అటు టీడీపీ, ఇటు వైసీపీల‌కు అగ్ని ప‌రీక్ష ..నేత‌ల‌కు చెమ‌ట‌లు!

రాష్ట్రంలో ప్ర‌ధాన పార్టీలుగా ఉన్న వైసీపీ, టీడీపీల‌కు ఇప్పుడు చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. తూర్పుగోదావ‌రి జిల్లాలో క్రియా శీల‌కంగా ఉండే కాకినాడ కార్పోరేష‌న్‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తోంది. దాదాపు ఏడేళ్ల త‌ర్వాత ఇక్క‌డ అనేక మ‌లుపులు తిరిగిన రాజ‌కీయాలు ఇప్పుడు ఎన్నిక‌ల దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. అయితే, ప్ర‌ధాన ప‌క్షాలైన వైసీపీ, టీడీపీల‌కు ఇక్క‌డ ఎన్నిక‌లు జ‌ర‌గ‌కుండానే చెమ‌ట‌లు ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. కాకినాడ కార్పొరేష‌న్‌లో మొత్తం 50 డివిజ‌న్లు ఉన్నాయి. వివాదాస్ప‌దంగా మారిన ఒక‌టి రెండు డివిజ‌న్ల‌ను ప‌క్క‌న పెట్టి.. మిగిలిన వాటిలో ఎన్నిక‌లు నిర్వ‌హించ వ‌చ్చు క‌దా అని ఇటీవ‌ల హైకోర్టు ఆదేశించింది. 

దీంతో ఈ నెల 29న ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. సో..  కార్పొరేష‌న్‌లో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. మొత్తం అన్ని డివిజ‌న్ల‌లో క‌లిపి 493 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం అన్ని డివిజ‌న్ల‌లోనూ వైసీపీ ఒంట‌రిగా బ‌రిలోకి దిగుతోంది. అయితే, టీడీపీ, బీజేపీలు మాత్రం 2014 ఫార్ములానే పాటిస్తున్నాయి. అంటే ఈ రెండు జంట‌గానే ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతున్నాయి. ఈ క్ర‌మంలో మిత్ర ప‌క్షం బీజేపీకి టీడీపీ 9 డివిజ‌న్లు కేటాయించింది. దీంతో ఆయా డివిజ‌న్ల‌లో అభ్య‌ర్థులు నామినేష‌న్ కూడా వేశారు. అయితే, ఇప్పుడు బీజేపీలోని ఓ వ‌ర్గం మాత్రం మొత్తం 48 డివిజ‌న్ల‌కుగాను కేవ‌లం త‌మ‌కు ముష్టి వేసిన‌ట్టు 9 కేటాయించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తోంది. 

దీనిపై స‌మాధానంగా మంత్రులు క‌ళా వెంక‌ట్రావు, చిన‌రాజ‌ప్ప‌, య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు త‌దిత‌రులు బీజేపీ నేత‌ల‌తో భేటీ అయి చ‌ర్చించార‌ట‌. అయినా కూడా బీజేపీ నేత‌లు శాంతించ‌లేద‌ని తెలుస్తోంది. ఈ విష‌యంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబుతోనే తాడో పేడో తేల్చుకోవాల‌ని డిసైడ్ అయ్యార‌ని తెలుస్తోంది. ఇది టీడీపీకి పెద్ద త‌ల‌నొప్పిగా మార‌నుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రోప‌క్క‌.. టీడీపీలోనే 48 వార్డుల్లో ఒక్కొక్క వార్డుకు ముగ్గురేసి చొప్పున   అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎవరికి వారు తమకే బీఫారంలు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మంత్రులు యనమల, చినరాజప్పపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే అంత‌మందికి బీఫారాలు ఎలా ఇస్తామ‌ని టీడీపీ నేత‌లు తెగేసి చెబుతున్నారు. 

ఈ నేప‌థ్యంలోనే పార్టీలో అస‌మ్మ‌తి త‌లెత్తే ప్ర‌మాదం ఉంద‌ని.. రెబెల్స్ రంగంలోకి దిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.   ఇప్పటికే కొందరిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు మంత్రులు. తమకు టిక్కెట్ ఇవ్వకుంటే రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతామని టీడీపీ నేతలను హెచ్చరిస్తున్నారు కొందరు. ఇదిలావుంటే, ఇక వైసీపీలో కూడా గ్రూపులు బయలుదేరాయి. కాకినాడలో మొత్తం మూడు వర్గాలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ కో-ఆర్డినేటర్ ముత్తాశశిధర్ పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేయించారు. 

అలాగే మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, కాకినాడ ఎంపీ స్థానానికి గతంలో పోటీ చేసిన సునీల్ తమ అభ్యర్థులను నామినేషన్లు వేయించారు. వీరందరినీ ఒకతాటిపైకి తెచ్చేందుకు విజయసాయి రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఇలా మొత్తంగా కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు అటు టీడీపీ, ఇటు వైసీపీల‌కు అగ్ని ప‌రీక్ష కానుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి ఏంజ‌రుగుతుందో చూడాలి.