నంద్యాల ఖ‌ర్చు ఎన్ని కోట్లో తెలుసా..!

అవును! నంద్యాల ఉప ఎన్నిక‌ల ఖ‌ర్చు నామినేష‌న్ల ఘ‌ట్టానికి ముందే వంద‌ల కోట్లు దాటేసింద‌ని అంటున్నారు అధికార‌, విప‌క్ష అభ్య‌ర్థుల స‌న్నిహితులు. సాధార‌ణంగా ఎన్నిక‌ల‌న్నాక ఖ‌ర్చు త‌ప్ప‌దు. అయితే, నంద్యాల ఉప పోరు మాత్రం ఖ‌ర్చును మ‌రింత‌గా పెంచేసింద‌ని అంటున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆయా పార్టీల నేత‌లేన‌ట‌!  ఈ ఉప ఎన్నిక‌ను టీడీపీ, వైసీపీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డంతో ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. దీంతో అభ్య‌ర్థుల‌కు ఖ‌ర్చు కూడా అంద‌నంత ఎత్తుకు చేరిపోయింద‌ని అంటున్నారు. టీడీపీ, వైసీపీ నేత‌లు ఇప్పటికే చెరో వంద కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. 

ఇందులో సగం ఖర్చు నామినేషన్లకు ముందే పెట్టారట. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఆయా పార్టీల‌ నేతలకు వసతి, సౌకర్యాలు, వారికి కావాల్సినవి సమకూర్చడానికే రోజుకు ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేస్తున్నార‌ని అంటున్నారు. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి పెద్దగా డబ్బుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదట. అటు భూమా కుటుంబం నుంచి ఇటు కొంద‌రు వ్యాపారుల నుంచి మ‌రికొంత పార్టీ ఫండ్ రూపంలోనూ ఆయ‌నకు అందుతోంద‌ని, దీని నుంచే బ్ర‌హ్మానంద రెడ్డి ఖ‌ర్చు పెడుతున్నార‌ని అంటున్నారు. ఇక‌, అభివృద్ధి పేరుతో చంద్ర‌బాబు ఏకంగా ప్ర‌జాధ‌నాన్ని అక్క‌డ పారిస్తున్నారు. 

ఇప్పుడు వైసీపీ విష‌యానికి వ‌చ్చేస‌రికి.. అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నిండా మునిగారంటున్నారు. ఏదో రూ.20 నుంచి రూ.30 కోట్లు అవుతుందని తొలిగా అంచనా వేశారట. కానీ ఇప్పుడు అది రూ.150 కోట్లు దాటిందంటున్నారు. ఇక‌ రాబోయే రెండు వారాల్లో అది మరింతగా పెరిగే వీలుంది. వైసీపీ నేతలంతా నంద్యాలలోనే మకాం వేయడం, పైగా జగన్ ఇక్కడే ఉండటం, ఆయన్ను కలిసేందుకు నేతలు పెద్ద ఎత్తున రావడంతో ఖర్చు పెరుగుతుందంటున్నారు. 

ఎన్నికల ఖర్చు కంటే.. వారి కోసం వెచ్చించే ఖర్చునే ఎక్కువగా అవుతుందని శిల్పా బ్రదర్స్ లోలోన మధనపడుతున్నారట. గెలిస్తే సరే.. లేకపోతే ఈదెబ్బతో తాము ఆర్థికంగా కుదేలవడం గ్యారెంటీ అంటున్నారట. ఏదేమైనా.. నంద్యాల ఉప ఎన్నిక ఇప్పుడు నేత‌ల జేబుల‌ను గుల్ల చేస్తోంద‌న‌డంలో సందేహం లేదు.