ఇక్క‌డ ప‌వ‌న్‌.. అక్క‌డ ర‌జ‌నీ.. అజెండా ఒక్క‌టే!!

ప‌వ‌న్‌.. ర‌జ‌నీ.. ఇప్పుడు పొలిటిక‌ల్‌గా వీరి పేర్లు మార్మోగుతున్నాయి. తెలుగు నాట ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికే జ‌న‌సేన పార్టీని స్థాపించ‌డంతోపాటు 2019లో ప్ర‌జాక్షేత్రంలో అడుగు పెడ‌తాన‌ని చెప్పాడు. అంతేకాదు, తాను, త‌న పార్టీ పుట్టింది ప్ర‌శ్నించ‌డానికేన‌ని వెల్ల‌డించాడు. ఇక‌, త‌మిళ‌నాట‌.. సూప‌ర్ స్టార్ ర‌జనీ కూడా పొలిటిక‌ల్ ఫీల్డ్‌లోకి అడుగు పెడుతున్నారు. అయితే, వీరిద్ద‌రి గురించి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టింగ్‌లు వ‌స్తున్నాయి. అలాగే వేల‌ల్లో కామెంట్లు కూడా కురుస్తున్నాయి.

నిజానికి వీరిద్ద‌రూ భాష‌ల ప‌రంగా రెండు రాష్ట్రాల‌కు చెందిన వారైన‌ప్ప‌టికీ.. పొలిటిక‌ల్‌గా చూస్తే.. వీరి మ‌ధ్య అనేక కామ‌న్ అంశాలు క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా త‌మ త‌మ ప్రాంతాల‌కు, ప్ర‌జ‌ల‌కు వీరు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ప‌వ‌న్ విష‌యంలో ఈ విష‌యం స్ప‌ష్టం. పార్టీ ప్రారంభం నుంచి నేటి వ‌ర‌కు ఉత్త‌రాది వారు.. ద‌క్షిణాది వారిని పూర్తిగా అణిచి వేస్తున్నార‌ని ప‌వ‌న్ ఆరోపించారు.

కాబ‌ట్టి.. మ‌నం అంద‌రం ఏక‌మై.. ఢిల్లీపై దండెత్తాలని పిలుపు నిచ్చారు. అదేస‌మ‌యంలో రాష్ట్రానికి అన్యాయం జ‌రిగితే ఊరుకునేది కూడా లేద‌ని స్ప‌ష్టం చేశారు. ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం ఆగ‌ద‌ని నిల‌దీశారు. ఇక త‌మిళ‌నాడులో ర‌జ‌నీ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న కూడా ప్రాంతీయ వాదానికే మొగ్గు చూపారు. తాను స్వ‌చ్ఛ‌మైన త‌మిళుడిన‌ని, కాదంటే.. రాష్ట్రం వ‌దిలి.. హిమాల‌యాల‌కు వెళ్లిపోతాన‌ని చెప్పి.. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో చోటు సంపాయించారు.

అదేస‌మ‌యంలో ఇద్ద‌రూ ప్ర‌జ‌లకు చేరువ అయ్యేందుకు త‌మ ఆలోచ‌నా స‌ర‌ళిని వారితో పంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వ్య‌క్తిత్వం ప‌రంగా చూసినా.. ప‌వ‌న్‌, ర‌జ‌నీలు చాలా సింపుల్‌గా ఉంటారు. రూ.కోట్లు సంపాయించినా.. తమ ఆహార్యం సామాన్య మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్య‌క్తికి స‌మానంగా ఉండ‌డంతో మాస్ జ‌నాల్లో తేలిక‌గా క‌లిసిపోతున్నారు. ఇక‌, ఇద్ద‌రి అజెండా కూడా సామాన్య జ‌నాలే.. సో.. ఇప్ప‌టికే పార్టీ పెట్టిన జ‌న‌సేనాని, త్వ‌ర‌లోనే పార్టీ పెడ‌తార‌ని భావిస్తున్న ర‌జ‌నీకి పొలిటిక‌ల్ అజెండాలో అనేక కామ‌న్ ఫీచ‌ర్లుండ‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం. మ‌రి ఫ్యూచ‌ర్‌లో ఏం జ‌రుగుతుందో చూడాలి.