అక్క‌డ‌ మాత్రం రివ‌ర్స్ వాతావ‌ర‌ణం టీడీపీ త‌మ్ముళ్ల‌కు ప‌ద‌వులు వద్దంట‌

రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ నేత‌లు ప‌ద‌వుల కోసం రాజీనామాల‌కు సైతం సిద్ధ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. మొన్నా మ‌ధ్య మంత్రి ప‌ద‌వి ఊడే స‌రికి బొజ్జ‌ల ఎంత హంగామా చేశారో.. ప‌ద‌వి ద‌క్కక పోయే స‌రికి బోండా ఉమా ఎలా అలిగారో అంద‌రికీ తెలిసిందే. అయితే, ప‌రిస్థితి అంతా ఇలానే ఉంటుందా? అంటే అనంత‌పురాన్ని చూస్తే.. మాత్రం అలా ఉండ‌ద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అనంత టీడీపీ వింత ప‌రిస్థితి రాజ్య‌మేలుతోంది.

ప‌ద‌వుల్లో ఉన్న వారు ఎప్పుడెప్పుడు ఆ ప‌ద‌వుల‌కు రాజీనామా చేద్దామా? అని తెగ ఎదురు చూస్తున్నారు. ఇది విచిత్రంగా అనిపించినా ముమ్మాటికీ నిజం. నిజానికి ప్ర‌స్తుత రాజ‌కీయాల‌ను చూస్తే.. అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట. ఇలాంటి జిల్లా టీడీపీలో కమిటీలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పార్థసారధి, వరదాపురం సూరి గ‌త కొన్నేళ్లుగా కొన‌సాగుతున్నారు. అయితే, హ‌ఠాత్తుగా వారు ఆ పదవులు తమకు వ‌ద్దంటునన్నారు.

అయితే, అధినాయ‌క‌త్వం మాత్రం వీరిని ఆ ప‌ద‌వుల్లోనే కొన‌సాగించాల‌ని చూస్తోంది. విష‌యంలోకి వెళ్తే.. 2010 నుంచి పార్థసారథి జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పు కూడా పార్థసారథి సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించారు. అయితే, 2019 ఎన్నిక‌ల నేప‌థ్యంలో తాను ప్రజలతో ఎక్కువగా మమేకయ్యేందుకు వీలుగా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని పార్థసారథి కోరుతున్నారు.

ఇక సూరి విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న పార్టీకి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. ఈయ‌న కూడా త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని చెబుతున్నారు. 2019 ఎన్నిక‌ల నేప‌థ్యంలో తాను పూర్తిగా ప్ర‌జ‌ల్లోనే ఉండాల‌ని భావిస్తున్న‌ట్టు ఆయ‌న చెబుతున్నారు. ఇక‌, వీరిద్ద‌రూ ఆ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తే.. వాటిని అందుకునేందుకు మ‌రికొంద‌రు ట్రై చేస్తున్నారు. కానీ, టీడీపీ అధినేత మాత్రం వీరిని సాగ‌నంపేందుకు సిద్ధంగా లేదు. రాష్ట్ర‌మంత‌టా ఒక వాతావ‌ర‌ణం ఉంటే.. అనంత‌పురంలో మాత్రం రివ‌ర్స్ వాతావ‌ర‌ణం ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం జరిగే జిల్లా మహానాడులో ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.