మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ విష‌యంలో షాక్ ఇచ్చిన బాల‌య్య‌

యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో గ‌త యేడాది కాలంగా ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ 2017లోనే ఉంటుంద‌ని, బాల‌య్య 100వ సినిమా శాత‌క‌ర్ణిలో మోక్ష‌జ్ఞ గెస్ట్‌ రోల్ చేస్తాడ‌ని ముందుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇవేవి జ‌ర‌గ‌లేదు. ఆ త‌ర్వాత మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ రేసులో ప‌లువురు డైరెక్ట‌ర్ల పేర్లు వినిపించాయి.

దర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్‌, బోయ‌పాటి శ్రీను, సంగీతం శ్రీనివాస‌రావు, క్రిష్ ఇలా చాలా పేర్లు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. మోక్షు డెబ్యూ మూవీనీ ఓ రేంజ్‌లో ఉండేలా బాల‌య్య ప్లాన్ చేస్తున్నారని అందరూ అనుకున్నారు. అయితే లేటెస్ట్ టాక్ ఏంటంటే త‌న త‌న‌యుడు మోక్షు డెబ్యూ మూవీ చాలా సింపుల్‌గా ఉండేలా బాల‌య్య ప్లాన్ చేస్తున్నాడ‌ట‌.

తొలి సినిమాకు భారీ హైప్ వ‌స్తే అంచ‌నాలు ఎక్కువుగా ఉంటాయ‌ని, అవి అందుకోవ‌డంలో ఏ మాత్రం కాస్త అటూ ఇటూ జ‌రిగినా అది మోక్షు కెరీర్‌తో పాటు రెండో సినిమాపై ఎఫెక్ట్ ఉంటుంద‌ని బాల‌య్య భావిస్తున్నాడ‌ట‌. ఈ క్ర‌మంలోనే మోక్షు డెబ్యూ మూవీని భారీ బ‌డ్జెట్ కాకుండా సింపుల్‌గా ఓ ల‌వ్‌స్టోరీతో తీయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ టాక్‌.

ఇక మోక్షు డెబ్యూ మూవీకి డైరెక్ట‌ర్ ఎవ‌ర‌న్న‌ది క్లారిటీ లేక‌పోయినా ఈ సినిమాను బాల‌య్య‌కు అత్యంత స‌న్నిహితుడు అయిన వారాహి చల‌న‌చిత్రం అధినేత సాయి కొర్ర‌పాటి నిర్మిస్తున్నారు. సాయి మోక్ష‌కు ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఆయ‌న అటు రాజ‌మౌళికి కూడా అత్యంత స‌న్నిహితుడ‌న్న విష‌యం తెలిసిందే.