పవ‌న్ ప్ర‌భావం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే!!

నంద్యాల ఉప ఎన్నిక సాధార‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తోంది. 2019 ఎన్నిక‌ల‌కు రిఫ‌రెండంగా అటు టీడీపీ, ఇటు వైసీపీ ఈ ఎన్నిక‌ను భావిస్తున్నాయి. ఇప్ప‌టికే అటు సీఎం చంద్ర‌బాబు, ఇటు ఆయ‌న త‌న‌యుడు లోకేష్ నంద్యాల‌లో ఓట‌ర్లపై వ‌రాల జ‌ల్లులు కురిపిస్తున్నారు. అన్ని వ‌ర్గాలు త‌మ‌కు మ‌ద్ద‌తు ఇస్తాయ‌ని భావించిన టీడీపీ ఆశ‌లు.. వైసీపీ నిర్వ‌హిం చిన ఒక్క‌ స‌భ‌తో చెల్లాచెదురైపోయాయి. ఇక మంత్రులు, నాయ‌కుల వ‌ల్ల కాద‌ని టీడీపీ అధినేత చంద్ర బాబుకు అనుభ‌వంలోకి వ‌చ్చింది. అందుకే ఇప్పుడు జ‌న‌సేనానిని నంద్యాలలో దించేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. స‌మ‌యం మించిపోతున్న త‌రుణంలో ప‌వ‌న్‌తో వీలైనంత‌గా ప్ర‌చారం చేయించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు.

నంద్యాల‌లో ప్ర‌తిప‌క్ష వైసీపీ నిర్వ‌హించిన స‌భ‌.. టీడీపీ నేత‌ల్లో గుబులు పుట్టిస్తోంది. కొన్ని రోజులుగా దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, కీలక‌మైన నేత‌లు, సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న త‌నయుడు లోకేష్‌.. అంద‌రూ నంద్యాల‌పైనే పూర్తిగా దృష్టిసారిస్తున్నారు. ఉప ఎన్నిక‌ల్లో గెలిచి త‌మ బ‌లాబ‌లాలు ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌ని ఇరు పార్టీల నేత‌లు కంటి మీద కునుకు లేకుండా ప‌నిచేస్తున్నారు. ఓట‌ర్ల‌ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు సామ‌దానభేద‌దండోపాయాల‌న్నీ పాటిస్తున్నారు. అయితే టీడీపీ మ‌రింత దూకుడుగా ప్ర‌చారం చేస్తోంది. అయితే ఇప్పుడు జ‌గ‌న్ స‌భ‌తో నేత‌ల్లో కొంత టెన్ష‌న్ మొద‌లైంది. ఎంతగా వీలైతే అంతగా ప్రచారం చేయాలని ప్రయత్నాలు చేస్తోంది.

ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ ను కూడా రంగంలోకి దించాలని టీడీపీ శతథా ప్రయత్నాలు చేస్తోంది. నంద్యాల్లో పవన్ కల్యాణ్ చేత ప్రచారం చేయించేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు-ప‌వ‌న్ మ‌ధ్య జ‌రిగిన భేటీలోనూ నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు అంశం వీరి మ‌ధ్య ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. ఈ ఎన్నిక‌ల్లో మ‌ద్ద‌తు అంశంపై త్వ‌ర‌లో చెబుతాన‌ని ప‌వ‌న్ ప్ర‌కటించారు. అయితే ఈ స‌మ‌యంలోనే జ‌గ‌న్ స‌భ నిర్వ‌హించ‌డం, దానికి భారీగా జ‌నాలు త‌ర‌లిరావ‌డం జ‌రిగిపోయాయి. దీంతో వీలైనంత త్వ‌ర‌గా ప‌వ‌న్‌ను రంగంలోకి దించాల‌ని చంద్ర‌బాబు యోచిస్తున్నారు.

జనసేన అధినేత చేత ప్రచారం చేయించాలని, దాంతో ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని టీడీపీ భావిస్తోంది. పవన్ కల్యాణ్ తమ వ్యక్తే అని ఇప్పటికే టీడీపీ నేత‌లు నంద్యాల్లో ప్ర‌చారం చేస్తున్నారు. అఖిలప్రియ, కేఈ వంటి వాళ్లు ఇదే మాట చెబుతున్నారు. ఈ త‌రుణంలోనే కొన్ని వ‌ర్గాల ఓట్లు ప‌వ‌న్ ప్ర‌భావితం చేయ‌వ‌చ్చ‌ని స్ప‌ష్టంచేస్తున్నారు. పోలింగ్ కు ఎలాగూ ఇంకా ఇరవై రోజుల సమయం ఉంది. ఆలోగా పవన్ ను దించి నంద్యాల‌లో ప్రచారంచేయించాని టీడీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మ‌రి నంద్యాల ఉప ఎన్నిక‌కే చంద్ర‌బాబు ఇన్ని పాట్లు ప‌డుతున్నారు! మ‌రి పవ‌న్ ప్ర‌భావం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే!!