మోహన్ రెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది..2019లో గెలుస్తాడా?

జిల్లా కేంద్ర‌మైన క‌ర్నూలు ఎమ్మెల్యేగా ఉన్న ఎస్వీ.మోహ‌న్‌రెడ్డి ఫ‌స్ట్ టైం వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి గ‌త ఎన్నిక‌ల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. మాజీ మంత్రి ఎస్వీ.సుబ్బారెడ్డి కుమారుడు అయిన మోహ‌న్‌రెడ్డి దివంగ‌త భూమా దంప‌తుల్లో శోభ‌కు స్వ‌యానా సోద‌రుడు కాగా, నాగిరెడ్డికి బావ‌మ‌రిది.

తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన మోహ‌న్‌రెడ్డి ఇప్ప‌ట‌కీ రాజ‌కీయంగాను పూర్తిగా గ్రిప్ సాధించ‌కపోవ‌డం ఓ మైన‌స్ అయితే, వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి మార‌డం మ‌రో మైన‌స్‌. ఇక అధికార పార్టీలోకి వ‌చ్చినా జిల్లా కేంద్ర‌మైన క‌ర్నూలు అభివృద్ధి విష‌యంలో ఎలాంటి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపించ‌క‌పోవ‌డంతో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్నారు.

రాజ‌కీయంగా చూస్తే మోహ‌న్‌రెడ్డికి నియోజ‌క‌వ‌ర్గంలో అంత సానుకూల ప‌రిస్థితులు లేవు. రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేష్‌కు ఇక్క‌డ బ‌ల‌మైన అనుచ‌ర‌గ‌ణం ఉంది. ప్ర‌స్తుతం టీజీకి, మోహ‌న్‌రెడ్డికి పొస‌గ‌డం లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోహ‌న్‌రెడ్డిని ఏదోలా త‌ప్పించి త‌న త‌న‌యుడు భ‌ర‌త్‌కు క‌ర్నూలు టీడీపీ టిక్కెట్ ఇప్పించుకునేందుకు వెంక‌టేష్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మోహ‌న్‌రెడ్డికి తెర‌వెన‌క ఎర్త్ పెట్టేలా చేస్తున్నార‌న్న చ‌ర్చ‌లు క‌ర్నూలు రాజ‌కీయాల్లో వినిపిస్తున్నాయి.

భ‌ర‌త్ ఇప్ప‌టికే సేవా కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. టీజీ రేంజ్ వ్యూహాలు మోహ‌న్‌రెడ్డి ద‌గ్గ‌ర లేక‌పోవ‌డం కూడా మైన‌స్‌. ఇక అభివృద్ధి ప‌రంగా కూడా జిల్లా కేంద్రంగా ఉన్న క‌ర్నూలు ఈ మూడేళ్ల‌లో అంత గొప్ప‌గా ఏం అభివృద్ధి చెంద‌లేదు. ఇక చంద్రబాబుకు సైతం మోహ‌న్‌రెడ్డి మీద పెద్ద‌గా న‌మ్మ‌కం ఉన్న‌ట్టు క‌న‌ప‌డ‌డం లేదు. క‌ర్నూలు కార్పొరేష‌న్‌కు ఎన్నిక‌లు జ‌రిగినా టీడీపీ గెలుస్తుంద‌న్న పూర్తి కాన్ఫిడెన్స్ చంద్ర‌బాబుకే లేద‌ని టాక్‌.

ప్ల‌స్ పాయింట్స్ (+) :

– ప్ర‌జ‌ల్లో బాగా ఎటాచ్‌లో ఉండ‌డం

– అనుచ‌ర‌గ‌ణం ఉంది

మైన‌స్ పాయింట్స్ (-) :

– ఎమ్మెల్యేతో పాటు అనుచ‌రుల‌పై క‌బ్జాల ఆరోప‌ణ‌లు

– రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేష్‌తో ప‌డ‌క‌పోవ‌డం

– అభివృద్ధి లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల్లో తీవ్ర అసంతృప్తి

– నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉన్న రెడ్డి, ముస్లిం ఓట‌ర్లు వైసీపీకి అనుకూలంగా ఉండ‌డం

తుది తీర్పు :

ఫైన‌ల్‌గా చెప్పాలంటే ఎస్వీ.మోహ‌న్‌రెడ్డికి క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌స్తుతం అంత అనుకూల‌మైన ప‌రిస్థితులు లేవు. అభివృద్ధి లేక‌పోవ‌డం, రాజ‌కీయంగా అనేక మైన‌స్‌లు ఆయ‌న‌కు ఇబ్బందిగా మారాయి. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లోనే మోహ‌న్‌రెడ్డి టీజీ వెంకటేష్‌పై కేవ‌లం 3 వేల ఓట్ల‌తో గెలిచారు. అప్ప‌ట్లో రెడ్డి, మైనార్టీ ఓట‌ర్లు వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేయ‌డంతో ఈ స్వ‌ల్ప విజ‌యం అయినా ద‌క్కింది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇప్పుడు ఈ రెండు వ‌ర్గాల ఓట‌ర్లు వైసీపీ వైపు మొగ్గు చూపే ఛాన్సులు ఉండ‌డం, అటు టీజీతో ఉన్న గ్యాప్‌, మ‌రోవైపు టీజీ త‌న కుమారుడు భ‌ర‌త్‌కు సీటు ఇప్పించుకునేందుకు చేస్తోన్న ప్ర‌య‌త్నాలు మోహ‌న్‌రెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌విని ముళ్ల‌పాన్పుగా మార్చేశాయి. ఇక రాజ‌కీయంగా నిన్న‌టి వ‌ర‌కు అండ‌గా ఉన్న భూమా నాగిరెడ్డి కూడా లేక‌పోవ‌డంతో మోహ‌న్‌రెడ్డి పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ ఎలా ఉంటుందో ? చెప్ప‌లేం