కేంద్ర మంత్రి అశోక్‌కి టీడీపీ చెక్‌?!

అశోక గ‌జ‌ప‌తి రాజు. ఈ పేరుకు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు! ముఖ్యంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో పూస‌పాటి వంశానికి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. ఇక‌, ప్ర‌స్తుతం ఇక్క‌డి నుంచి టీడీపీలో చ‌క్రం తిప్పుతున్న అశోక్ గ‌జ‌ప‌తిరాజు.. జిల్లా రాజ‌కీయాల్లో అంతా త‌న మాటే వినాల‌నే ధోర‌ణిని కొన‌సాగిస్తున్నారు. అయితే, దీనిపై టీడీపీ అధినాయ‌క‌త్వం ఒకింత ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు స‌మాచారం. దీంతో అశోక్ గ‌జ‌ప‌తి హ‌వాను తగ్గించాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు ఊత‌మిస్తున్నాయి.

ప్ర‌స్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ టీడీపీ అధ్య‌క్షుల ఎంపిక జ‌రుగుతోంది. ఇప్ప‌టికి 12 జిల్లాల్లో అధ్య‌క్షుల ఎంపిక పూర్తి కూడా అయింది. అయితే, ఒక్క విజ‌య‌న‌గరంలో మాత్రం ఇప్ప‌టికీ అధ్య‌క్ష నియామ‌కం జ‌ర‌గ‌లేదు. నిజానికి ఈ జిల్లాతోనే అధ్య‌క్ష ఎంప‌క ప్రారంభం కావాల్సి ఉన్నా.. చివ‌రికి వ‌చ్చే స‌రికి కూడా అధ్య‌క్ష ఎంపిక జ‌ర‌గ‌క‌పోవ‌డం వెనుక పొలిటిక‌ల్‌గా అనేక కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్క‌డ జిల్లా అధ్య‌క్షుడిగా పూస‌పాటి వ‌ర్గానికి చెందిన ద్వారపురెడ్డి జగదీష్ కొన‌సాగుతున్నారు.

దీంతో అశోక్‌కి చెక్ పెట్టాలంటే.. జ‌గ‌దీష్‌ను త‌క్ష‌ణ‌మే తొల‌గించాలి. అయితే, అదంత వీజీ కాదు! అందుకే మిగితా జిల్లాల్లో నియామ‌కాలు చేప‌ట్టి.. త‌ర్వాత ఈ జిల్లా వ్య‌వ‌హారం చూస్తున్నారు. విజ‌య‌న‌గరంలో అశోక్ ఆధిప‌త్యం మ‌రింత ఎక్కువైంద‌ని, దీనికి చెక్ పెట్టాలంటే విజ‌య‌న‌గరంలో త‌మ‌కు అనుకూలంగా ఉన్న వ్య‌క్తిని అధ్య‌క్షుడిగా వేసుకోవాల‌ని అధిష్టానం భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే అధ్య‌క్ష ఎంపిక‌పై ప‌రిశీల‌కుడిగా మంత్రి గంటా విజ‌య‌న‌గ‌రంలో అడుగు పెట్టారు.

ఈ ప‌రిణామాన్ని అశోక్ వ‌ర్గం జీర్ణించుకోలేక పోతోంది. అదేస‌మ‌యంలో అశోక్ మాత్రం త‌న ప‌ట్టును వీడేది లేద‌ని క్లారిటీగా ఉన్నట్టు స‌మాచారం. అధి ష్టానం ఏం చేస్తుందో చూద్దామనే ధోరణిలో ఆయ‌న ఉన్నారు. తనకున్న విలువేంటో ఈ దెబ్బతో తేలిపోతుందని భావిస్తున్నట్టు తెలిసింది. తనను కాదని చేసే పరిస్థితి ఇక్కడ లేదన్న ధీమాతో ఉన్నట్టు సమాచారం. అందుకు భిన్నంగా జరిగితే తగిన మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుందని అశోక్ చెబుతున్న‌ట్టు స‌మాచారం. సో.. ఇప్పుడు విజ‌య‌న‌గ‌రం అధ్య‌క్ష ఎన్నిక టీడీపీకి స‌వాలుగా మారింద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు!