బుజ్జ‌గింపుల్లో బాబు మార్క్ వ్యూహం

టీడీపీ అంటే క‌మ్మ సామాజిక‌వ‌ర్గ నేత‌ల హ‌వా ఎక్కువ‌గా ఉంటుంద‌నేది తెలిసిందే! కానీ ఇప్పుడు ఇత‌ర సామాజిక‌వ‌ర్గ నేత‌లు ముఖ్యంగా రెడ్డు, కాపు నాయ‌కుల హ‌వా పెరుగుతోంది. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ద్వారా ఇది మ‌రింత తేట‌తెల్ల‌మైంది. ముఖ్యంగా అసంతృప్త నేత‌ల‌ను బుజ్జ‌గించేందుకు రెడ్డి, కాపు సామాజిక‌వ‌ర్గ నేత‌ల‌ను రంగంలోకి దించారు సీఎం చంద్ర‌బాబు. ఇది కూడా బాబు మార్కు రాజకీయ వ్యూహంగానే క‌నిపిస్తోంద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం.

మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌తో టీడీపీలోని క‌మ్మ సామాజిక‌వ‌ర్గ నేత‌లు బాగా అసంతృప్తికి గుర‌య్యారు. ధూళిపాళ్ల న‌రేంద్ర‌, ప‌య్యావుల కేశ‌వ్ వంటి వారు ఈసారి మంత్రి వ‌ర్గంలో త‌మ‌కు చాన్స్ ద‌క్కుతుంద‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. క‌ష్ట‌కాలంలో పార్టీ వెన్నంటి ఉన్న త‌మ‌కు అధినేత స‌రైన న్యాయం చేస్తార‌నిబ‌లంగా న‌మ్మారు. కానీ క‌మ్మ సామాజిక‌వ‌ర్గం నుంచి లోకేశ్ మిన‌హా ఎవ‌రికీ.. కేబినెట్ బెర్తు ద‌క్క‌లేదు. దీంతో వారు తీవ్రంగా నిరాశ‌చెందారు. అయితే వీరిని బుజ్జ‌గించేందుకు చంద్ర‌బాబు.. రెడ్డి నేత‌ల‌ను రంగంలోకి దించారు.

ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి, మంత్రి అమ‌ర్నాథ్‌రెడ్డిని వారి వద్ద‌కు పంపించారు. జేసీ స్వ‌యంగా ప‌య్యావుల కేశ‌వ్‌తో మాట్లాడ‌గా, న‌రేంద్ర‌తో అమ‌ర్నాథ్‌రెడ్డి భేటీ అయ్యారు. అలాగే క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికే చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్.. ఏకంగా కొత్త పార్టీ పెడ‌తాననే ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. ఆయ‌న్ను బుజ్జగించేందుకు కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన బ‌డేటి బుజ్జి రంగంలోకి దించారు. ఆయ‌న్ని స‌ముదాయించి పార్టీలోనే ఉండేలా చేస్తాన‌ని ప్ర‌క‌టించేలా చేశారు.

తొలినాళ్ల‌లో టీడీపీలో అసంతృప్తుల‌ను చ‌ల్లార్చేందుకు ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌లు వెంట‌నే సీన్లోకి ఎంట‌ర్ అయిపోయేవారు. కానీ ఇప్పుడు బ‌ళ్లు ఓడ‌లు.. ఓడ‌లు బ‌ళ్లు అయ్యాయి. కమ్మ సామాజిక వ‌ర్గ నేత‌ల‌ను బుజ్జ‌గించేందుకు ఇత‌ర సామాజిక వ‌ర్గాల నేత‌లు ఎంట‌ర్ అవుతున్నారు. మ‌రి రాజ‌కీయాల్లో ప‌రిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వ‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌నం కావొచ్చు!