ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ TJ రివ్యూ

టైటిల్‌: ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ

జాన‌ర్‌: ఎమోష‌న‌ల్ ల‌వ్‌+ఫ్రెండ్‌షిఫ్ డ్రామా

న‌టీనటులు: రామ్, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి, శ్రీవిష్ణు

సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి

మ్యూజిక్ : దేవిశ్రీ ప్రసాద్

ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్

నిర్మాతలు: స్రవంతి రవికిషోర్, కృష్ణ చైతన్య

దర్శకత్వం: కిషోర్ తిరుమల

రిలీజ్ డేట్‌: 27 అక్టోబ‌ర్, 2017

నేను శైలజ తో హిట్ కొట్టిన హీరో రామ్, దర్శకుడు తిరుమల కిషోర్ తాజాగా ఉన్న‌ది ఒక్కటే జింద‌గీ సినిమాతో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. హైప‌ర్ త‌ర్వాత రామ్ న‌టించిన ఈ సినిమా మంచి పాజిటివ్ బ‌జ్‌తో థియేట‌ర్ల‌లోకి దిగింది. రామ్ స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాఠి, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా ఎలా ఉందో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

TJ స్టోరీ :

జీవితంలో నిల‌క‌డ ఉన్న వ్య‌క్తి అభిరాం (రామ్‌). జీవితంలో క‌ష్టాలు వ‌చ్చినా సుఖాలు వ‌చ్చినా ఒకేలా తీసుకోవాలనుకునే వ్య‌క్తి. ప్రతి మనిషి జీవితాన్ని విశేషంగా ప్రభావితం చేసే స్నేహం, ప్రేమ అభి జీవితంలో కూడా ప‌లు ర‌కాలుగా ట‌ర్న్ చేస్తాయి. అభిరాంకు వాసు (శ్రీవిష్ణు) అంటే ప్రాణం. వాసు కోసం అభి ఏదైనా చేస్తాడు. సాఫీగా సాగుతోన్న వారి లైఫ్‌లోకి ఓ ప్రమాదం కారణంగా మహా (అనుపమా పరమేశ్వరన్) అనే అమ్మాయి ప్ర‌వేశిస్తుంది. తర్వాత వారిద్దరు ఒక‌రినొకరు ఇష్ట‌ప‌డ‌తారు. ఇంత‌లో ట్విస్ట్ ఏంటంటే అభి బెస్ట్ ఫ్రెండ్‌ వాసు కూడా మహాను ఇష్టపడుతున్న విషయం అభికి తెలుస్తుంది. మన మధ్య ఈగోలు రాకూడదన్న ఒప్పందంతో అభి, వాసులు ఒకేసారి మహాకు ప్రపోజ్ చేస్తారు. కానీ మహా మాత్రం వాసుకే ఓకె చెపుతుంది. ఆ త‌ర్వాత వాసు – అభి మ‌ధ్య గ్యాప్‌తో అభి దూరంగా వెళ్లిపోతాడు. అభి అలా దూరంగా వెళ్ల‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఏంటి ? వీరి మ‌ధ్య‌లో వెడ్డింగ్ ప్లానర్ మేఘన (లావణ్య త్రిపాఠి)కి సంబంధం ఏంటి..? వాసు-అభి తిరిగి ఒక్క‌ట‌య్యారా ? లేదా ? అన్న‌దే క‌థ‌.

TJ విశ్లేష‌ణ :

మ‌న జీవితం చాలా స్పీడ్‌గా ముందుకు వెళ్లిపోతున్న‌ట్టు ఉంటుంది. జీవితం అంతా ఓ స్పీడ్‌లో వెళితే య‌వ్వ‌నం మాత్రం ఫాస్ట్ ఫార్వర్డ్ లో పరిగెత్తుతుంది. ఓ కలలా ఇలా వచ్చి అలా వెళ్లే ఆ కాలాన్ని స్లో మోషన్ లో చూపించే ఈ సినిమాలో చూపించాడు ద‌ర్శ‌కుడు తిరుమ‌ల కిషోర్‌. నిజంగా ఇది చిత్రమైన థాట్. మన మిగిలిన జీవితానికి సరిపడా ఆలోచనలు, అనుభూతులు ఆ కాలేజీ రోజుల్లోనే దొరుకుతాయి. ప్రేమ, స్నేహం, బ్రేక్ అప్ ఇలా అన్నిటిని ఒకే కథలో ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా ఇమిర్చాడు. మ‌నం కాలేజ్ రోజుల్లో ఏ ప‌ని చేసినా, అది మంచి, చెడు ఏది అయినా చాలా ఇష్టంతో చేసిన‌ట్టుగా ఉంటుంది. తిరుమ‌ల కిషోర్ ఓ మంచి క‌థ‌తో ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ సినిమా చేసినా అందులో ఎంతో పెద్ద లెస‌న్ ఉన్న ఓ జీవితం క‌న‌ప‌డింది. ద‌ర్శ‌కుడిగా మ‌నోడు ఈ సినిమాతో మ‌రో ముట్టు ఖ‌చ్చితంగా ఎక్కిన‌ట్టే.

