్ట్‌. ఇక ఏకంగా 179 నిమిషాలు ఉన్న ర‌న్ టైం సినిమాకు భారంగా మారింది. అస‌లే స్లో నెరేష‌న్ అనుకుంటే ర‌న్ టైం మ‌రింత త‌ల‌నొప్పిగా మారి చాలా బోరింగ్ సీన్లు, క‌థ‌కు సంబంధం లేని సీన్ల‌తో ప్రేక్ష‌కుడి స‌హ‌నానికి ప‌రీక్ష‌గా మారింది.

ఇక ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ అదిరిపోయింది. ఆర్ట్ వ‌ర్క్‌ను, ఆ నాటి కాలాన్ని తెర‌పై చ‌క్క‌గా చూపించారు. తెర‌మీద నాటి వాతావ‌ర‌ణంలో ప్ర‌తి విష‌యాన్ని కూలంక‌షంగా చూపించ‌డం మెచ్చుకోవాలి. రామ్‌-ల‌క్ష్మ‌ణ్ ఫైట్స్ కూడా సినిమాకు, ఆ మూడ్‌కు త‌గిన‌ట్టుగా ఉన్నాయి. ఇక మైత్రీ మూవీస్ వీరు సినిమాకు త‌గిన‌ట్టుగా రాజీ లేకుండా ఖ‌ర్చు చేశారు.

 సుకుమార్ డైరెక్ష‌న్ క‌ట్స్ :
1980 నాటి క‌థ అని సుకుమార్ చెప్పినా ఇది స్వాతంత్య్రం ఆ త‌ర్వాత మ‌న‌దేశంలో ఎన్నో గ్రామాల్లో జ‌రిగిన క‌థ‌. ఈ క‌థ‌తో ఎన్నో సినిమాలు చూస్తున్నాం. మెయిన్‌గా సుకుమార్ దీనిని క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా బ‌ల‌మైన సినిమాగా క‌న్నా క్యారెక్ట‌ర్ల సినిమాగా మార్చేశాడు. దీంతో క్యారెక్ట‌ర్లు ఎలివేట్ అయ్యి క‌థ‌, క‌థ‌నాలు కింద‌కు ప‌డ్డాయ్‌. త‌నుకున్న అభిరుచి నేప‌థ్యంలో సినిమాను డిఫ‌రెంట్‌గా తెర‌కెక్కించేందుకు ప్ర‌య‌త్నించాడు. హీరోయిజం ఎలివేట్ లేదు. ఇక జ‌గ‌ప‌తిబాబును మ‌రింత‌గా వాడుకోవాల్సి ఉంది. వ‌న్ సినిమా ప్లాప్ అయినా మ‌హేష్ కెరీర్‌లో ఓ వైవిధ్య‌మైన సినిమాగా ప్ర‌శంస‌లు అందుకుంది. ఇక క‌మ‌ర్షియ‌ల్ లెక్క‌లు కాసేపు ప‌క్క‌న పెడితే రంగ‌స్థ‌లం ఆ రేంజ్‌లో అయినా ఉందా ? అంటే ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ ఆలోచించుకోవాల్సిందే.

 ప్ల‌స్ పాయింట్స్ (+):
– చెర్రీ, స‌మంతకు జీవితంలో మ‌ర్చిపోలేని క్యారెక్ట‌ర్లు
– ఆర్ట్ వ‌ర్క్‌
– సినిమాటోగ్ర‌ఫీ
– నిర్మాణ విలువ‌లు
– ఫ‌స్టాఫ్‌లో కొన్ని సీన్లు

 మైన‌స్ పాయింట్స్ (-) :
– స్లో నెరేష‌న్‌
– పాత ఫార్మాట్ క‌థ‌
– ఎడిటింగ్‌… లెన్దీ సీన్లు
– చాలా చోట్ల క‌నెక్ట్ కాని నేప‌థ్య సంగీతం
– క్యారెక్ట‌ర్ల ఎలివేష‌న్ మీద పెట్టిన దృష్టి క‌థ‌, క‌థ‌నాలు మీద అస్స‌లు లేక‌పోవ‌డం
– సెకండాఫ్ తేలిపోవ‌డం

ఫైన‌ల్ పంచ్ : 1950 క‌థ‌కు 1980 పేరుపెట్టి తీసిన పాత‌స్థ‌లం

సూచ‌న్‌: పాత పాత క‌థ‌ను చెర్రీ -స‌మంత ఈ త‌రం న‌టుల‌తో చూడాల‌నుకునే వారికి

రంగ‌స్థ‌లం TJ రేటింగ్‌: 2.5 / 5

రంగస్థలం TJ రివ్యూ
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share