టీడీపీలో అన్న‌ద‌మ్ముల ఫైటింగ్‌

ప‌చ్చ‌ని కుటుంబంలో రాజ‌కీయాలు చిచ్చుపెట్టాయి. ఆప్యాయంగా పెరిగిన అన్న‌తమ్ముళ్ల మ‌ధ్య అగాధాన్ని సృష్టించాయి. ప్ర‌స్తుతం ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు తార‌స్థాయికి చేరుకున్నాయి. అన్న ఎదుగుద‌ల చూసి, తొక్కేయాల‌ని భావిస్తున్న‌ త‌మ్ముడు.. తమ్ముడు ఎక్క‌డ త‌న‌కు పోటీగా మార‌తాడోన‌ని అన్న.. ఇలా ఒక‌రినొక‌రు తీవ్ర పొర‌ప‌చ్చాల‌తో రాజ‌కీయాలు చేస్తున్నారు. అన్న‌త‌మ్ముళ్ల ఫైటింగ్ ఇప్పుడు టీడీపీ క్యాడ‌ర్‌ని అయోమ‌యానికి గురిచేస్తోంది. కొండ‌ప‌ల్లి బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య‌ విభేదాలు విజ‌య‌న‌గ‌రం జిల్లాలో టీడీపీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి.

జిల్లాలో ఒకప్పుడు కొండపల్లి పైడితల్లినాయుడు రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. ఈయన రాజకీయ వారసునిగా రెండో కుమారుడు కొండలరావు తెరపైకి వచ్చారు. పైడిత‌ల్లినాయుడు మరణానంతరం మూడో కుమారుడు అప్పలనాయుడు రాజకీయాల్లో వ‌చ్చి గజపతినగరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొండలరావు ఒకసారి ఎంపీపీగా పనిచేసి, ఆ తర్వాత పార్టీ పదవులకే పరిమితమయ్యారు. అప్పలనాయుడు పదవి చేపట్టినప్పటి నుంచి అప్రతిష్టను మూటగట్టుకుంటున్నారు. నియోజకవర్గంలో తనకంటూ ఓ గ్రూపును తయారు చేసుకోవడమే కాకుండా తమ్ముడి జోరుకు చెక్‌ పెట్టాలని రాజకీయ ఎత్తుగడలు వేయడం మొదలు పెట్టారు.

కొండలరావు బలపడితే నియోజకవర్గంలో తనకు ఇబ్బంది ఎదురవుతుందనో… తనకన్న బలమైన నాయకుడవు తారన్న భయమో తెలియదు గానీ ఆయన్ను మొదటినుంచీ అప్పలనాయుడు అణగదొక్కుతున్నారు. నియోజకవర్గ కేడర్‌ తనవైపే ఉండాలిగానీ… తన అన్నవైపు వెళ్లకూడదని వార్నింగ్‌ ఇచ్చినట్టు సమాచారం. మ‌రో అడుగు ముందుకేసి అటు పార్టీకి, ఇటు కుటుంబానికి చెడ్డ పేరు తెస్తున్న అప్పలనాయుడికి మంత్రి, ఇతరత్రా పదవులు ఇవ్వొద్దని నేరుగా సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అంతేనా… తనకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు.

మూడు రోజుల క్రితం గంట్యాడలో జరిగిన పార్టీ సమావేశంలో అన్న కొండలరావును లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యే అప్పలనాయుడు అంతెత్తున లేచారు. తన పేరు చెప్పుకుని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని , రైస్‌ మిల్లు ముసుగులో కోటా బియ్యం తెచ్చి అడ్డగోలు వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించినట్టు తెలిసింది. ఆయన్ను అరెస్టు చేయిస్తానని కూడా వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడినట్టు తెలిసింది. దీంతో ఇప్పుడు ఏ ఉప‌ద్ర‌వం ముంచుకొస్తుందో న‌ని అంతా ఉత్కంఠ‌తో ఉన్నారు.