జ‌న‌సేన స‌ర్వే నిజ‌మా..?  కామెడీనా…?

2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన 83 సీట్లు గెలుస్తుందంటూ జ‌న‌సేన అభిమాని నిర్వ‌హించిన స‌ర్వేలో తేల‌డం ఇప్పుడు తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తోంది. అటు వైసీపీ, ఇటు టీడీపీ హోరాహోరీగా పోటీ ప‌డుతూ ఉన్న స‌మ‌యంలో.. ఈ స‌ర్వే రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. అయితే దీనిపై అటు రాజకీయ నాయ‌కులు, ఇటు విశ్లేష‌కులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు ఈ స‌ర్వే నిజ‌మా? అబ‌ద్ద‌మా? 83 సీట్లు ఎలా వస్తాయి? ఇంకా పార్టీ నిర్మాణ‌మే పూర్తిగా లేని జ‌న‌సేన‌కు అంత ఆద‌రణ ల‌భిస్తుందా? అనే సందేహాలు వ్య‌క్తంచేస్తున్నారు. అది నిజ‌మైన స‌ర్వేనా లేక స‌ర‌దాగా నిర్వ‌హించిన‌దా అనే అనుమానాలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎన్నిక‌ల బ‌రిలో దిగి ఒంట‌రిగానే పోటీచేస్తాన‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించిన నాటి నుంచి ఆయ‌న‌పై ఎన్నో అంచ‌నాలు ఉన్నాయి. అయితే అవి క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతున్నాయి. ప‌వ‌న్ ప్ర‌భావం రాష్ట్రమంతా ఉండ‌క‌పోవ‌చ్చ‌ని, కొన్ని జిల్లాల‌కే ప‌రిమితం కావొచ్చ‌ని విశ్లేష‌కులు అంచ‌నావేస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌న‌సేన‌లోకి సైనికుల‌ ఎంపిక‌లు నిర్వ‌హిస్తున్న త‌రుణంలో.. ఒక స‌ర్వే ఇప్పుడు క‌ల‌కలం రేపింది. ఏపీలో మొత్తం 175 నియోజ క‌వ‌ర్గాల‌కు గాను 83 సీట్ల‌లో జ‌న‌సేన గెలుస్తుంద‌నేది ఆ సారాంశం! ఇప్పుడు దీనిపై తీవ్ర చ‌ర్చ న‌డుస్తోంది. ముఖ్యంగా టీడీపీ, వైసీపీల‌కు ప‌ట్టున్న జిల్లాల్లోనూ జ‌న‌సేన గెలుస్తుంద‌ని తేల‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే అంశ‌మే!

2019 లో ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీ, విపక్ష వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతుందన్న అంచనాల్ని తల్లకిందులు చేస్తూ ఓ సర్వే బయటికి వచ్చింది. సాయిబాబా నాయుడు అనే ఓ జనసేన వీరాభిమాని ఇదే నా సర్వే అంటూ పేర్లతో సహా 83 నియోజకవర్గాల్లో జనసేన గెలుస్తుందని ప్రకటించాడు. రాష్ట్రమంతటా ఉన్న తన మిత్రులు సాయంతో వివిధ నియోజకవర్గాల్లో రాజకీయ అవగాహన ఉన్నవారితో, మేధావులు, విలేకరులతో మాట్లాడి వారిచ్చిన సమాచారాన్ని విశ్లేషించి ఈ నివేదిక రూపొందించాడ‌ట‌. ఒక‌ప‌క్క స‌ర్వేలన్నీ జ‌న‌సేన‌కు కేవ‌లం 3 నుంచి 5 శాతం సీట్లు వ‌స్తాయ‌ని చెబుతుంటే.. ఆయ‌న మాత్రం ఏకంగా 83 సీట్లు ద‌క్కించుకుంటుంద‌ని చెబుతున్నారు.

కాపు సామాజిక వ‌ర్గప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న తూర్పు, ప‌శ్చిమగోదావ‌రి జిల్లాల్లో మొత్తం 34 సీట్ల‌కు గాను 23 సీట్లు జ‌న‌సేన ద‌క్కుతాయ‌ని ఇందులో తేలింది. 2014 ఎన్నిక‌ల్లో ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ దాదాపు 28 నియోజ‌క‌వ‌ర్గాలు గెలుచుకుంది. మ‌రి ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ, టీడీపీ గ‌ట్టిగా త‌ల‌ప‌డ‌టం ఖాయం! ఇక క‌మ్మ సామాజిక‌వ‌ర్గ ప్ర‌భావం అధికంగా ఉన్న కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో 24 స్థానాలు గెలుస్తుంద‌ట‌. ఈ మూడు జిల్లాలు టీడీపీకి కంచుకోట ల్లాంటివే! మ‌రి టీడీపీ ఓటు బ్యాంకు జ‌న‌సేన‌కు ఎలా వెళుతుందో అంతుచిక్క‌డమేలేదు! విశాఖ‌లోనూ ఇదే ప‌రిస్థితి! కడ‌ప‌, క‌ర్నూలు వంటి జిల్లాల్లో వైసీపీ ప్ర‌భావం ఎక్కువ‌. మ‌రి ఇక్క‌డ కూడా జ‌న‌సేన మెజారిటీ సీట్లు గెలుస్తుంద‌నుకోవ‌డం హాస్యాస్ప‌ద‌మే!