కాంగ్రెస్‌లోకి 7 గురు మంత్రులు… 15  మంది ఎమ్మెల్యేలు

ఈ హెడ్డింగ్ చూడ‌డానికే పెద్ద షాకింగ్‌గా ఉంటుంది. తెలంగాణ‌లో వ‌రుస విజయాల‌తో దూసుకుపోతూ 2019 ఎన్నిక‌ల‌ను టార్గెట్ చేస్తోన్న అధికార టీఆర్ఎస్ మంత్రులు కాంగ్రెస్‌లోకి ఎలా వెళ‌తారా అన్న సందేహం ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంది. ప్ర‌స్తుతం అక్క‌డ టీఆర్ఎస్‌కు ఉన్న వేవ్‌ను ఉప‌యోగించుకునేందుకు సీఎం కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌న్న చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయి. రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా అక్క‌డ టీఆర్ఎస్ వేవ్ ఉంద‌ని చెపుతున్నారు.

సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాయ‌కుల ధీమా ఎలా ఉన్నా టీ కాంగ్రెస్ నేత‌ల వెర్ష‌న్ మాత్రం మ‌రోలా ఉంది. త్వరలోరాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుందని…. అధికార టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి భారీ ఎత్తున నేతలు వలస వస్తారని వెల్లడించారు. టీఆర్ఎస్‌కు చెందిన 7, 8 మంది మంత్రులు, 15 మంది వరకు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని వారు చెపుతున్నారు.

టీ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క ఈ జోస్యం చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు కాస్త ముందుగా స‌రైన టైంలోనే వీళ్లంతా కాంగ్రెస్‌లోకి వ‌స్తార‌ని, అలాగే టీ టీడీపీ నుంచి కూడా పలువురు నేతలు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారని తెలిపారు. పాత వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఓ మ‌హిళా ఎమ్మెల్యే త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నారంటూ ఆయ‌న ప‌రోక్షంగా కొండా సురేఖ‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం కూడా క‌ల‌క‌లం రేపింది.

కేసీఆర్ నియంతృత్వ వైఖ‌రితో విసిగిపోయిన చాలా మంది మంత్రులు, ప్ర‌జాప్ర‌తినిధులు స‌రైన టైంలో ఆ పార్టీకి షాక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నార‌ని భ‌ట్టి చెప్పారు. ఇక త‌మ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా త‌మ‌కు కోవ‌ర్టులుగా ఉన్నార‌ని భ‌ట్టి బాంబు పేల్చారు. ఇక తెలంగాణ‌లో రైతుల సమస్యలు, రైతులకు బేడీలు, నేరెళ్ల ఘటన, మియాపూర్‌ భూములు, ప్రాజెక్టుల రీడిజైన్‌, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరధలాంటి అంశాల ఆధారంగా కాంగ్రెస్‌ ఎన్నికల్లో జనంలోకి వెళ్తుందని ఆయన తెలిపారు.

ఏదేమైనా భ‌ట్టి ఇలా షాక్ ఇవ్వ‌డంతో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి జంప్ చేసిన వాళ్ల‌లో టెన్ష‌న్ స్టార్ట్ అయ్యింది. వాళ్లు నిజంగానే కాంగ్రెస్‌కు కోవ‌ర్టులుగా ఉన్నారా ? లేదా భ‌ట్టి టీఆర్ఎస్‌ను ఇలా టెన్ష‌న్ పెడుతున్నారా ? అన్న‌ది సస్పెన్స్‌గా మారింది. ఇక కొండా సురేఖ లాంటి వాళ్లు పార్టీ మార‌తార‌ని ఇప్ప‌టికే వార్తలు అయితే వ‌చ్చాయి.