జ‌గ‌న్ కంచుకోట‌ను కూల్చుతోన్న ఆ ఇద్ద‌రు ఎవ‌రు..!

వైఎస్‌.ఫ్యామిలీ పేరు చెపితే క‌డ‌ప జిల్లాలో….అందులోను పులివెందుల‌లో ఆ ఫ్యామిలీ క్రేజ్‌, ప‌ట్టు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. నాలుగు ద‌శాబ్దాలుగా వైఎస్‌.ఫ్యామిలీకి కంచుకోట‌గా ఉన్న పులివెందుల కోట‌కు ఇప్పుడిప్పుడే బీట‌లు వారుతోంది. అక్కడ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో సైతం టీడీపీ రోజురోజుకు స్ట్రాంగ్ అవుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బ‌లం ఉండి కూడా జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్‌.వివేకానంద‌రెడ్డి ఓడిపోవ‌డం ఆ పార్టీ వ‌ర్గాల‌కు, వైఎస్ అభిమానుల‌కు అస్స‌లు మింగుడు ప‌డ‌లేదు.

వైఎస్ కంచుకోట‌గా స్వ‌ల్పంగా ప‌డిన బీట‌లు రోజురోజుకు పెద్ద‌వి అవుతున్నాయి. ఈ కంచుకోట‌లో అధికార టీడీపీకి చెందిన ఇద్ద‌రు లీడ‌ర్లు జ‌గ‌న్‌కు పెద్ద స‌వాల్ విస‌ర‌డంతో పాటు కంట్లో న‌లుసులా మారారు. ఆ ఇద్ద‌రు నేత‌లు ఎవ‌రో కాదు ఒక‌రు సతీష్‌కుమార్‌రెడ్డి. రెండవ వారు రామ్‌గోపాల్‌రెడ్డి. సతీష్‌కుమార్‌రెడ్డి.. మండలి డిప్యూటీ చైర్మన్ కాగా రామ్‌గోపాల్‌రెడ్డి ప్రస్తుతం రాయలసీమ టీడీపీ శిక్షణా శిబిరం డైరెక్టర్‌.

పులివెందుల‌లో టీడీపీని బ‌లోపేతం చేసే విష‌యంలో వీరిద్ద‌రు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా వీరు మాత్రం మొండిప‌ట్టుద‌ల‌తో అక్క‌డ ముందుకెళుతున్నారు. దివంగ‌త మాజీ సీఎం రాజ‌శేఖ‌ర్‌రెడ్డి టైంలో ఈ ఇద్ద‌రు నేత‌ల‌కు చెందిన ల‌క్ష‌లాది రూపాయ‌ల ఆస్తులు ధ్వంస‌మ‌య్యాయి. వీరిద్ద‌రి దూకుడు దెబ్బ‌తో అక్క‌డ రోజు రోజుకు టీడీపీ స్ట్రాంగ్ అవుతోంది. 2004, 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ ఓట్ల శాతం మునుపటి కంటే పెరిగింది.

2014లో అయితే టీడీపీకి ఏకంగా అక్క‌డ 50 వేల‌కు పైగా ఓట్లు రావ‌డం ఓ రికార్డే అని చెప్పాలి. ఇక గండికోట నుంచి పులివెందుల‌కు నీళ్లు తెచ్చేవ‌ర‌కు గ‌డ్డం తీయ‌న‌ని స‌తీష్‌రెడ్డి శ‌ప‌థం చేసి మ‌రీ నీళ్లు రప్పించారు. ఇక రామ్‌గోపాల్‌రెడ్డి సైతం పులివెందుల‌లో అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకు పోతూ పార్టీని ప‌టిష్టం చేస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే ఇక్క‌డ టీడీపీ బ‌లం రోజు రోజుకు పెరుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ గెలుపోట‌ములు ఎలా ఉన్నా టీడీపీకి వ‌చ్చే ఓట్లు వైసీపీకి దిమ్మ‌తిరిగేలా ఉండ‌డం ఖాయ‌మ‌న్న టాక్ కూడా క‌డ‌ప జిల్లాలో జోరుగా ట్రెండ్ అవుతోంది..