జ‌న‌సేన‌లోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే

జ‌న‌సేనాని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్పుడు `ఊ` అంటారా.. ఎప్పుడు ఆ పార్టీలోకి వెళిపోదామా? అని ఎంతోమంది నేత‌లు వేచిచూస్తున్నారు. ఈ లిస్టులో తెలుగుదేశం పార్టీ నేత‌లు ముందువ‌రుస‌లో ఉన్నారు. అక్టోబ‌ర్ నుంచి ప్ర‌జా క్షేత్రంలో దిగుతాన‌ని, సంస్థాగ‌తంగా పార్టీని బ‌లోపేతం చేస్తాన‌ని.. ప‌వ‌న్ ప్ర‌కటించ‌డంతో అంద‌రిలోనూ ఉత్కంఠ మొద‌లైంది. అయితే ఇప్పుడు జ‌న‌సేన‌లో మాజీ ఎమ్మెల్యే చేర‌బోతున్నారనే వార్త రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయ‌న‌కు జ‌నసేన టికెట్ కూడా ఖాయ‌మైంద‌ని అందుకే ఆయ‌న టీడీపీకి గుడ్‌బై చెప్ప‌బోతున్నార‌నే విష‌యం.. హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

సీఎం చంద్ర‌బాబుతో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీ అవ్వ‌డం పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చర్చ‌కు దారితీసింది. నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు, తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింద‌ని తెలుస్తోంది. అంతేగాక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు ఎక్క‌డ నుంచి పోటీచేయాల‌నే అంశంపైనా వీరు చ‌ర్చించారని స‌మాచారం. ఇందులో భాగంగా.. ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరును జ‌న‌సేనకు కేటాయించార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు జనసేన తరపున టికెట్ ఖరారు అయినట్టుగా తెలుస్తోంది.

ఈ మేరకు అన్నా రాంబాబుకు క్లారిటీ వచ్చిన నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్టు సమాచారం. రాజీనామాకు వారం రోజుల ముందే పవన్ కల్యాణ్ తో రాంబాబు సమావేశం అయినట్టుగా తెలుస్తోంది. ఆ రోజు లభించిన స్పష్టతతోనే ఈయన టీడీపీకి రాజీనామా చేశాడని గిద్దలూరు జనాలు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అన్నా రాంబాబుకు ఇది వరకు మెగా ఫ్యామిలీతో పని చేసిన నేపథ్యం ఉంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున రాంబాబు గిద్దలూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రజారాజ్యం విలీనంతో కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ఆపై తెలుగుదేశం పార్టీలోకి వచ్చి గిద్దలూరు నుంచి పోటీ చేశారు.

ప్ర‌స్తుతం వైకాపా తరపున గెలిచిన అశోక్ రెడ్డి తెలుగుదేశంలోకి ఫిరాయించాడు. దీంతో అన్నా రాంబాబు – అశోక్ రెడ్డిల మధ్య విబేధాలు తార‌స్థాయికి చేరాయి. టీడీపీలో ఉంటే టికెట్ దక్కడమూ సందేహమే దక్కినా గెలవడమూ సందేహమ‌నే అభిప్రాయం అయ‌న‌లో మొద‌లైంది. ఈ నేప‌థ్యంలోనే పవన్ పార్టీలోకి చేరిపోవడానికి సిద్ధ‌మైపోయార‌ట‌. అంతేగాక ఆ పార్టీ నుంచి టికెట్ కూడా దాదాపు ఖ‌రారు కావ‌డంతో.. ఇక నుంచి యాక్టివ్ కాబోతున్నార‌ట‌. జ‌న‌సేన‌లోకి ఒక‌సారి వ‌ల‌స‌లు మొద‌లైతే.. ఇక నేత‌లంతా క్యూ క‌ట్టే అవ‌కాశాలు లేక‌పోలేదు. మ‌రి వీటిని ఎలా నియంత్రిస్తారో వేచిచూడాల్సిందే!!