ఓటుకు నోటు కేసు భ‌యం బాబుని ఇంకా వెంటాడుతోందా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు ప‌రిస్థితి చాలా భిన్నంగా మారింది. ఆయ‌న త‌న‌ను తాను అలెగ్జాండ‌ర్‌తో పోల్చుకుంటారు. తానెవ‌రికీ భ‌య‌ప‌డ‌డ‌ని, అవినీతికి త‌న ద‌గ్గ‌ర తావు లేద‌ని ప‌దే ప‌దే చెబుతుంటారు. అయితే, నిన్న బుధ‌వారం జ‌రిగిన ఓ సంఘ‌ట‌న మాత్రం బాబు పిరికి వాడ‌నే కామెంట్లు రావ‌డానికి అవ‌కాశం క‌ల్పించింది. అదేంటో మీరూ చ‌ద‌వండి! ప్ర‌స్తుతం టీడీపీలో మ‌హానాడు ఫీవ‌ర్ కొన‌సాగుతోంది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు మ‌హానాడు పెద్ద ఎత్తున జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో తెలంగాణ‌లోనూ టీడీపీ నేత‌లు బుధ‌వారం మ‌హానాడు నిర్వ‌హించారు. దీనికి టీడీపీ జాతీయ అధ్య‌క్షుడి హోదాలో చంద్ర‌బాబు హాజ‌ర‌య్యారు.

తెలుగు త‌మ్ముళ్లు కూడా దీనికి భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. తెలంగాణ‌లో జ‌రుగుతున్న‌ది కాబ‌ట్టి… స‌హ‌జంగానే అధికార పార్టీ టీఆర్ ఎస్‌, సీఎం కేసీఆర్‌పై టీడీపీ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తుంద‌ని ఎవ‌రైనా ఊహిస్తారు. అదే జ‌రిగింది! రేవంత్ రెడ్డి, ఎల్ ర‌మ‌ణ స‌హా అంద‌రూ కేసీఆర్ పాల‌న‌పై దుమ్మెత్తి పోశారు. రైతుల ఆత్మ‌హ‌త్య‌లు, డ‌బుల్ బెడ్ రూం ఇళ్ల‌పై నిల‌దీశారు. ఇక‌, రాబోయే రెండేళ్ల‌లో తెలుగు దేశం పార్టీని తెలంగాణ‌లో అధికారంలోకి తీసుకొస్తామ‌ని ప్ర‌తిజ్ఞ‌లు కూడా చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. అనంతరం మైకు అందుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాత్రం చ‌ప్ప‌చ‌ప్ప‌గా నాలుగు మాట‌లు మాట్లాడి.. మైకును మూల‌న పెట్టేశారు.

నిజానికి త‌మ‌క‌న్నా కేసీఆర్‌పై బాబు నిప్పులు చెరుగుతార‌ని త‌మ్ముళ్లు సంబ‌ర‌ప‌డ్డారు. అయితే, వీరి అంచ‌నాల‌కు రివ‌ర్స్‌గా బాబు.. త‌న ప్ర‌సంగంలో టీఆర్ ఎస్ గురించికానీ, కేసీఆర్ గురించి కానీ ఒక్క‌మాట కూడా మాట్లాడ‌లేదు. దీంతో త‌మ్ముళ్లు ఉసూరుమ‌న్నారు. అయితే, చంద్ర‌బాబు ఎందుక‌లా మౌనంగా ఉన్నార‌న‌టే టాపిక్‌పై మాత్రం సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన కామెంట్లు వ‌చ్చాయి. బాబును ఇంకా ‘ఓటుకు నోటు కేసు’ ఎంత భయపెడుతుందో అర్థం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మ‌రోప‌క్క‌, ప్ర‌ధాని మోడీని మంచోడంటూనే బీజేపీ సార‌థి అమిత్ షాపై మాత్రం కేసీఆర్ నిప్పులు చెరిగారు.దీంతో కేసీఆర్ పాటి కూడా బాబు ధైర్యం చేయ‌లేక‌పోయారే అని అంటున్నారు. సో.. ఇదీ మ‌న బాబు గారి రాజ‌కీయం!!