శిల్పా జ‌గ‌న్ నుంచి టిక్కెట్ ఎలా!

నంద్యాల ఉప ఎన్నిక‌లో టీడీపీ త‌ర‌ఫున అభ్య‌ర్థి ముందే ఖ‌రార‌య్యాడు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. దీనిని ఏక‌గ్రీవం చేసుకునేందుకు అధికార పార్టీ ప్ర‌య‌త్నించినా ఫ‌లితం క‌నిపించ‌లేదు. మ‌రోప‌క్క వైసీపీ నుంచి అభ్య‌ర్థిగా శిల్పా మోహ‌న్ రెడ్డి పేరును జ‌గ‌న్ ప్ర‌క‌టించేశాడు. అయితే, ఇక్క‌డే అంద‌రికీ అర్ధం కాని ఓ విష‌యం ఉంది. వాస్త‌వానికి ఈ సీటును నంద్యాల వైసీపీ ఇంచార్జ్ రాజ‌గోపాల్ రెడ్డి ఆశించారు. ఆయ‌న‌కు ఇస్తాన‌ని జ‌గ‌న్ కూడా హామీ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అదేస‌మ‌యంలో మాజీ ఎంపీ గంగుల ప్ర‌తాప్ రె్డ్డి సైతం ఈ సీటును ఎంచుకున్నారు.

ఈ క్ర‌మంలో వైసీపీలో భారీ ఎత్తున కాంపిటీష‌న్ పెరిగింద‌ని అంద‌రూ అనుకున్నారు. అదేస‌మ‌యంలో టీడీపీ అధినేత‌పై ఆగ్రహించిన ఆపార్టీ నేత శిల్పా మోహ‌న్‌రెడ్డి.. వైసీపీలో చేరి.. కండువా మార్చేశారు. ఆయ‌న కేవ‌లం నంద్యాల టికెట్ కోస‌మే పార్టీ మారాడ‌ని అంద‌రూ అన్నారు. అయితే, మొద‌ట్లో దానిని ఖండించారు శిల్పా. ఇక‌, ఈ మొత్తం ఎపిసోడ్‌ను ర‌క్తి క‌ట్టిస్తూ.. జ‌గ‌న్ నంద్యాల నుంచి త‌నం అభ్య‌ర్థిని ప్ర‌క‌టించేశాడు. ఈ స్థానాన్ని అంద‌రూ అనుకున్న‌ట్టే శిల్పాకి కేటాయించారు.

అయితే, వాస్త‌వానికి నిన్న‌గాక మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌ను తిట్టిపోసి, బాబును పొగిడిన శిల్పాకి జ‌గ‌న్ సీటెలా ఇచ్చారా? అనేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. దీనికి ఒక్క‌టే స‌మాధానంగా ఉంది. అధికార పార్టీ ఈ సీటులో గెల‌వ‌డం కోసం అన్ని అవ‌కాశాల‌నూ వినియోగించుకుంటోంది. మొన్న‌టికి మొన్న చంద్ర‌బాబు ఓటుకు ఐదు వేలు అయినానేను ఇవ్వ‌గ‌ల‌ను. కానీ ఇవ్వ‌లేను అని చెప్ప‌డాన్ని బట్టి.. టీడీపీ ఆర్థికంగా ఎంత బ‌లంగా ఉందో అర్థ‌మ‌వుతోంది. ఇక‌, జ‌గ‌న్ ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ప్ర‌స్తుతం ఆదాయం త‌క్కువ వ్య‌యం ఎక్కువ అన్న‌ట్టుగా ఉంది ఆయ‌న ప‌రిస్థితి.

ఈ నేప‌థ్యంలోనే శిల్పా.. ఉప ఎన్నిక‌కు కావాల్సిన డ‌బ్బు విష‌యంలో ఏమీ ఆలోచించాల్సిన ప‌నిలేద‌ని, అంతా నేను చూసుకుంటాను అని జ‌గ‌న్‌కి హామీ ఇచ్చిన‌ట్టు తెలిసింది. కేవ‌లం టికెట్ ఇస్తే చాలున‌ని కూడా ఆయ‌న జ‌గ‌న్‌కి చెప్పిన‌ట్టు స‌మాచారం. అందుకే జ‌గ‌న్ ఈ ఒక్క‌మాట‌కు ప‌డిపోయాడ‌ని తెలుస్తోంది. మిగిలిన వాళ్ల‌ను ఎవ‌రిని నిల‌బెట్టినా పార్టీయే అంతా చూసుకోవాలి. ఆ ప‌రిస్థితి ఇప్పుడు లేదు. కాబ‌ట్టి.. జ‌గ‌న్ శిల్పావైపు మొగ్గు చూపిన‌ట్టు తెలుస్తోంది. అదేస‌మ‌యంలో శిల్పా కూడా గ‌తంలో రెండు సార్లు ఎమ్మేల్యేగా చేయ‌డం, మంత్రిగా ఉండ‌డం కూడా క‌లిసివ‌చ్చింది.