వైసీపీ అనుకూల వ‌ర్గానికి టీడీపీ గాలం!

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం మారిపోతోందా? వైసీపీకి మ‌ద్ద‌తిస్తున్న కొన్ని వ‌ర్గాలు ఇప్పుడు ఆ పార్టీకి హ్యాండివ్వాల‌ని డిసైడ్ అయ్యాయా? అదే స‌మ‌యంలో అధికార టీడీపీ పంచ‌న చేరాల‌ని కూడా నిర్ణ‌యించుకున్నాయా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ప్ర‌స్తుతం ద‌ళిత వ‌ర్గాల ఓటు బ్యాంకు ఏ పార్టీకైనా ఇంపార్టెంట్‌గా మారింది. దీంతో వీరిని మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌తి పార్టీ ప్ర‌య‌త్నిస్తూనే ఉంటుంది. ఇక‌, వైసీపీకి ఈ విష‌యంలో క‌లిసొచ్చిన అంశం ఏంటంటే.. కోర కుండానే నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎస్సీ వ‌ర్గాలు ఈ పార్టీకి మ‌ద్ద‌తుగా నిలిచాయి.

అయితే, ఇప్పుడు వైసీపీ అధినేత జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలి.. ఆయ‌న‌కు, ఆయ‌న పార్టీకీ ఎస్సీ(మాల‌లు)ల‌ను దూరం చేస్తోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. దీనికితోడు ఏపీ సీఎం, టీడీపీ సార‌ధి చంద్ర‌బాబు.. ఎస్సీల ప‌ట్ల త‌న వైఖ‌రిని మార్చుకున్నారు. మాదిగలతో పాటు మాలల్ని ఆకట్టుకోలేకపోతే రాజకీయ మనుగడ అసాధ్యమని గుర్తించిన చంద్రబాబు స్టాండ్ మారింది. పదవుల విషయంలో మాదిగల కన్నా మాలల ప్రాధాన్యం పెరిగింది. వైసీపీ కి అండగా ఉన్న ఆ వర్గాన్ని ఆకట్టుకోడానికి జూపూడి, కారెం వంటి వారిని బాబు దగ్గరకు తీశారు. ఆ వ్యూహం ఫలిస్తున్నంతలో క్యాబినెట్ పదవి కూడా అదే వర్గానికి చెందిన నక్కా ఆనందబాబు కి ఇవ్వడం ద్వారా ఆ వర్గాన్ని పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచారు.

అయితే, ఇదే స‌మ‌యంలో మాదిగ‌లు ఒకింత అస‌హ‌నానికి గుర‌య్యారు. త‌మ‌కు ప్రాధాన్యం లేకుండా పోతోంద‌ని భావించారు. అయితే, వీరిని బుజ్జ‌గించ‌డంలో వ‌ర్గీక‌ర‌ణ ప‌ట్ల సానుకూల‌త‌ను వ్య‌క్తం చేయ‌డంలో బీజేపీ స‌క్సెస్ అయింది. దీంతో ఇప్పుడు మాదిగ‌లు బీజేపీకి ద‌గ్గ‌ర‌వుతున్నారు. అంటే ఓ ర‌కంగా టీడీపీకి దూరం కాన‌ట్టే లెక్క‌. అయితే, అదేస‌మ‌యంలో జ‌గ‌న్‌కి మాత్రం ఈ రెండు వ‌ర్గాలూ దూరం అవుతున్నాయ‌నే తెలుస్తోంది. ఈ విషయాన్ని న్యూజిలాండ్ టూర్ నుంచి వచ్చాక జగన్ తో ప్రత్యేకంగా ప్రస్తావించాలని కొందరు సీనియర్లు భావిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.