బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకోవ‌డం ఎంత క్షేమం, ఎంత మేర‌కు లాభం ?

అవును! ఇప్పుడు ఏ రాజ‌కీయ విశ్లేష‌కులను ప‌ల‌క‌రించినా ఏపీలో ప‌రిస్థితిపై చెబుతున్న మాట ఇది! బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఐర‌న్ లెగ్‌తో సంసారం చేసిన‌ట్టేన‌ని అంటున్నారు. విష‌యం లోకి వెళ్లిపోతే.. 2019లో ఏపీలో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్ప‌డింది. మిగిలిన రాష్ట్రాల‌తో పోల్చుకుంటే ఇక్క‌డ విప‌క్షం గ‌ట్టిగా ఉండ‌డం, ప్ర‌జ‌లు ఆయ‌న‌తో ఉండ‌డం, 2019లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌ని డిసైడ్ అవ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌పై అంచ‌నాలు ఊపందుకున్నాయి. ఈ క్ర‌మంలో 2014లో ఒంట‌రిగా వెళ్లిన తాము 2019లో మాత్రం ఎన్నిక‌ల‌కు జంట‌గా వెళ్లాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు. దీనికిగాను ఆయ‌న జాతీయ పార్టీ బీజేపీని ఎంచుకున్నారు. 

అయితే, 2014లో బీజేపీతో జత క‌ట్టిన టీడీపీ విజ‌య‌బావుటా ఎగ‌రేసింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న జ‌గ‌న్‌.. ఇప్ప‌టికే పొత్తుల విష‌యంపై కేంద్రంలోని బీజేపీ అధిష్టానంతో లెక్క‌లు క‌ట్టుకుని వ‌చ్చేశారు. ఎక్కువ స్థానాలు బీజేపీకి ఇచ్చేట్టుగా ఆయ‌న ఒప్పందం కుదుర్చుకున్నార‌ని స‌మాచారం. ఇక‌, దీంతో ఇప్పుడు అస‌లు బీజేపీతో పొత్తు పెట్టుకోవ‌డం ఎంత క్షేమం, ఎంత మేర‌కు లాభం అనే చ‌ర్చ‌కు తెర‌దీసింది. 2014లో అంటే అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌భుత్వంతో విసుగెత్తిన ప్ర‌జ‌లు బీజేపీ ఇచ్చిన ఎన్నిక‌ల హామీల‌కు ముగ్ధుల‌య్యారు. ముఖ్యంగా విభ‌జ‌న త‌ర్వాత అప్పులు, క‌ష్టాల్లో ఉన్న ఏపీకి అన్ని విధాలా సాయం చేస్తామ‌ని తిరుప‌తి వేదిక‌గా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన హామీ మేర‌కు ప్ర‌జ‌లు అప్ప‌ట్లో బీజేపీ-టీడీపీ కూట‌మికి ప‌ట్టంక‌ట్టారు. 

అయితే, రాబోయే 2019లో మాత్రం ఆ ప‌రిస్థితి ఉండ‌ద‌ని అంటున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం .. బీజేపీ కేంద్రంలో గ‌ద్దెనెక్కాక‌.. ఏపీని ప‌క్క‌కు పెట్టేసింది. ప్ర‌తి విష‌యంలోనూ చంద్ర‌బాబు కాలికి బ‌ల‌పం క‌ట్టుకుని ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. పోల‌వ‌రం నిధులు, రాజ‌ధాని నిధులు, విభ‌జ‌న హామీల అమ‌లు వంటి అనేక స‌మస్య‌ల‌ను బీజేపీ ప‌ట్టించుకోవ‌డం లేదు. పోనీ .. ఇక్క‌డి బీజేపీ నేత‌లైనా వీటిని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి ప‌రిష్కారం అయ్యేలా చూస్తున్నారా? అంటే అదీలేదు. దీంతో ఏపీ ప్ర‌జ‌ల‌కు బీజేపీ ఎంతంత దూరం.. అన్న‌ట్టుగా మారిపోయింద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. 

ఇలాంటి ప‌రిస్థితిలో బీజేపీతో వైసీపీ కానీ, మ‌రే ఇత‌ర పార్టీ కానీ పొత్తు పెట్టుకుంటే .. బీజేపీ వ‌ల్ల ఎలాంటి లాభం ఉండ‌క‌పోగా.. న‌ష్ట‌మేన‌నే విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ప్ర‌జ‌లు ఇప్ప‌టికే విసుగెత్తిపోయార‌ని, విభ‌జ‌న‌ను అస్స‌లు ఇష్టంలేని స‌గానికి పైగా జ‌నం క‌నీసం అప్ప‌టి హామీల‌ను లేదా ప్ర‌త్యేక హోదాను అయినా కోరుతున్నార‌ని అంటున్నారు. అయితే, ఇవేవీ చేసే ప‌నిలో కేంద్రంలోని బీజేపీ లేనందున ఈ విష‌యంలో ప్ర‌జ‌లు సానుభూతి కోల్పోయార‌ని అంటున్నారు. అవ‌కాశం ఎదురు చూస్తున్నార‌ని, ప్ర‌స్తుతం రాష్ట్రంలో బీజేపీ గెలుచుకున్న సీట్ల‌న‌యినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుచుకోవ‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీతో పొత్తు అంటే ఆలోచించాల్సిందేన‌ని చెబుతున్నారు.