ఇద్ద‌రు చంద్రుల షేక్ హ్యాండ్ అందుకేనా?

ఏపీ, తెలంగాణ సీఎంలు కేసీఆర్‌, చంద్ర‌బాబుల వైఖ‌రే డిఫ‌రెంటు. ఈ ఇద్ద‌రూ అవ‌స‌రాన్ని బ‌ట్టి తిట్టుకోవ‌డం, అవ‌స‌రాన్ని బ‌ట్టి పొగుడుకోవ‌డం ప‌రిపాటైంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు కృష్ణా వాట‌ర్ విష‌యంలో ఎవ‌రికి వారే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించిన ఈ ఇద్ద‌రు ఇప్పుడు ఢిల్లీలో జ‌రిగిన రాష్ట్ర‌ప‌తి నామినేష్ ఘ‌ట్టానికి వెళ్లిన సంద‌ర్భంలో మాత్రం చిరున‌వ్వులు చిందుకుని, షేక్ హ్యాండులు ఇచ్చేసుకుని మీడియాకు ఫోజులిచ్చారు.

దీంతో ఇప్పుడు వీరిద్ద‌రి చుట్టూతానే పాలిటిక్స్ రింగులు కొడుతున్నాయి. ఎవ‌రికివారే సొంత లాభం లేకుండా ఢిల్లీకి వెళ్తారా? అని ఇప్పుడు చ‌ర్చ జ‌రుగుతోంది. బీజేపీ నిల‌బెట్టిన రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి.. రామ్‌నాథ్ కోవింద్‌కి ఏపీ, తెలంగాణ సీఎంలు జై కొట్టారు. మ‌ద్ద‌తు ఆయ‌న‌కేన‌ని చెప్పారు. అంతేకాదు, నామినేష‌న్ ప‌త్రాల‌పై బాబు సంత‌కాలు కూడా చేశారు. ఇక‌, రామ్‌నాథ్ వాస్తు ప్ర‌కారం ఎటు తిరిగి నామినేష‌న్ వేస్తే బాగుంటుందో కేసీఆర్ స‌ల‌హా ఇచ్చిన‌ట్టు వార్త‌లు కూడా వ‌చ్చాయి.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. కార్య‌క్ర‌మం అనంత‌రం ఇద్ద‌రు చంద్రులూ.. క‌ర‌చాల‌నం చేసుకున్న త‌ర్వాత సీన్ మారింద‌ని అంటున్నారు. వీరిద్ద‌రూ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థికి మ‌ద్ద‌తివ్వ‌డం వెనుక‌.. విభ‌జ‌న చ‌ట్టంలోని నియోజ‌క‌వ‌ర్గాల పెంపు అంశాన్ని కేంద్రం స‌త్వ‌ర‌మే అమ‌లు చేయాల‌ని ఒప్పందం కుదుర్చుకున్న‌ట్టు స‌మ‌చారం. ఇటీవ‌ల ఇద్ద‌రూ పోటీ ప‌డి మ‌రీ ప‌క్క‌పార్టీల వాళ్ల‌ని చేర్చుకున్న నేప‌థ్యంలో ఇప్పుడు అంద‌రికీ న్యాయం చేయాలంటే నియోజ‌క‌వ‌ర్గాల‌ను పెంచాల్సి ఉంది. ఇదే జ‌రిగితే ఏపీలో 225కి, తెలంగాణ‌లో 175 స్థానాలు ఎగ‌బాకుతాయి. దీంతో ఇద్ద‌రూ త‌మ అభ్య‌ర్థుల‌కు సంతృప్తి క‌లిగించొచ్చు.

అయితే, ఈ ఇద్ద‌రు చంద్రుల ప్ర‌తిపాద‌న‌కు మోడీ ఏమ‌న్నారో తెలీదుకానీ,.. ఇక్క‌డే మ‌రో గ‌మ్మ‌త్త‌యిన సంగ‌తి బ‌య‌ట‌ప‌డింది. ఏపీలో విప‌క్ష నేత జ‌గ‌న్ కూడా మోడీకి జైకొట్టారు. ఆయ‌న నిల‌బెట్టిన కోవింద్‌కే మ‌ద్ద‌త‌ని ప్ర‌క‌టించారు. దీనికి వెనుక కూడా పొలిటిక‌ల్ గెయిన్ లేకుండా పోలేద‌ని స‌మాచారం. అదేంటంటే.. ఇప్ప‌ట్లో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పెంచొద్ద‌ని ఆయ‌న కోరాడ‌ట‌. అలా పెంచితే.. త‌న‌కు ఇప్ప‌టికే అభ్య‌ర్థుల కొర‌త ఉంద‌ని జ‌గ‌న్ భ‌యం. సో.. మ‌రి వీరిలో ఎవ‌రి కోరిక నెర‌వేరుతుందో చూడాలి!! మొత్తానికి ఇద్ద‌రు చంద్రులేకాదు.. జ‌గ‌న్ కూడా .. ప్రెసిడెంట్ ఎల‌క్ష‌న్‌ని పొలిటిక‌ల్‌గా వాడుసుకున్నాడ‌ని ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.