టీడీపీ కంచుకోట‌లో బాబు స‌ర్వేలో షాకింగ్ రిజ‌ల్ట్‌

ఏపీలోని ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా టీడీపీకి కంచుకోట‌లాంటిది. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్క‌డ ఆ పార్టీకి కంచుకోట‌గా ఉంటూ వ‌స్తోంది. 2004, 2009 ఎన్నిక‌లు మినిహా టీడీపీ ఆవిర్భావం త‌ర్వాత అన్ని ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ ఆధిప‌త్యం చూపించింది. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది. 15 ఎమ్మెల్యే స్థానాల‌తో పాటు ఏలూరు, న‌ర‌సాపురంతో పాటు ఈ జిల్లాలో స‌గం విస్త‌రించి ఉన్న రాజ‌మండ్రి ఎంపీ సీటును కూడా టీడీపీ + బీజేపీ భారీ మెజార్టీతో గెలుచుకున్నాయి.

ఎన్నిక‌లు పూర్త‌య్యి మూడేళ్లు అయ్యాయి. ఇక ముంద‌స్తు ఎన్నిక‌ల‌న్న ప్ర‌చార‌మూ ఉపందుకుంది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజయం సాధించేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఏపీలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోను అంత‌ర్గ‌త స‌ర్వేలు చేయిస్తున్నారు. పార్టీకి కంచుకోట‌గా ఉన్న ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో టీడీపీ అంత‌ర్గ‌తంగా చేయించిన స‌ర్వేలో పార్టీ అధిష్టానానికి దిమ్మ‌తిరిగే రేంజ్‌లో రిజ‌ల్ట్ వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఈ రిజ‌ల్ట్ టీడీపీలో ఇప్పుడు ప్ర‌కంప‌న‌లు రేపుతోంది.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఇప్ప‌టికిప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో ఎన్నిక‌లు జ‌రిగితే ఉండి ఎమ్మెల్యే క‌లువ‌పూడి శివ, త‌ణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ‌, దెందులూరు ఎమ్మెల్యే, ప్ర‌భుత్వ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌, కొవ్వూరు నుంచి గెలిచి ఎక్సైజ్ మంత్రి అయిన కేఎస్‌.జ‌వ‌హ‌ర్ మాత్ర‌మే డౌట్ లేకుండా గెలుస్తార‌ని తేలింద‌ట‌. ఉంగుటూరులో మాత్రం ఎమ్మెల్యే మీద వ్య‌తిరేక‌త లేక‌పోయినా అప్ప‌టి స‌మీక‌ర‌ణాలు ఎలాగైనా మారే సూచ‌న‌లు ఉన్నాయి.

ఇక మిగిలిన అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్న‌ట్టు ఈ రిపోర్టులో వెల్ల‌డైంద‌ట‌. మంత్రులు పైడికొండ‌ల మాణిక్యాల‌రావుతో పాటు పితాని స‌త్య‌నారాయ‌ణ‌సైతం వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొంటున్న‌ట్టు స‌మాచారం. ఈ రిజల్ట్ త‌ర్వాత చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల్లో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను ప‌క్క‌న పెడతార‌ని కూడా అంత‌ర్గ‌తంగా వార్త‌లు వ‌స్తున్నాయి. ఏదే మైనా టీడీపీకి కంచుకోట లాంటి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఇలాంటి రిజ‌ల్ట్ రావడం పార్టీ అధిష్టానానికి మింగుడుప‌డ‌డం లేదు.