`సేమ్ టుసేమ్` జ‌న‌సేన‌ను దించేశారుగా!

రాజ‌కీయాల్లో కొత్త పార్టీల‌కు కొద‌వే లేదు. కొన్ని పార్టీల పేర్లు చిత్ర‌విచిత్రంగా ఉంటాయి. బాగా పాపుల‌ర్ అయిన పార్టీల పేర్ల‌కు ముందు, వెనుక ఒక ప‌దం జోడించి.. కొత్త పార్టీగా పెట్టేస్తుంటారు! ఇప్పుడు ఇలాంటి విచిత్ర‌మే త‌మిళ‌నాడులో జ‌రిగింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స్థాపించిన జ‌న‌సేన‌కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే! అలాగే త‌మిళ‌నాడులో `అమ్మ‌` పేరుకు ఎంతో పాపులారిటీ ఉంది. ఈరెండు ప‌దాల‌నే క‌లిపి ఒక కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ఇంకో విశేషమేంటం టే.. త‌మిళ‌నాడులో ఉన్న తెలుగువారు దీనిని స్థాపించారు. అంతేకాదండోయ్‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను స్ఫూర్తిగా తీసుకున్నార ఏమోగానీ.. `అమ్మ జ‌న‌సేన` ల‌క్ష్యం.. ద‌క్షిణాది ప్ర‌జ‌ల‌ను కాపాడ‌డ‌మేన‌ట‌!!

ద‌క్షిణ భార‌త దేశ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలు కాపాడ‌ట‌మే ల‌క్ష్యంగా ఓ కొత్త రాజ‌కీయ పార్టీ తెరంగేట్రం చేయ‌నుంది. ఇప్ప‌టికే ఆ పార్టీ జెండా ఖ‌రారు కాగా… ఇప్పుడు ఆ పార్టీకి చెందిన విధి విధినాల రూప‌క‌ల్ప‌న జ‌రుగుతోంద‌ట‌. త‌మిళ‌నాడు కేంద్రంగా త్వ‌ర‌లోనే జ‌నంలోకి రానున్న‌ ఈ పార్టీ పేరు `అమ్మ జ‌నసేన‌`! కొంత‌కాలం క్రితం సొంతంగా ఓ రాజ‌కీయ పార్టీ పెట్టిన ప‌వ‌న్‌… దానికి `జ‌న‌సేన` పేరు పెట్టిన సంగ‌తి తెలిసిందే. త‌మిళ నాట జ‌య పేరును స్మ‌రిస్తూ `అమ్మ‌` అనే పేరును… తెలుగు నాట ప‌వ‌న్ స్టార్ట్ చేసిన జ‌న‌సేన పార్టీ పేరును క‌లిపేసి `అమ్మ జ‌న‌సేన‌` పార్టీగా స‌రికొత్త‌గా పేరు పెట్టారు.

ఈ పార్టీకి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న వారెవ‌రంటే.. త‌మిళ‌నాట తెలుగు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్న త‌మిళ‌నాడు తెలుగు యువ‌శ‌క్తి అధ్య‌క్షుడు కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌రరెడ్డి. ఉత్త‌రాది ఆధిప‌త్యాన్ని జ‌న‌సేన అధినేత నిత్యం ప్ర‌శ్నిస్తూ వ‌స్తున్నారు. ద‌క్షిణాదిపై చిన్న‌చూపు చూస్తున్నార‌ని స‌మావేశాల్లో గ‌ట్టిగా విమ‌ర్శిస్తున్నాడు. ద‌క్షిణాది ప్ర‌జ‌ల‌ను ఉత్త‌ర భార‌త‌దేశ‌ప్ర‌జ‌ల నుంచి కాపాడాల‌ని అంటున్నాడు. ఇప్పుడు ఈ `అమ్మ జ‌న‌సేన‌` పార్టీ ప్రధానాంశం కూడా ఇదేన‌ట‌. ద‌క్షిణాది రాష్ట్రాల‌పై ఉత్త‌రాది పెత్త‌నాన్ని రూపుమాప‌డం అనే ప్ర‌ధాన అంశంతోనే ఈ పార్టీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు జ‌గ‌దీశ్వ‌ర‌రెడ్డి చెబుతున్నారు.

`సేవ్ ద‌క్షిణ భార‌త్‌` అన్న నినాదంతో ఈ పార్టీని ప్రారంభించ‌నున్న జ‌గ‌దీశ్వ‌ర‌రెడ్డి… పార్టీని త‌మిళ‌నాడుతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, పుదుచ్చేరి, కేర‌ళ‌లోనూ విస్తరిస్తార‌ట. 50 ఏళ్లు పైబ‌డ్డ రైతుల‌కు నెల‌కు రూ.5 వేల పెన్ష‌న్‌, రైతుల‌కు ఉచితంగా ఎరువులు, విత్త‌నాలు, పురుగు మందుల పంపిణీ, పిల్ల‌ల‌కు ప్రాథ‌మిక విద్య నుంచి డిగ్రీ స్థాయి వ‌ర‌కు ఉచిత విద్య‌, 65 ఏళ్లు నిండిన వృద్ధుల‌కు ఉచితంగా కార్పొరేట్ వైద్యం త‌దిత‌ర డిమాండ్ల‌తో తాము ప‌నిచేస్తార‌ట‌. మ‌రి ఈ పార్టీ మ‌నుగ‌డ ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే!!