న‌టీనటుల గురించి చెప్పాలంటే హీరో, హీరోయిన్లు రామ్, అనుపమ పరమేశ్వరన్, శ్రీవిష్ణు, లావణ్య త్రిపాఠి కొన్నాళ్ల పాటు మనతో వస్తారు. మనసులో తిష్ట వేస్తారు. రామ్ త‌న పాత సినిమాల్లో ఓవ‌ర్‌యాక్ష‌న్ మార్క్‌కు చెక్ పెట్టి మంచి పెర్పామెన్స్‌తో మెప్పించాడు. ఎమోష‌న‌ల్ సీన్ల‌లో రామ్ న‌ట‌న కంట‌తడి పెట్టించింది. వాసు బెస్ట్ ఫ్రెండ్ పాత్ర‌లో ఒదిగిపోయాడు. స్నేహానికి, ప్రేమ‌కు దూర‌మైతే ఎలా ఉంటుందో ప‌డే బాధ‌ను ప్లే చేసే రోల్‌లో అత‌డు చ‌క్క‌గా ఒదిగిపోయాడు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మ‌హా పాత్ర‌లో క‌ళ్ల‌తో భావాలు ప‌లికిస్తూ చ‌క్క‌గా న‌టించింది. ద్వితియార్థంలో బ‌బ్లీ బ‌బ్లీగా లావ‌ణ్య త్రిపాఠి చ‌క్క‌గా అల‌రించింది. ఆమె గ్లామ‌ర్ షోకు మంచి మార్కులు ప‌డతాయి. మిగిలిన వాళ్లు త‌మ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించారు.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే….

సినిమాలో టెక్నిక‌ల్ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాల్సి వ‌స్తే ఎప్పటిలాగానే సోల్ వున్న ఈ సినిమాకి దేవిశ్రీ సంగీతం ప్రాణం పోసింది. సినిమా రిలీజ్‌కు ముందు సూపర్ హిట్ అయిన వాట్ అమ్మా, ట్రెండ్ మారిన పాటలు వెండితెర మీద మరింత అందంగా ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్ కు దేవీ ఇచ్చిన ఆర్ ఆర్ అదిరింది. సినిమాటోగ్ర‌ఫీ బ్యూటీఫుల్‌గా ఉంది. పాట‌లు చిత్రీక‌రించిన విధానం బాగుంది. ఎడిటింగ్ విష‌యంలో క‌త్తెర‌కు సెకండాఫ్‌లో మ‌రి కాస్త ప‌ని చెప్పాల్సి ఉంది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

తిరుమ‌ల కిషోర్ డైరెక్ష‌న్ క‌ట్స్‌:

నేను శైలజ సినిమాతో రామ్ కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు కిశోర్ తిరుమల మరోసారి అంతే క‌సితో ఈ సినిమాను తెర‌కెక్కించాడు. ఎలాగైనా రామ్‌కు హిట్ అవ్వాల‌న్న బాధ్య‌త‌ను తీసుకున్న కిషోర్ ఈ సారి కొత్త కాన్సెఫ్ట్‌తో ఉన్నది ఒకటే జిందగీ సినిమాను తెరకెక్కించాడు. ల‌వ్ + ఫ్రెండ్‌షిఫ్‌ను ఎమోష‌న‌ల్‌గా మిక్స్ చేసి కిషోర్ క‌థ‌ను ప్ర‌జెంట్ చేయ‌డంలో బాగా స‌క్సెస్ అయ్యాడు. అత‌ను క‌థ‌కు అనుగుణంగా రాసుకున్న మాట‌లు హార్ట్ ట‌చ్చింగా ఉన్నాయి. క్లైమాక్స్ లో కిశోర్ టాలెంట్ సూపర్బ్ అనిపిస్తుంది. ఇక మైన‌స్‌ల విష‌యానికి వ‌స్తే క‌థ‌నం స్లో అవ్వ‌డం, ఇంట‌ర్వెల్ వ‌ర‌కు ట్విస్టులు లేకుండా స‌ర‌దా స‌న్నివేశాల‌తో న‌డ‌ప‌డం కాస్త మైన‌స్‌. అయితే క్లైమాక్స్ ట్విస్ట్ తో అన్ని మరిచిపోయేలా అందమైన ముగింపునిచ్చి అలరించాడు దర్శకుడు. ఓవ‌రాల్‌గా రామ్‌కు మ‌రో హిట్ ఇచ్చాడు. ఇక క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ సినిమా విజ‌యం సాధించేలా చేసుకోవ‌డం రామ్‌దే.

ప్లస్ పాయింట్స్ (+):

– మెయిన్ స్టోరీ

– రామ్ – అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌

– మ‌న‌స్సును క‌దిలించే మాట‌లు

– దేవిశ్రీ మ్యూజిక్‌

– ద‌ర్శ‌క‌త్వం

మైనస్ పాయింట్స్ (-) :

– సెకండాఫ్‌లో సాగ‌దీత స‌న్నివేశాలు

– స్లో నెరేష‌న్‌

ఫైన‌ల్‌గా…

రామ్ – తిరుమ‌ల రిపీట్ హిట్ హిస్ట‌రీ

TJ ఫైన‌ల్ పంచ్‌: జీవితానికి ఈ జింద‌గీ అవ‌స‌ర‌మే

TJ సూచ‌న‌: వాచ్ అండ్ ఎంజాయ్ జింద‌గీ

TJ ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ మూవీ రేటింగ్‌: 2.75 / 5