షాక్‌…. టీడీపీకి యాంటీగా నంద్యాల‌కు క్యూ క‌డుతోన్న లీడ‌ర్లు

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు దిమ్మ‌తిరుగుతోంది. ఆయ‌న ఊహించ‌ని విధంగా నంద్యాల ఉప ఎన్నిక యూట‌ర్న్ తీసుకుంటోంది. బాబుకు వ్య‌తిరేకంగా ఇత‌ర ప్రాంతాల‌కు చెందిన కొంద‌రు నేత‌లు ఇప్పుడు నంద్యాల‌కు క్యూ క‌ట్టారు. అక్క‌డ బాబును ఏకేయ‌డంతోపాటు.. విప‌క్షానికి బ‌లం చేకూరేలా వాళ్లు పెద్ద ఎత్తున స్కెచ్ సిద్ధం చేశారు. దీంతో నంద్యాల రాజ‌కీయ ఈక్వేష‌న్స్ ఎప్పుడెలా మారిపోతాయో చెప్ప‌డం క‌ష్ట‌మ‌ని అంటున్నారు విశ్లేష‌కులు. విష‌యంలోకి వెళ్తే.. నాగిరెడ్డి మ‌ర‌ణంతో ఏర్ప‌డ్డ ఖాళీని తాము కైవ‌సం చేసుకుంటామంటే తామేన‌ని అధికార, విప‌క్ష పార్టీలు పెద్ద ఎత్తున ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే.

అయితే, అధికారంలో ఉన్న చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా స్థానికంగా ఏ ఒక్క‌నేతా లేక‌పోయిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు ఇత‌ర ప్రాంతాల నుంచి మాత్రం నంద్యాల‌కు చేరుకుంటున్నారు. ముఖ్యంగా తూర్పు గోదావ‌రి నుంచి నేత‌లు ఎక్కువ‌గా నంద్యాల‌కు క్యూ క‌డుతున్నారు. 2014లో కాపుల‌కు చంద్ర‌బాబు హామీ ఇచ్చి కూడా ఎలాంటి చ‌ర్య‌లూ చేప‌ట్ట‌లేద‌ని తీవ్ర ఆగ్ర‌హంతో ఊగిపోతున్న కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం బాబుపై ఫైరైపోతున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ద‌ళితుల‌పై దాడులు కామ‌న్ అయిపోయాయ‌ని, వారికి ర‌క్ష‌ణ లేద‌ని పేర్కొంటూ మొన్నామ‌ధ్య రోడ్డుమీద‌నే భైటాయించిన మాజీ హ‌ర్ష‌కుమార్ కూడా ఇప్పుడు తాజాగా త‌న గ‌ళాన్ని నంద్యాల‌లో విప్పాల‌ని నిర్ణ‌యించారు.

అయితే, హ‌ర్ష కుమార్‌ను కాంగ్రెస్ గ‌తంలో బ‌హిష్క‌రించిన నేప‌థ్యంలో ఆయ‌న ఎవ‌రి ప‌క్షాన నిల‌బ‌డి బాబుపై పోరు చేస్తారో చూడాలి. ఇక‌, అదేస‌మ‌యంలో మాజీ సీఎం కొణిజేటి రోశ‌య్య‌కు అత్యంత ప్రియ‌శిష్యుడు ఏపీ ఐఐసీ మాజీ ఛైర్మెన్ శ్రీఘాకోల్లపు శివ రామ సుబ్రహ్మణ్యం వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. భారీ కార్ల ర్యాలీతో నంద్యాలకు బయల్దేరారు . నిజానికి గత ఎన్నికల్లో సమైక్యాధ్ర పార్టీ తరపున రాజమండ్రి అర్బన్ నుంచి అసెంబ్లీ కి పోటీ చేసిన సుబ్రహ్మణ్యం తన వ్యక్తిగత బలంతో సుమారు 12 వేల ఓట్లకు పైగా సాధించి వైసీపీ పరాజయానికి పరోక్షంగా బీజేపీ అభ్యర్థి భారీ విజయానికి దోహద పడ్డారు . ఈ నేపథ్యంలో వైసీపీలో ఆయన చేరిక ఆ పార్టీలో కొత్త సమీకరణలకు తెర తీస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

ఇదిలావుంటే, నంద్యాల ప్ర‌చారంలో ఇక‌పై టీడీపీకి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కాపుల ఉద్య‌మాన్ని అణిచివేస్తున్నాడ‌నే భావ‌న‌లో ఉన్న కాపులు .. బాబుకు వ్య‌తిరేకంగా క్యాంపైన్ నిర్వ‌హించేందుకు రెడీ అవుతుఉన్న‌ట్టు స‌మాచారం. ముఖ్యంగా పాద‌యాత్ర‌కు అనుమ‌తించ‌కుండా ముద్ర‌గ‌డ‌ను గృహ నిర్బంధం చేసి వేధిస్తున్నార‌నే ప్ర‌చారం తీవ్రంగా ఉండ‌డం కూడా బాబుకు మైన‌స్సేనంటున్నారు. మొత్తానికి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన ప్ర‌చారం ఒక ఎత్త‌యితే.. టీడీపీకి యాంటీగా ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించుకుని ఆదిశ‌గా ముందుకు న‌డ‌వ‌డం టీడీపీకి దెబ్బేన‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.