‘RX 100’ రివ్యూ రేటింగ్

July 12, 2018 at 10:20 am
RX 100, Review Rating, Kartikeya , Payal Rajput, Rao Ramesh

నిర్మాణ సంస్థ‌: కె.సి.డ‌బ్ల్యు
న‌టీన‌టులు: కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌, రావు ర‌మేశ్‌, రాంకీ, గిరిధ‌ర్‌, ల‌క్ష్మ‌ణ్‌, త‌దిత‌రులు
సంగీతం: చైత‌న్ భ‌రద్వాజ్‌
క‌ళ‌: ర‌ఘు కుల‌క‌ర్ణి
కూర్పు: ప‌్రవీణ్ కె.ఎల్‌
చాయాగ్ర‌హ‌ణం: రామ్‌
నిర్మాత‌: అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ‌
ద‌ర్శ‌క‌త్వం: అజ‌య్ భూప‌తి

టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు, విభిన్నమైన కథాంశంతో రూపొందే చిత్రాలకు ప్రేక్షకుల విశేష ఆదరణ లభించిన దాఖలాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగానే ఉన్నాయి. పెద్ద హీరో, భారీ బడ్జెట్ చిత్రాలనే తేడా లేకుండా కంటెంట్ ఉండే సినిమాల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అందుకు సాక్ష్యంగా పెళ్లిచూపులు, మెంటల్ మదిలో, అర్జున్ రెడ్డి చిత్రాలు సాక్ష్యంగా నిలిచాయి. ఇలాంటి నేపథ్యంలో వచ్చిన సినిమా `ఆర్ ఎక్స్ 100`. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో, హీరోయిన్లుగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. కొత్త న‌టీనటుల‌తో రూపొంది.. ట్రైల‌ర్ నుండి మంచి అంచ‌నాలు అందుకుంటూ వచ్చింది.

కథ :
ఆత్రేయ పురంలో శివ‌(కార్తికేయ‌).. ఇందు(పాయ‌ల్ రాజ్‌పుత్‌) ప్రేమ‌లో ప‌డి ఆమె కోసం ఎదురుచూస్తుంటాడు.
శివ‌ను పెంచి పెద్ద చేసిన డాడీ(రాంకీ).. త‌న గురించి బాధప‌డుతూ ఉంటాడు. అమాయకంగా ఉండే శివను విశ్వనాథం కూతురు ఇందు (పాయల్ రాజ్‌పుత్) ప్రేమలోకి దింపుతుంది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన శివ ఆమె ప్రపంచంగా జీవిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోతుంది.ఇందూకు పెళ్లి అయిందని తెలిసినా ఆమె జ్హాపకాల్లోనే ఎందుకు బతికాడు. ఇందు కోసం మూడేళ్లు ఎదురు చూసిన శివకు ఆమె ప్రేమ దక్కిందా? ఇష్టంగా ప్రేమించిన శివను ఇందు ఎందుకు దూరం చేసుకొన్నది? చివర్లో ఊహించని విధంగా ఇందు గురించి శివ ఓ విషయాన్ని తెలుసుకుంటాడు..ఏంటా విషయం అస‌లు స‌మ‌స్య ఏమిటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే…

విశ్లేష‌ణ‌:
శివ దూకుడు తనంతో ఉండే క్యారెక్టర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయడంతో ఆర్ఎక్స్ 100 చిత్ర కథ మొదలవుతుంది. శివ ఆవేశాన్ని డాడీ కంట్రోల్ చేయడం, అలాగే విశ్వనాథం ఎన్నికల్లో గెలుపొందడం లాంటి అంశాలను పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికి చక్కగా ఉపయోగించుకొన్నాడు. చాలా సౌమ్యంగా ఉండే శివ అగ్రెసివ్‌గా మారడానికి గల కారణాలను ఫ్యాష్ బ్యాక్‌తో మొదలుపెడుతాడు. ప్రేమ‌లో త‌ల్లిదండ్రులు, ప్రేమికుడు మోసం చేయ‌డ‌మే కాదు.. ప్రేమికురాలి మోసం కూడా ఉంటుంద‌నే పాయింట్ బాగానే ఉంది.

ఈ పాయింట్‌ను తెలుగు సినిమాల్లో పాక్షికంగా చూపించినా.. మెయిన్ పాయింట్‌గా పెట్టి సినిమాను డ్రైవ్ చేశాడు ద‌ర్శ‌కుడు. అయితే చివ‌రి ప‌దిహేను నిమిషాల కోసం మొత్తం క‌థ‌ను రాసుకున్న‌ట్లు అనిపిస్తుంది. నెటివిటీని ఎక్క‌డా క‌మ‌ర్షియ‌ల్‌గా చూపెట్టే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. హీరోయిన్ పాయల్ చ‌క్క‌గా నటించడమే కాదు చాలా బోల్డ్ గా కనిపించింది. సినిమా ఆసాంతం ఏదో మిస్ అయిన ఫీలింగ్ ప్రేక్ష‌కుడికి వ‌చ్చేస్తుంది. అది సినిమా చూసే ప్రేక్ష‌కుడికి ఇబ్బందిగా అనిపిస్తుంది. సినిమాలో రెండు మూడు లిప్ లాక్ సీన్లు పెట్టి ప్రేక్షకులను రప్పించే రోజులుపోయాయి. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ అందించిన నేప‌థ్య సంగీతం స‌న్నివేశాల‌ను ఎలివేట్ చేయ‌లేదు. సినిమా రెండున్న‌ర గంట‌లు ఉంది. ఎడిట‌ర్ ప్ర‌వీణ్ క‌త్తెర‌కు ప‌ని చెప్పి ఉంటే బావుండేద‌నిపించింది. రామ్ సినిమాటోగ్ర‌ఫీ ఓకే.

నటీ నటులు :
ఈ సినిమాలో దర్శకుడు, హీరో, హీరోయిన్లు కొత్త వారే. వారిపై పెద్దగా ఎక్స్ పెక్టేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేకున్నా..హీరో కార్తికేయ‌, హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్ చ‌క్క‌గా న‌టించారు. ప్రేమికుడ్ని మోసం చేయాల‌నుకునే ప్రేయ‌సిగా పాయల్ న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. మొదట అమాయకంగా ఉన్నా..తర్వాత రెబల్ గా మారిన పాత్రలో కార్తికేయ చాలాబాగా నటించాడు. హీరోయిన్ పాయల్ కొత్త సినిమా అయినా రొమాంటిక్, హాట్ సీన్లతో మత్తెక్కించింది. వు ర‌మేశ్ పాత్ర బావుంది. డాడీ పాత్ర‌లో న‌టించిన రాంకీ పాత్ర‌ను ఇంకాస్త ఎలివేట్ చేసుండొచ్చు అనిపించింది. సినిమా అంతా నాలుగు పాత్ర‌ల చుట్టూనే ఎక్కువ‌గా తిరిగింది. ఇక ల‌క్ష్మ‌ణ్.. అడ‌పా ద‌డ‌పా రెండు, మూడు పాత్ర‌లు క‌నిపించాయి. సినిమాలో కామెడీ పార్ట్ లేదు.

ప్లస్ పాయింట్స్ : కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్ యాక్టింగ్, అజయ్ భూపతి టేకింగ్, వైవిధ్యమైన కథ

మైనస్ పాయింట్స్ : ఫస్టాఫ్‌లో స్లో నేరేషన్, మితి మీరిన రొమాన్స్

బాటం లైన్ : `ఆర్ ఎక్స్ 100` …గాలి పోయింది

రేటింగ్ : 2/5

‘RX 100’ రివ్యూ రేటింగ్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share