సునీల్ ‘ ఉంగ‌రాల రాంబాబు ‘ క‌థ ఇదే

ఒక్క హిట్ పడితే చాలు అంతా మారిపోతుందని ఎన్నో పరాజయాలు ఎదురైనా ముందుకు వెళుతున్నాడు హీరో సునీల్. వ‌రుస‌గా ప్లాపుల మీద ప్లాపులు ఇస్తోన్న సునీల్ లేటెస్ట్ మూవీ ఉంగ‌రాల రాంబాబు. ఉంగ‌రాల రాంబాబు రేపు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమా దర్శకుడు క్రాంతి మాధవ్ ట్రాక్ రికార్డు చూస్తే సినిమాలో మ్యాటర్ ఉందని అనుకోవడంలో తప్పులేదు. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి ఇంటెన్స్ సినిమాలు చేసిన దర్శకుడు కావడంతో ఉంగరాల రాంబాబు మీద గట్టి అంచనాలే ఏర్పడ్డాయి.

ఇండ‌స్ట్రీలో విన‌ప‌డుతోన్న టాక్ ప్ర‌కారం ఈ క‌థ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. రాంబాబు జీవితం హాయిగా సాగిపోతుంటుంది. పట్టిందల్లా బంగారం అయ్యి ఆర్ధికంగా ఎదుగుతాడు. అయితే కొన్నాళ్ళకి ఆ అదృష్టం తిరగబడుతుంది. ఎక్కడ చేయి పెట్టినా కాలే పరిస్థితి వస్తుంది. దీని నుంచి బయట పడాలంటే ఫలానా నక్షత్రంలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఓ పంతులు గారు సలహా ఇస్తాడు.

అప్పటినుంచి ఆ అమ్మాయి కోసం వెదుకులాట మొదలెడతాడు. ఆ అన్వేషణ అటు తిరిగి ఇటు తిరిగి చివరకు సొంత ఆఫీస్ లోనే ముగుస్తుంది. తన ఆఫీస్ లో పని చేసే ఓ అమ్మాయిని చేసుకుంటే అంతా మారిపోతుందని రాంబాబు అనుకుంటాడు. అయితే ఆ పిల్ల ఆలోచనలు వేరుగా ఉన్నాయని తెలుసుకుని ఆమెని ఇంప్రెస్ చేసేందుకు ట్రై చేస్తాడు.

ఆమె కూడా రాంబాబును ఇష్ట‌ప‌డుతుంది. అయితే రాంబాబుతో పెళ్ళికి ఓ షరతు పెడుతుంది. తన తండ్రిని కూడా పెళ్ళికి ఒప్పించాలని అడుగుతుంది. అందుకోసం ఆ పిల్ల సొంతూరు కేరళలోని ఓ గ్రామానికి వెళ్లిన రాంబాబుకి అక్కడి వ్యవహారాలు షాక్ ఇస్తాయి. ఆ పరిస్థితుల్లో అక్కడ రాంబాబు పిల్ల తండ్రిని ఒప్పించడానికి చేసిన ప్రయత్నమే ఉంగరాల రాంబాబు మిగిలిన కథ‌. స్టోరీ లైన్ చూస్తుంటే ఇంట్ర‌స్టింగ్ కంటెంట్ ఉన్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. మ‌రి ఈ సినిమాతో అయినా సునీల్ హిట్ కొడ‌తాడేమో ? చూద్దాం.