గుడివాడ‌లో ఆప‌రేష‌న్ నాని… స్టార్ట్ చేసిన టీడీపీ

కృష్ణా జిల్లాలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఓ ఫైర్ బ్రాండ్‌. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన నాని 2004 ఎన్నిక‌ల్లో రాజ‌కీయారంగ్రేటం చేశారు. ఆ ఎన్నిక‌ల్లో వైఎస్ గాలిలోను ఆయ‌న గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. 2009లో రెండోసారి కూడా గెలిచిన నాని ఆ త‌ర్వాత చంద్ర‌బాబు, టీడీపీతో విబేధించి వైఎస్‌.జ‌గ‌న్ చెంత‌కు చేరిపోయారు. 2014 ఎన్నిక‌ల్లో ముచ్చ‌ట‌గా గుడివాడ‌లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఈ మూడు ఎన్నిక‌ల్లోను పార్టీలు మారినా నాని గెలిచాడంటే అక్క‌డ పార్టీ ఇమేజ్ నాని ఇమేజ్ ముందు బలాదూరే అయ్యింది. నాని గెలిచిన ప్ర‌తిసారి ఆయ‌న గెలిచిన పార్టీ ప్ర‌తిప‌క్షంలోనే ఉంది. అయినా నాని మాత్రం సొంత ఇమేజ్‌తోనే గెలిచాడు.

టీడీపీకి గుడ్ బై చెప్పిన‌ప్పుడు నాని చంద్రబాబుపై తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. ఆ త‌ర్వాత సైతం నాని చంద్ర‌బాబును టార్గెట్‌గా చేస్తూ ప‌దునైన పంచ్‌లు విసురుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గుడివాడ‌లో పాగా వేయాల‌ని టీడీపీ అధినాయ‌క‌త్వం భావిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇక్క‌డ చంద్ర‌బాబుతో పాటు లోకేశ్ సైతం ప్ర‌త్యేకంగా కాన్‌సంట్రేష‌న్ చేశారు. లోకేశ్ ఇప్ప‌టికే ఒక‌టి రెండుసార్లు ప‌ర్య‌టించి కార్య‌క‌ర్త‌ల‌తో మీట్ అయ్యారు.

నానిని ఓడించేందుకు ఇప్ప‌టికే టీడీపీ గ్రౌండ్ వ‌ర్క్ స్టార్ట్ చేసేసింది. నాయ‌కులంద‌రూ క‌లిసిక‌ట్టుగా ఉండాల‌ని లోకేశ్ వీరికి ఆదేశాలు జారీ చేసేశారు. ఇక ఇటీవ‌ల జ‌రిగిన కౌన్సెల‌ర్ ఉప ఎన్నిక‌లో వైసీపీ సిట్టింగ్ సీటు కూడా నిల‌బెట్టుకోలేక‌పోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీ త‌ర‌పున నానిని టార్గెట్ చేసేందుకు టీడీపీలో ఓ టీంనే రెడీ అవుతోంది.

ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌గా మాజీ ఎమ్మెల్యే రావి వెంక‌టేశ్వ‌ర‌రావు ఉన్నారు. ఇక న‌గ‌ర ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న సైతం ఇక్క‌డ వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షిస్తూ ప్రొటోకాల్‌ను ఇక్క‌డే ఎంచుకున్నారు. ఇక ఆఫ్కాబ్ చైర్మ‌న్‌, మాజీ మంత్రి పిన్న‌మ‌నేని వెంకటేశ్వ‌ర‌రావు సైతం గుడివాడ‌పై కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నారు. ఇక మునిసిప‌ల్ చైర్మ‌న్ య‌ల‌వ‌ర్తి శ్రీనివాస‌రావు సైతం నానికి షాక్ ఇచ్చి టీడీపీలోకి జంప్ చేసేశారు. వీరంతా నానిని ఓడించేందుకు ర‌క‌ర‌కాలుగా స్కెచ్‌లు గీస్తున్నారు.

ఇక తాజాగా ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న అయితే నానికి స‌వాల్ విసిరారు. నానికి ద‌మ్ముంటే నియోజ‌క‌వ‌ర్గంలో జడ్పీటీసీ నుంచి పంచాయతీ సభ్యుడి వరకు ఏదో ఒక పదవికి రాజీనామా చేసి పోటీ చేయడానికి సిద్ధమా అని ప్ర‌శ్నించారు. ఉప ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ గెలిస్తే ఎమ్మెల్యే పదవికి వైసీపీ తరఫున నాని పోటీ చేయకూడదని, వైసీపీ గెలిస్తే టీడీపీ ఆ నియోజకవర్గంలో పోటీ చేయదన్నారు. ఏదేమైనా ఈ సారి నాని ఎట్టి ప‌రిస్థితుల్లోను గెల‌వ‌కూడ‌ద‌ని టీడీపీ ఇక్క‌డ దూకుడు రాజ‌కీయాల‌తో ముందుకెళుతోంది.