టీడీపీలో బాబు మాట‌కు విలువ లేదా…

ప్ర‌పంచంలో రాజ‌కీయ పార్టీల‌లో నాయ‌కుల మ‌ధ్య విబేధాలు స‌హ‌జం. అధికార పార్టీలో ఇవి మ‌రింత ఎక్కువుగా ఉంటాయి. ఆధిప‌త్యం అనే ఒకే ఒక్క అంశం నాయ‌కుల మ‌ధ్య విబేధాల‌ను తారాస్థాయికి చేర్చుతుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే తెలుగుజాతి ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా వ్యాపింప‌జేసి, ప్ర‌స్తుతం ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ క్ర‌మ‌శిక్ష‌ణ‌ను మిగిలిన పార్టీల‌తో పోల్చ‌లేం.

36 ఏళ్ల ప్ర‌యాణంలో నాడు ఎన్టీఆర్ నుంచి నేడు చంద్ర‌బాబు పాల‌న వ‌ర‌కు టీడీపీ అంటే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు. అయితే ఈ 36 ఏళ్ల‌లో ఎన్న‌డూ లేనంత‌గా టీడీపీలో క్ర‌మ‌శిక్ష‌ణ గాడి త‌ప్పుతోందా ? అంటే ? తాజా ప‌రిణామాలు అవున‌నే స్ప‌ష్టం చేస్తున్నాయి. తాజాగా విశాఖ‌లో మ‌హానాడు జ‌రుగుతున్న వేళ పార్టీలో గ్రూపు రాజ‌కీయాలు, ఒక‌నాది వెంట ఒక‌టిగా గంద‌ర‌గోళ ప‌రిస్థితులు చోటు చేసుకోవం పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో, నాయ‌కుల్లో తీవ్ర ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతోంది.

నిన్న‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు ఆదేశం ఇస్తే దానికి కట్టుబడి పనిచేసే తత్వం నేతల్లో ఉంది. సమస్యలు ఉన్నా వీలైనంత వరకూ రోడ్డెక్కకుండా లోలోపలే పరిష్కరించుకొనే ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇప్పుడు పార్టీలో నాయ‌కులు మంచినీళ్లు తాగినంత ఈజీగా అసంతృప్త రాగాలు ఆల‌పిస్తున్నారు. త‌ణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాపై పోలీసు కేసు పెడితే ఆ జిల్లా ఎమ్మెల్యేలంద‌రూ చిన్న తిరుగుబాటు లేవ‌నెత్తారు.

ఇక ప్ర‌కాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్ట‌పాటి ర‌వికుమార్‌, ఎమ్మెల్సీ క‌ర‌ణం బ‌ల‌రాం కొట్టుకునే వ‌ర‌కు వెళ్లింది ప‌రిస్థితి. ఇక జంపింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త వ‌ర్సెస్ పాత నాయ‌కుల మ‌ధ్య ఇప్ప‌ట‌కీ పొస‌గ‌డం లేదు. ఇక బీజేపీతో పొత్తుపై టీడీపీ నాయ‌కులు వ్యాఖ్య‌లు చేస్తూ చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పి తెప్పిస్తున్నారు. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నానికి ఈ విష‌యంలో బాబు వార్నింగ్ ఇచ్చినా ఆయ‌న మాత్రం త‌న వ్యాఖ్య‌ల‌కే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని మ‌రోసారి షాక్ ఇచ్చారు.

ఇక కొద్ది రోజుల క్రితం జ‌రిగిన మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌లో మంత్రి ప‌ద‌వి రాలేద‌ని పార్టీలో సీనియ‌ర్లు, జూనియ‌ర్లు ఎంత ర‌చ్చ చేశారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఏదేమైనా మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్న సమయంలో పార్టీలో ఈ అసంతృప్తులు చూస్తుంటే బాబు మాట‌కు ఉన్న విలువ‌పై డౌట్లు మీద డౌట్లు వ‌స్తున్నాయి.