బాబుకు వాస్తు పిచ్చి.. పార్టీ ఆఫీస్‌కి వెళ్ల‌డం మానేశారు!

ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ.. సొంత పార్టీని, పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఎవ‌రూ దూరం చేసుకోరు. క‌నీసం నెల‌కోసారైనా వాళ్ల‌ను ప‌ల‌క‌రించి, ప‌రిస్థితిపై వాక‌బు చేస్తారు. కానీ, ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు మాత్రం ఈ విష‌యంలో తాను ప‌ట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న‌ట్టుగా ఉంటున్నార‌ని అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు. విష‌యంలోకి వెళ్తే.. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీ, తెలంగాణ‌ల్లో టీడీపీని రెండుగా విభ‌జించారు. ఎక్క‌డిక‌క్క‌డ బ‌లోపేతం చేసుకుంటూ.. టీడీపీని జాతీయ పార్టీగా కూడా ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబు ఆయ‌న కుమారుడు మంత్రి లోకేష్‌లే అధ్య‌క్ష‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వుల్లో ఉన్నారు.

ఇక‌, ఏపీలో ప్రధాన కార్యాల‌యాన్ని గుంటూరులో ఏర్పాటు చేశారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. చంద్ర‌బాబు ఈ కార్యాల‌యం ముఖం చూడ‌డ‌మే లేద‌ని కార్య‌క‌ర్త‌లు అంటున్నారు. ఇటీవ‌ల చంద్ర‌బాబుకు తెలంగాణ సీఎం కేసీఆర్ మాదిరిగా వాస్తుపై న‌మ్మ‌కం బాగా పెరిగిపోయింద‌ని అందుకే ఆయ‌న టీడీపీ రాష్ట్ర కార్యాల‌యానికి రావ‌డం మానేశార‌ని అంటున్నారు. గుంటూరులో కార్యాల‌యం క‌ట్టాక‌.. కేవ‌లం రెండు సార్లు ఒక‌టి ఎన్‌టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌, రెండు పంచాంగ శ్ర‌వ‌ణానికి వ‌చ్చార‌ని అంటున్నారు.

వాస్త‌వానికి హైద‌రాబాద్‌లో ప్ర‌ధాన కార్యాల‌యం ఉన్న‌ప్పుడు ఎంత బిజీగా ఉన్నా కూడా.. చంద్ర‌బాబు.. వారానికి రెండు మూడు సార్లు వెళ్లి కార్య‌క‌ర్త‌ల‌తో మాట్లాడి పార్టీ ప‌రిస్థితిని వాక‌బు చేసేవార‌ని, ఇప్పుడు అలాంటి నియమం ఏదీ పెట్టుకోలేద‌ని చెబుతున్నారు. దీనివ‌ల్ల క్షేత్ర‌స్థాయిలో కేడ‌ర్ నిరాశ‌లో కూరుకుపోతోంద‌ని అంటున్నారు. 2019 ఎన్నిక‌లకు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డం.. ఎలాగైనా గెలిచి తీరాల‌ని నిర్ణ‌యించిన ప‌క్షంలో బాబు వైఖ‌రి ఇలా ఉంటే ఎలా అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. వాస్తు బాగోపోతే స‌రిచేయించుకునైనా కార్యాల‌యానికి రావాలి క‌దా అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి బాబు ఎలాంటి ఆన్స‌ర్ ఇస్తారో చూడాలి.